గ్రేటర్ పోలింగ్ పై గందరగోళం! ఎస్ఈసీ తీరుపై విపక్షాల అనుమానం
posted on Dec 3, 2020 @ 3:17PM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ పై విపక్షాల అనుమానాలు తీరడం లేదు. ఎస్ఈసీ ఇచ్చిన క్లారిటీ లేని లెక్కలు.. పొంతన లేని వివరాలతో పోలింగ్ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ పై ఎన్నికల సంఘం నుంచే భిన్న లెక్కలు వచ్చాయి. ఫైనల్ ఓటింగ్ ఫిగర్ మూడు సార్లు మారింది. పోలింగ్ శాతంపై నెలకొన్న గందరగోళంతో.. చివరి గంట పోలింగ్ లో ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి ఓటమి భయంలో అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డి దారిలో గెలిచేందుకు కుట్రలు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో చివరి గంటలో 10 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం మిస్టరీగానే మిగిలింది.పాతబస్తిలో అయితే దాదాపు 15 శాతం పోలింగ్ చివరి గంటలోనే జరిగింది.చార్మినార్ , చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో తొలి 9 గంటల్లో 20 శాతం పోలింగ్ జరిగితే.. చివరి రెండు గంటల్లోనే మరో 25 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్లు పెద్దగా కనిపించ లేదు. పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. అయినా చివరి గంటలో ఏకంగా 12శాతం పోలింగ్ పెరగడం అర్ధం కాకుండా పోయింది. ఓల్ట్ సిటీలో ఓ పార్టీ చివరి గంటల్లో రిగ్గింగ్ చేసిందనే అనుమానాలు వస్తున్నాయి. పోలింగ్ మొదలైన తర్వాత ప్రతి గంట గంటకు ఓట్ల శాతం వివరాలు ప్రకటించిన ఎన్నికల సంఘం.. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ప్రకటించడం నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 74లక్షల ఓట్లలో 35లక్షల ఓట్లకు గాను 46.68 శాతంగా పోలింగ్ నమోదైందని ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. నిజానికి గతంలో పోలింగ్ ముగిసిన నాలుగైదు గంటల్లోనూ ఓట్లశాతంపై పూర్తి క్లారిటీ వచ్చేది. కాని ఈసారి మాత్రం పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తర్వాత అధికారికంగా ఫైనల్ లెక్క వచ్చింది. అది కూడా గందరగోళంగానే ఉంది. ఓల్డ్ సిటీలో పోలింగ్ పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంచన్ బాగ్ లో అత్యధికంగా 90 శాతం మంది మహిళలు ఓటేశారని ముందుగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఆ తర్వాత సవరించిన జాబితాలో అది 45% అని పేర్కొంది. మొత్తంగా ఈ డివిజన్ లో 47.98 % పోలింగ్ నమోదైతే, అంతకు ముందు వెల్లడించిన వివరాల ప్రకారం 70 % ఉండటం ఎన్నికల సంఘం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
గ్రేటర్ పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగానే సాగింది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు శాతం కూడా పోలింగ్ జరగలేదు. సాయంత్రం 5గంటల వరకు 36.73శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి ఎలా పోటెత్తారన్నది చర్చగా మారింది. 10 గంటల పాటు పోలింగ్ కేంద్రాలకు రాని ఓటర్లు చివరి గంటలో ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదని విపక్షాల వాదన. ఎన్నికల సంఘం సహకారంతో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని బీజేపీ ఆరోపిస్తోంది. విచ్చలవిడిగా రిగ్గింగ్, దొంగ ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పాతబస్తిలోని ఘాన్సీబజార్ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ 1 నుంచి 19 వరకు, పురానాపూల్ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్ జరిగిందని.. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పోలింగ్ బూత్ లలోకి వెళ్లి రిగ్గింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు రాంచంద్రరావు. రిగ్గింగ్ చేసుకోవాలనే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్ జరపాలని కోరారు. అయితే బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించ లేదు రాష్ట్ర ఎన్నికల సంఘం.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎక్కడా మాట్లాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి ఎస్ఈసీలు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి పోలింగ్ వివరాలు చెప్పేవారంటున్నారు. పార్థసారథి మాత్రం ఓటేసిన తర్వాత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఒక్క మాట చెప్పి మళ్లీ కనిపించకుండా పోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ వివరాలు అప్ డేట్ చేయలేదు. అంతేకాదు చివరి గంటలో 10 శాతానికి పైగా పోలింగ్ ఎలా జరిగిందన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోతోంది ఎస్ఈసీ. అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనుమానాలపై పార్థసారథి స్పందించకపోవడం సరికాదంటున్నారు రాజకీయ అనలిస్టులు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆయన పూర్తిగా లొంగిపోయారని మండిపడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణలో నోటిఫికేషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు అంతా వివాదంగానే మారింది. అధికార పార్టీకి కలిసొచ్చేలా హడావుడిగా షెడ్యూల్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చేలా పోలింగ్ డేట్ ఫిక్స్ చేయడం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ లో భాగంగానే జరిగిందనే విమర్శలు వచ్చాయి. పోలింగ్ శాతం అనుకున్నతంగా జరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు. గ్రేటర్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఉన్నవారికే రెండు,మూడు ఓట్లు ఉండగా... ఓటేసేందుకు ఆసక్తి ఉన్నవారి ఓట్లు మాత్రం గల్లంతయ్యాయి. పోల్ స్లిప్పులు పంచడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని ఓటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ స్లిప్పులు రాకపోవడంతో కొందరు ఓటర్లు ఓటేసేందుకు రాలేదని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అరకొర వసతులు.. మైనర్లతో విధులు.. ట్రైనింగ్ లేని వారికి డ్యూటీలు... ఇలా అన్ని విషయాల్లోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం అపవాదులను మూటగట్టుకుంది. టీచర్లు లేకుండా పోలింగ్ జరగడం కూడా ఇదే తొలి సారంటున్నారు. మొత్తంగా ఎస్ఈసీ పార్థసారథి వ్యవహారంతో గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదనే అభిప్రాయమే జనాల నుంచి వస్తోంది. అధికార పార్టీకి సహకరిస్తూ.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయన రాజ్యాంగ స్పూర్తిని మంటకలిపారనే విమర్శలు వస్తున్నాయి.