తెలుగు వన్ చెప్పినట్లే ఫలితం! గ్రేటర్ అంచనా అంటున్న జనం
తెలుగు వన్ ఎగ్జిట్ పోల్ అంచనా మరోసారి నిజమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై తెలుగు వన్ ఇచ్చిన అంచనా నూటికి నూరు శాతం అక్షర సత్యమైంది.
గ్రేటర్ ఎన్నికలపై ఏ సర్వే ఈయనంతా కచ్చిత ఫలితాలు ఇచ్చింది తెలుగు వన్. ఆ అంచనా ప్రకారమే గ్రేటర్ ఫలితాలు వచ్చాయి. పార్టీలకు వచ్చే ఓవరాల్ సీట్లే కాదు నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ముందు ఉంటుందనే విషయంలోనూ తెలుగు వన్ అంచనా నిజమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది తెలుగు వన్. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈసారి బాగా దెబ్బ తగలనుందని, 60 సీట్ల లోపే ఆ పార్టీకి సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి అనూహ్య విజయం సాధించబోతుందని, ఆ పార్టీ 45 నుంచి 50 డివిజన్లు గెలుచుకుంటుందని తెలుగు వన్ అంచనా వేసింది. అంతేకాదు నియోజకవర్గాల వారీగా చూస్తే ఎల్బీ నగర్ లో కమలం.. కూకట్ పల్లి, శేరిలింగం పల్లిలో కారు స్వీప్ చేస్తాయని వెల్లడించింది. గోషామహాల్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ.. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుస్తాయని తెలుగు వన్ చెప్పింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ కొంత పోటీ ఇస్తుందని కూడా అంచనా వేసింది. చాలా డివిజన్లలో మెజార్టీ స్వల్పంగా ఉంటుందని కూడా తెలుగు వన్ సర్వేలో తేలింది. తెలుగు వన్ చెప్పినట్లే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలుగు వన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఇదే.. గతంలో ఇచ్చిన స్టోరీ ఉన్నది ఉన్నట్లుగా మళ్లీ ఇస్తున్నాం.. మీరే చూడండి..
గ్రేటర్ లో అనూహ్య ఫలితాలు! మేయర్ పీఠం ఆ పార్టీకేనా?
గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు చేంజ్ కోరుకున్నారా? అధికార పార్టీ అభివృద్ది నినాదాన్ని ఆదరించారా? పాతబస్తిలో పతంగి పార్టీ పరిస్థితి ఏంటీ?. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలింగ్ సరళి అధారంగా లెక్కలు వేసుకుంటూ ఎవరి గెలుస్తారో అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్లో ఈసారి విలక్షమైన తీర్పు రాబోతుందని తెలుస్తోంది.
అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగిందంటున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులంతా కమలానికి మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. గతంలో నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ ఈసారి 45 నుంచి 50 డివిజన్లు గెలవచ్చని చెబుతున్నారు. గతంలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి 60 డివిజన్లలోపే ఆగిపోతుందని తెలుస్తోంది. ఓల్ట్ సిటీలో పట్టున్న ఎంఐఎంకు కూడా షాక్ తగలనుందని, ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గవచ్చని.. అక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కు 6 నుంచి 10 సీట్లు గెలవొచ్చంటున్న పొలిటికల్ అనలిస్టులు.. తెలుగు దేశం పార్టీ నాలుగైదు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని చెబుతున్నారు.
ఎల్బీనగర్, ఉప్పల్ , మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగిందని చెబుతున్నారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా... 2016లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి టీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, రెండుమూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎల్బీనగర్ జోన్ లో ముందు నుంచి కాంగ్రెస్ బలంగా కనిపించినా... పోలింగ్ రోజున కొంత వెనకబడిందని తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్ సెగ్మెంట్ లో బీజేపీ ఆరు నుంచి 8 డివిజన్లు గెలవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఉప్పల్ లో అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని తెలుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో మూడు పార్టీలకు సమంగా సీట్లు రావచ్చంటున్నారు. మల్కాజ్ గిరి జోన్ లో తొమ్మిది డివిజన్లు ఉండగా.. అధికార పార్టీకి నాలుగు, బీజేపీకి రెండు వస్తాయని మరో మూడు చోట్ల టఫ్ పైట్ నడించిందని అంచనా వేస్తున్నారు. ఏఎస్ రావు నగర్ లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని, ఆ సీటుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా చోట్ల గొడవలు జరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో కూడా బీజేపీ. టీఆర్ఎస్ కు సమానంగా సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ కు రెండు సీట్లు రావొచ్చంటున్నారు. సెటిలర్లంతా బీజేపీ వైపు నిలిస్తే మాత్రం ఫలితం ఏకపక్షంగా ఉండవచ్చంటున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు ఉండగా.. ఇక్కడ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. నాలుగు డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటం గులాబీ పార్టీకి కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారు. కేపీహెచ్బీ, బాలాజీనగర్ లో మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ పైట్ నడిచింది. శేరిలింగం పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. ఇక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. ఇక్కడ సెటిలర్లే కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ కు ఐదు, బీజేపీకి రెండు రావచ్చని, వివేకానంద నగర్ డివిజన్ లో టీడీపీకి అవకాశం ఉందని చెబుతున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సాగిందంటున్నారు. సికింద్రాబాద్ , అంబర్ పేట నియోజకవర్గాల్లో బీజేపీకి... సనత్ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ మెజార్టీ డివిజన్లు వస్తాయని చెబుతున్నారు. ఖైరతాబాద్ , ముషిరాబాద్ లో మాత్రం హోరాహోరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కు చీలకుండా ముస్లిం ఓట్లలో ఎక్కువ శాతం కారుకు పడితే అధికార పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవచ్చు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎంకే మెజార్టీ డివిజన్లు వచ్చినా... గతంలో కంటే సీట్లు తగ్గవచ్చంటున్నారు. నాంపల్లి, మలక్ పేట నియోజకవర్గాల్లో కొన్ని సీట్లు బీజేపీకి .. గోషామహాల్ నియోజకవర్గంలో కొన్ని సీట్లు కమలానుకి రావచ్చంటున్నారు. బీజేపీలోని విభేదాలు ఇక్కడ ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంచనా వేస్తున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లు ఉండగా.. అసదుద్దీన్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి ఎంఐఎం రెండు గెలవచ్చని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యే సొదరుడు, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. అత్తాపూర్ లోనూ గట్టి పోటీనే జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లను గెలిపించుకోవడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించినా.. అవి గెలవడం టీఆర్ఎస్ అంత ఈజీ కాదంటున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉండగా.. గ్రేటర్ వ్యాప్తంగా ఇక్కడే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ మూడు డివిజన్లలో బీజేపీ., టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రచారం చేయడం, కేంద్ర సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తంగా హోరాహోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఊహించని రిజల్ట్స్ కూడా రావచ్చంటున్నారు. కొన్ని డివిజన్లలో 10 వేల ఓట్లు మాత్రమే పోల్ కావడంతో 4 వేల ఓట్లు వచ్చిన వారు కూడా గెలిచే అవకాశం ఉంది. అలాంటి డివిజన్లలో షాకింగ్ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కంటే టీఆర్ఎస్ కు భారీగా సీట్లు తగ్గినా ఎక్స్ అఫిషియో సభ్యులు.. అవసరమైతే ఎంఐఎంతో కలిసి మరోసారి మేయర్ పీఠం సాధిస్తుందని మాత్రం చెబుతున్నారు.