పెన్ను మార్క్ కూడా ఒకే.. ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి సర్క్యులర్ పై హైకోర్టుకు బీజేపీ
posted on Dec 4, 2020 8:49AM
జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభం అవుతుందనగా నిన్న అర్ధరాత్రి తెలంగాణ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. బ్యాలెట్ పేపర్లపై కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్నవే కాకుండా…పోలింగ్ కేంద్రాల సంఖ్యను సూచించే ముద్రలు వేసినా లేక మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సంఘం తాజా ఆదేశాల పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే జారీ చేసిన ఆ సర్క్యులర్ వెనుక ఆంతర్యం ఏంటని అయన ఎస్‌ఈసీని నిలదీశారు. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ ఈ సర్క్యులర్ జారీ చేశారని అయన ఆరోపించారు. తక్షణం ఈ సర్క్యులర్‌ను రద్దుచేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని అయన ప్రకటించారు. అయితే తాము కౌంటింగ్‌ను మాత్రం అడ్డుకోబోమన్నారు. ఈ సర్క్యులర్ విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గుణపాఠం తప్పదన్నారు. అంతేకాకుండా ఎస్‌ఈసీని గ్యాంబ్లర్‌గా అభివర్ణించిన సంజయ్.. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం నిర్ణయం పై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ అంశంపై కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటు వెళుతుందో చూడాలి.