కరోనా టీకా ప్రభావాన్ని పరీక్షిస్తాం! ముగ్గురు అగ్రనేతల సాహసం
posted on Dec 3, 2020 @ 4:03PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో అమెరికాకు చెందిన ముగ్గురు మాజీ అగ్రనేతలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు తామే ముందుగా కరోనా టీకాను తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ లు దీనికి సంబంధించిన ప్రకటనలు చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన తర్వాత కరోనా వ్యాక్సిన్లను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు సిద్ధమని ముగ్గురు అగ్రనేతలు ప్రకటించారు.
అమెరికాలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. వైరస్ ప్రభావం మొదలైన తొలినాళ్లలో యూఎస్ లో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. మధ్యలో కొంచెం తగ్గాయి. గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా మరణాలు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌కు చెందిన ఫైజర్, మోడెర్నా ఔషధ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్స్ ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీంతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన వెంటనే ప్రజలకు ఈ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. కాని అక్కడి ప్రజల్లో ఈ వ్యాక్సిన్ల భద్రత, ప్రభావంపై అనుమానం నెలకొంది. సుమారు 42 శాతం మంది ఈ టీకాలను తీసుకోవడానికి సుముఖంగా లేరని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ తరుణంలో ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు తాము స్వచ్ఛందంగా టీకా తీసుకుంటామని ప్రకటించారు.
ప్రజల్లో టీకా భద్రత, ప్రభావంపై విశ్వాసాన్ని పెంపొందిచేందుకు తాను కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధమని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఒబామా ప్రకటించారు. మరో మాజీ అధ్యక్షుడు జార్జీ బుష్ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ చెప్పారు. అలాగే వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, ప్రోత్సహించడానికి బహిరంగంగా టీకాను తీసుకోవడానికి బిల్ క్లింటన్ కూడా రెడీగా ఉన్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా వెల్లడించారు.