ఏపీ సీఎం జగన్ పై విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీ సీఎం జగన్‌ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను నియంత అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని సంబోధిస్తూ.. జగన్‌కు ప్రజల కష్టాలు ఏమాత్రం తెలియడం లేదని విమర్శించారు. గతంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం జగన్ చెప్పారని.. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని అయన ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని అయన అన్నారు. జగన్ సతీమణి భారతి రాష్ట్రానికి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని.. అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని... మొన్న మార్చిలో అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ సొంత ఊరిలోని మహిళకే రక్షణ లేదు.. లోకేష్ ఫైర్ 

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని అయితే వాటిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేసారు. సాక్షాత్తు సీఎం జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అయన విమర్శించారు. ప్రభుత్వం కేవలం చట్టాల పేరు చెబుతూ కాలయాపన చేస్తోంది తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని అయన మండిపడ్డారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఈ విమర్శలు చేశారు.   "రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. అయితే ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి జగన్ ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. అంతేకాకుండా ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

కొత్త పార్లమెంట్ జాతికే గర్వ కారణం! ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ 

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు.  కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో చాలా కాలంగా జాప్యం జరుగుతోందన్నారు.  ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంటు, కేంద్ర సచివాలయ భ‌వనాలు ప్రభుత్వ పనులకు పూర్తిస్థాయిలో స‌రిపోవ‌డం లేద‌న్నారు కేసీఆర్. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని  కోరుకుంటున్నానని తెలిపారు తెలంగాణ సీఎం. ప్రస్తుతం  తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.    పార్లమెంట్ కోసం కొత్తగా నిర్మించనున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు  ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటుగా వ్యవహరిస్తోంది.  'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు  మొత్తం వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఇందులో భాగంగా త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు.

ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 

ఏలూరులో ప్రబలుతున్న వింత రోగంపై ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నందున  ఏలూరులో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏలూరు పరిస్థితులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు.  రేపు ఏం జరుగుతుందనే భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలని కోరారు.    తాగునీటిలో సీసం, నికెల్‌ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయపడుతున్నారన్నారు చంద్రబాబు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డులు అందజేయాలని సూచించారు చంద్రబాబు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు. హెల్ప్ లైన్‌ ఏర్పాటు ఆలోచన రాకపోవడం ప్రభుత్వ మరో వైఫల్యమని చంద్రబాబు విమర్శించారు. తక్షణమే బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత డిమాండ్‌ చేశారు. సత్వర ఉపశమన, సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలన్నారు చంద్రబాబు.  

నెరేడ్ మెట్ లో టీఆర్ఎస్ విజయం! గ్రేటర్ లో 56కు చేరిన బలం 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది.  668 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. నేరెడ్ మెట్ గెలుపుతో  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. నేరెడ్ మెట్ ఎన్నికల్లో మొత్తం 25 వేల 177 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు పూర్తయ్యాక టీఆర్ఎస్ కు మొత్తం 10, 330 ఓట్లు రాగా, బీజేపీ కు 9 వేల 662 ఓట్లు పోలయ్యాయి.    జీహెచ్‌ఎంసీ ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లెక్కింపు చేపట్టారు. అయితే  టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్‌ ఫలితాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో లెక్కింపును చేపట్టారు. సైనిక్‌పురిలోని భవన్స్‌ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు బయటకు వచ్చారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

మోడీతో చేతులు కలిపి సిగ్గుపడ్డాను! ఒబామా పేరుతో నకిలీ ట్వీట్ వైరల్ 

అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా పేరుతో ఓ నకిలీ ట్వీట్ వైరల్ గా మారింది. భారతదేశ ప్రధానమంత్రిపై ఒబామా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆ పోస్టు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తేలడంతో అంతా కూలయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను చేతులు కలిపిన వేళ, ఎంతో సిగ్గుపడ్డానని బారక్ ఒబామా వ్యాఖ్యానించినట్టు ఆ ట్విట్టర్ పోస్ట్ ఉంది. డిసెంబర్ 5న ఒబామా తన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా స్క్రీన్ షాట్ చూపుతుండగా, అది నకిలీదని తేలింది.    నరేంద్ర మోడీ, బారక్ ఒబామా ఇద్దరూ కలిసిన వేళ, షేక్ హ్యాండ్ ఇచ్చుకోగా, ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఈ మనిషితో నేను ఇవాళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి రావడం చాలా సిగ్గుచేటు" అని ఒబామా వ్యాఖ్యానించినట్టు ఆ ట్వీట్ కనిపిస్తోంది.. ఈ పోస్ట్ వైరల్ కాగానే దీనిలో ఎంత నిజముందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఈ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా తేల్చారు. నరేంద్ర మోడీ గురించి ఒబామా ఎన్నడూ అలా మాట్లాడలేదని ట్విట్టర్ 'అడ్వాన్డ్స్ రీసెర్చ్' సెట్టింగ్స్ ను వాడి కనిపెట్టారు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీన్నే నిర్ధారించింది. ఒకవేళ ఒబామా ఆ వ్యాఖ్యలు నిజంగా చేసివుంటే అది అంతర్జాతీయ వార్తగా మారి ఉండేదని, దీన్ని చూడగానే ఇది ఫేక్ ట్వీట్ అనే భావించామని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.

కేసీఆర్ పై రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది: విజయశాంతి

నియంతృత్వ పాలన సాగిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై రైతులు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. భారత్‌ బంద్‌కు కేసీఆర్ మద్దతు తెలపడం పట్ల ఆమె ట్విట్టర్ ద్వారా  తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబంధులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే .. ఆయన తుపాకి రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని విజయశాంతి అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని విజయశాంతి చెప్పారు.    కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు.. కాని సీఎం గారి ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ లో  చెప్పారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చెయ్యాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారన్నారు. దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహమని అని విజయశాంతి చెప్పారు. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా? అని విజయశాంతి ప్రశ్నించారు.

భారతీయులందరికి గొప్ప శుభవార్త.. డిసెంబర్ 25 నుండి వ్యాక్సిన్ పంపిణి షురూ

భారతదేశం మొత్తం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గత 9 నెలలుగా దేశం లోని ప్రతి ఒక్కరిని భయ పెడుతున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ ఈ డిసెంబర్ 25 నుండి భారత్ లో అందుబాటులోకి రానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినమైన డిసెంబర్ 25న భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. భారత ప్రధాని మోడీ స్వయంగా టీకా పంపిణీని ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 20 రోజుల వ్యవధిలో.. అంటే, జనవరి 15 నాటికి కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత నుండి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు.   వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే "కోవిన్" పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు కాగా.. దీనికి సంబంధించి లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రాల అధికారులకు సూచించింది. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ లో టీకాలు ఎలా అందించాలనే విషయాన్నివివరించింది. ఈ సాఫ్ట్ వేర్ లో పేరు నమోదైతేనే వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు తరువాత కనీసం అరగంట పాటు అక్కడే ఉండాలని, వారికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ లేకుంటేనే ఇంటికి వెళ్లాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక ఈ "కోవిన్" సాఫ్ట్ వేర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను వైద్య బృందం తనిఖీ చేస్తుందని, ఆపై వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపి టీకాను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.   వ్యాక్సిన్ తీసుకున్న వారి మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుందని, ఆపై మూడు వారాల తరువాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన తేదీ గురించిన సమాచారాన్ని పంపుతామని, అంతేకాకుండా రెండు డోస్ లను తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక ధ్రువపత్రం అందుతుందని తెలియజేశారు. ఇక వ్యాక్సిన్ కేంద్రంలో స్పాట్ రిజిస్ట్రేషన్ కు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మొదట ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ తీసుకున్నారో మూడు వారాల తర్వాత అదే కంపెనీ వ్యాక్సిన్‌ ను తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక కంపెనీ టీకా, రెండోసారి మరో కంపెనీ టీకా తీసుకుంటామంటే మాత్రం కుదరదు. ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్‌ మైనస్‌ 2, మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉండేదే వస్తుందని అధికారులు చెబుతున్నారు   ఇదిలావుండగా, ఇప్పటికే డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద మూడు వ్యాక్సిన్ సంస్థలు అత్యవసర అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సమావేశం కానున్న నిపుణుల కమిటీ ఈ మూడింటిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తొలి దశలో మొత్తం మూడు కోట్ల డోస్ ల వ్యాక్సిన్లను నిల్వ చేసేలా ఎక్కడికక్కడ ఫ్రీజర్ బాక్స్ లను సిద్ధం చేసారు. మరోపక్క 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణలో ఉన్న భారత బయోటెక్‌‌, ఇ-బయోలజికల్‌ లిమిటెడ్‌లో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే పరిశోధన కేంద్రాలను ఈరోజు సందర్శించనున్నారని.. తిరిగి వెళ్లే ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. గ్లోబల్‌ రవాణాకు వీలుగా ఎన్నో సదుపాయాలు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు కార్గోలో ఉన్నాయని వెల్లడించాయి. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా వ్యాక్సిన్‌ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో నిర్మలమ్మ

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకూ చోటు దక్కింది. ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు నిలిచారు. ఇక భారత్ కు చెందిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (41 వ స్థానం), టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్‌ మల్హోత్రా(55), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(68) లకు స్థానం లభించింది. ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది. ఇక యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్‌ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 10 దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, 38 కంపెనీల సీఈవోలు, వినోద రంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులనూ ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతమైన మహిళలుగా పేర్కొంది.

కొత్త చట్టాలు వద్దేవద్దని తెగేసి చెప్పిన రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. రైతులకు బాసటగా నిన్న దేశ వ్యాప్త బంద్ విజయవంతమైన తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఆయనతో రైతు సంఘాలు నిన్న సాయంత్రం సమావేశమయ్యాయి. అయితే ఇరు పక్షాలు కూడా తమ పూర్వ వాదనలకే కట్టుబడ్డాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈరోజు బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి. అయితే కొత్త చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం వాటిలో తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఒక ప్రతిపాదనను ఈరోజు రైతులకు పంపనుంది. ఈ సవరణల పై రైతు సంఘాల నేతలు బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే మంగళవారం జరిగిన భారత్‌ బంద్‌ చాల రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో హోమ్ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఓ పక్క బంద్‌ జరుగుతున్న సమయంలోనే ఆయన రైతు సంఘాల నాయకులకు కబురు పంపారు. దాంతో సింఘూ సరిహద్దుల నుంచి 13 మంది రైతు సంఘం నేతలు నిన్న రాత్రి ఆయనను కలిశారు.   అయితే షా నివాసంలో చర్చలకు కొందరు రైతు నేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్‌ సభకు చెందిన హన్నన్‌ మొల్లా, భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ వారిలో ఉన్నారు. అసలు దీనిపై అమిత్‌ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, "చట్టాలను రద్దు చేస్తారా లేదా... అవును లేదా కాదు... అన్నది మాత్రమే అడుగుతున్నామని" రైతు నేత రుద్రు సింగ్‌ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు. దీంతో సమావేశం కూడా అదే తరహాలో సాగింది. అయితే రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం... కొత్తగా చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్‌ షా తేల్చి చెప్పారు. చట్టాల రద్దు తప్ప ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అయితే చట్ట సవరణలకు తాము వ్యతిరేకమని, తమ వాదనలో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు మరో ప్రతిపాదన ఉంచారు. "చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ మేము పరిశీలించాం. ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు రేపటికి పంపిస్తాం... పరిశీలించండి" అని కోరారు. దీంతో రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు బుధవారం మంత్రులు నరేంద్ర తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్‌ సభ నేత హన్నన్‌ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు తెలిపారు. "ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా తో సమావేశానికి రావాలని.. అయితే సమావేశానికి వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు" అని రైతుల నేత రాకేశ్ తికైత్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన మరి కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను మరింత ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. దీంతో బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ తేలవచ్చని తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా రైతుల నిరసనలో భాగమయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలులతో కూడిన అయిదుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.

‘వ్యవసాయ’ విన్యాసాలు చూడతరమా...

కోరస్ కలిపిన పార్టీలే కదం తొక్కుతున్న వైచిత్రి   గళం మార్చిన పవార్, కేజ్రీవాల్, జగన్, బాబు   తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్టూన్ల యుద్ధం   మన రాజకీయ పార్టీలకు రైతులపై టన్నుల కొద్దీ పొంగుకువస్తున్న ప్రేమానురాగాలు చూస్తుంటే.. రైతులంటే వారికి ఇంత సానుభూతి ఉందా అనిపిస్తుంది. పాపం రైతన్నలు కూడా రాజకీయ పార్టీలు తమ పట్ల ప్రదర్శిస్తున్న మద్దతు, సానుభూతి చూసి మురిసిముక్కలవుతున్నాడు. అంతా కట్టకట్టుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి, దేశమంతా బందు పెట్టినందుకు పాపం ఆ పిచ్చి మారాజులు,  తమ జన్మధన్యమయిందనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు తమకు దన్నుగా ఉన్న ఇవే పార్టీలు.. కొద్దికాలం క్రితం కొత్త చట్టం తెచ్చిన సర్కారుకు, పార్లమెంటు సాక్షిగా సాగిలబడ్డాయన్న నిజాన్ని,  నిలకడమీద గానీ తెలుసుకోలేకపోయారు. నరేంద్రమోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై.. వివిధ రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తే,  ఊసరవెల్లి కూడా సిగ్గుపడక తప్పదేమో?   మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు.. బీజేపీ వాదిస్తున్నట్లు రైతులకు మేలు చేయవచ్చు. అదే సమయంలో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతు ప్రయోజనాలను అంబానీ- అదానీలకు తాకట్టుపెట్టేలా ఉండవచ్చు. ఎవరి కోణం వారిది. ఎవరి వాదన వారిది. కాబట్టి ఎవరి కోణంలో వారిదే రైటనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారంతా ఏ సమస్యలయినా తమ కళ్లతో చూసి, తమ మెదడుతో ఆలోచిస్తారు కాబట్టి! అయితే.. ఆయా అంశాలపై మొదట వినిపించిన వాణి, ఆ తర్వాత సమయానుకూలంగా మారి,  అవకాశవాద మలుపు తీసుకోవడమే అభ్యంతరం, అనైతికం. ఒక అంశంపై ప్రాంతీయ-జాతీయ పార్టీలన్నీ నిర్లజ్జగా యూటర్ను తీసుకోవడమే రోత. దేశ ప్రజలంతా చూస్తుండగా, బిల్లుకు మద్దతునిచ్చిన అవే స్వరాలు.. బయటకొచ్చి రంగుమార్చి, అందుకు భిన్నంగా గళమెత్తడమే ఇప్పటి (అ)రాజకీయం!   ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు.. ఆమ్ ఆద్మీ, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలన్నీ సమర్ధించాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే.. బీజేపీ కంటే ఎక్కువగా బిల్లును సమర్థించారు. బిల్లును సమర్ధించని వారంతా దళారీనన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి బిల్లు తీసుకురావలసిన అవసరం ఉందని సమర్ధించారు. టీడీపీ దానికి కొన్ని సవరణలు చేసింది. మద్దతుధర, కార్పొరేట్ల పెత్తనంతో వచ్చే నష్టం, కాంట్రాక్టు ఫార్మింగు వల్ల రైతులకొచ్చే నష్టం వంటి అంశాలను ప్రస్తావించింది. కానీ బిల్లును మాత్రం వ్యతిరేకించలేదు.   ఇప్పుడు మాట మార్చిన వైసీపీ స్వరాన్ని, విజయసాయిరెడ్డి ప్రసంగాలతో కలిపి టీడీపీ మీడియాకు విడుదల చేసింది. ఆ రకంగా ఏపీకి సంబంధించినంత వరకూ,  రెండు ప్రధాన పార్టీలు బిల్లును సమర్ధించాయి. కాకపోతే.. తాము బిల్లుకు సవరణలు ప్రతిపాదించామని వాదించేందుకు, టీడీపీ ఒక వెసులుబాటు కల్పించుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా బిల్లును సమర్ధించాయి. ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా అది రైతులకు మద్దతుగానే రోడ్డెక్కింది. అయితే రైతులకు మద్దతుపై టీఆర్‌ఎస్ వైఖరిని విమర్శిస్తూ బీజేపీ.. ఎన్డీఏ రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ, టీఆర్‌ఎస్...  సోషల్‌మీడియా వేదికగా సంధించుకుంటున్న కార్టూన్ల యుద్ధం ఆసక్తికలిగిస్తోంది. తాజాగా  రైతులు రోడ్డెక్కి, ఢిల్లీని ముట్టడించిన అంశంపై అగ్గిరాజుకుంది. దీనితో బీజేపీ మినహా అన్ని పార్టీలూ,  తమ మనుగడ కోసం  రైతుల వెంట నడవటం అనివార్యమయింది. ఫలితంగా మంగళవారం భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో, బీజేపీ మినహా అన్ని పార్టీలూ దానికి మద్దతునివ్వక తప్పని పరిస్థితి. విచిత్రమేమిటంటే... యుపిఏ హయాంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న శరద్‌పవార్..  వ్యవసాయంలో చట్టాలు, సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ మేరకు ఆయన  ఢిల్లీ-మధ్యప్రదేశ్ సీఎం లయిన షీలాదీక్షిత్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖలు కూడా రాశారు. ఇప్పుడు ఆయన పార్టీ కూడా, రైతు ఉద్యమానికి మద్దతునివ్వడం విస్మయకరం. అయితే, తాను ఆ లేఖ రాసిన మాట నిజమేనని ఇప్పుడు అంగీకరించడం కొంత నయం. ఇప్పుడు రైతు సమస్యపై గత్తర చేస్తున్న పంజాబ్ కిసాన్ యూనియన్.. 2018లో దళారుల వల్ల తమకు మద్దతుధర లభించడం లేదని, తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం కార్పొరేట్లకు ఇవ్వాలని నానా యాగీ చేసింది. ఆ మేరకు ప్రతి ఏటా  కేంద్రానికి లేఖ రాస్తూనే ఉంది.  ఆ తర్వాత చాలా ఏళ్లకు మోదీ సర్కారు రైతుచట్టం తెచ్చింది. కానీ విచిత్రంగా అదే పంజాబ్ కిసాన్ యూనియన్, ఇప్పుడు రోడ్డెక్కిన రైతులకు నాయకత్వం వహిస్తోంది. తాను కోరిన రైతుచట్టాన్నే తెచ్చిన మోదీ సర్కారును దునుమాడుతోంది. ఇక పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతునిచ్చిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులకు అన్నపానీయాలు సమకూరుస్తోంది.  ఇది అవసరార్ధ రాజకీయాలకు పరాకాష్ఠ కాదా?   ఇక పార్లమెంటులో బేషరతుగా బిల్లు ఆమోదించిన వైసీపీ...ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పక్షానే బంద్‌కు మద్దతునివ్వడం, అప్పుడు పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించకుండా ఉన్న టీడీపీ కూడా,  రైతన్నకు మద్దతునివ్వడం రోత రాజకీయాలకు పరాకాష్ఠ. అన్నట్లు.. ఓవైపు వైసీపీ ఈ బిల్లును ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే, ఆ పార్టీకి చెందిన నేత పొట్లూరి మాత్రం.. బ్రహ్మాండంగా ఉన్న బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని, ట్వీట్ చేయడం మరో ట్విస్టు.   చిరాఖరుగా బీజేపీ కూడా వ్యవసాయంపై రాష్ట్రానికో రకంగా స్పందించడం మరో వైచిత్రి. రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాత్రం తన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులెవరయినా వచ్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే వారి లారీలు జప్తు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించడం.. బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.  ఈవిధంగా.. వ్యవసాయ బిల్లులో,  రాజకీయ పార్టీల విన్యాసాలు చూసిన వారికెవరికయినా.. ‘స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న’ గిరీశం ఉపదేశం గుర్తుకురావడం ఖాయం! -మార్తి సుబ్రహ్మణ్యం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. కాళ్లు, చేతులు నరుకుతా

పటాన్‌ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ మీడియా ప్రతినిధితో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. భూ కబ్జాలపై ఓ కథనాన్ని రాసిన సదరు రిపోర్టర్‌ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. నీవు ఎవ్వడివిరా? అంటూ బూతు పురాణం అందుకోవడమే కాదు.. వస్తావా? లేదా ఎక్కడున్నావో చెప్పు.. నేనే వస్తా.. కాళ్లు, చేతులు నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే నేను మాట్లాడేది రికార్డు చేసుకో.. దిక్కు ఉన్న చోట చెప్పుకో.. పోలీసులకు ఫిర్యాదు చేసుకో.. అంటూ బూతులు తిట్టారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది. జర్నలిస్టు పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.

కేజ్రీవాల్ ప్లాన్ లీక్.. దీంతో సీఎం హౌస్ అరెస్ట్

దేశ వ్యాప్తంగా ఈరోజు రైతులకు బాసటగా నిర్వహించిన ఒక రోజు బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ బంద్ జరిగింది. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి ధర్నా చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ సంగతి లీక్ కావడంతో ఆయనను అడుగు బయట పెట్టకుండా ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే తాను సీఎం హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులకు తమ ప్లాన్ తెలిసిపోవడంతో బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే బంద్ ముగియడంతో ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.   అయితే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధంపై ఆప్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్‌ను, రైతులను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. దీంతో ఆప్ కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటి ముందు సిసోడియా ధర్నా నిర్వహించారు.

ఓటుకు నోటు కేసు.. ఎమ్మెల్యే సండ్రకు నిరాశ

ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులో సండ్ర దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 15న సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.   కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా.. ఈనెల 15వ తేదీన జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది. 

టీఆర్ఎస్ నేతలకు నిలదీతలు! బంద్ లో కనిపించని రైతులు 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించినా ప్రజల నుంచి స్పందన పెద్దగా కనిపించలేదు. కేటీఆర్ సహా మంత్రులంతా రోడ్డెక్కినా.. ఎక్కడా రైతులు వాళ్లకు సపోర్ట్ గా నిలవలేదు. బంద్ లో టీఆర్ఎస్ నేతల, కార్యకర్తల హడావుడే ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లోనూ భారత్ బంద్ ప్రభావం ప్రజలపై పడలేదు. రోడ్లు బ్లాక్ చేసి ఆందోళనలు చేసినా.. స్థానికులు వ్యతిరేకించడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు. రైతుల సమస్యలపై బంద్ నిర్వహిస్తూ.. రైతులు లేకుండా నిరసనలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతుల ఫోటోలు కాకుండా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేయడాన్ని కొందరు ప్రశ్నించారు.   భారత్ బంద్ లో భాగంగా రోడ్డుపై ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చాాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలపై స్థానికులు తిరగబడ్డారు. రాష్ట్రంలో రైతులు సమస్యలను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఆందోళనలు చేయడం ఏంటనీ అన్నదాతలు కూడా పలు ప్రాంతాల్లో  టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై స్థానికులు జనం తిరగపడ్డారు. ఉష ముళ్లపూడి కామన్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేస్తుండగా.. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని జనాలు ప్రశ్నించారు. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు.. ఇప్పుడే కనిపించాయా? అంటూ ఓ మహిళ నిలదీసింది. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని ఎమ్మెల్యేను కడిగి పారేసింది. కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ ధర్నాలో మంత్రి  ఈటల రాజేందర్ ముందే రైతుల కష్టాలను ఏకరువు పెట్టాడు యువ రైతు. రైసు మిల్లుల్లో తాలు పేరిట కోతలు విధిస్తున్నారని, మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు మంత్రి రాజేందర్.    రైతులు పిలుపిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. వేరువేరుగా ఆందోళనలు నిర్వహించాయి.అయితే నిరసనల్లో భాగంగా రెండు పార్టీల మధ్య చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. మోడీ సర్కార్ తో పాటు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు వారితో గొడవలకు దిగారు.  కరీంనగర్ జిల్లాలో భారత్‌ బంద్ ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ ఎలా పాల్గొంటుందని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో కరీంనగర్ ప్రధాన బస్టాండ్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లావెల్గటూర్ మండలంలో  మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు కాంగ్రెస్నాయకులు. భారత్ బంద్ లో పాల్గొనేందుకు ధర్మపురి వెళుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ను చొప్పదండి వద్ద అడ్డుకున్నారు.ఖమ్మం జిల్లా మధిర లో కాంగ్రెస్ టిఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.   భారత్ బంద్ లో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ మండలకేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గీయులు మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.తూప్రాన్ హైవె పై జరిగిన టిఆర్ఎస్  దర్నా లో ఫ్లెక్సిల వివాదం తలెత్తింది.ఉద్యమ కాలం నుండి టిఆర్ఎస్ లో పని చేస్తున్న వారి ఫోటోలు లేవని కొందరు గొడవ చేశారు. ధర్నా చేయకుండానే ఓ వర్గం నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాలో టీఆర్ఏస్, బీజేపీ నాయకుల పోటా పోటీ ధర్నాలకు దిగారు. భువనగిరిలో సిపిఎం, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెరిచి ఉన్న బేకరీ షాపుపై సీపీఎం కార్యకర్తలు రాళ్ల విసరడంతో బీజేపీ కార్యకర్తకు గాయమైంది.    ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు బంద్ లో పాల్గొనలేదు. ఈ రెండు పార్టీలు పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వడంతో.. రైతుల పోరాటానికి నేరుగా సపోర్ట్ చేయలేకపోయాయి. ఏపీలో బంద్ వామపక్షాలు, కార్మిక సంఘాల వరకే పరిమితమైంది. వ్యాపార సంస్థలు కొంత వరకే మూత పడ్డాయి. ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత అంతటా సాధారణ పరిస్థితులు కనిపించాయి.బంద్ లో పాల్గొనకపోయినప్పటికి.. విజయవాడలో రైతులకు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.  కొత్త వ్యవసాయ చట్టాలకు తమ పార్టీ సూచించిన సవరణలు చేయాలని కోరారు. రైతుల ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలని, దీనిపై ప్రధాని మోడీ వెంటనే ప్రకటన చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భారత్ బంద్ పైనా టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకున్నారు. 

మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు! కేసీఆర్ సర్కార్ లో కలకలం

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. దిండిగల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై  భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 115, 116, 117లోని తనకు సంబంధించిన భూమిని అమ్మాలంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుల చేత బెదిరింపులు చేస్తున్నారని శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు కోర్టులో పిటిషన్ వేయడానికి నియమించుకున్న లాయర్ ను  కూడా మంత్రి కొనేశారని ఆరోపించింది. మంత్రికి అమ్ముడుపోయిన లాయర్ నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడని మహిళ చెప్పింది.  దిక్కుతోచని స్థితిలో పోలీసులు ఆశ్రయించినట్టు శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి మరో ఐదుగురిపై సెక్షన్ 446,506r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

మోడీతో పెట్టుకుంటే కాలిపోతారు: కేసీఆర్ పై రాజా సింగ్ ఫైర్ 

కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. రైతుల సంక్షేమ కోసం మంచి చట్టాలను తీసుకొస్తే... మాయమాటలు చెపుతూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు రాజా సింగ్. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని విమర్శించారు.    దళారుల చేతిలో రైతులు మోసపోకూడనే ఉద్దేశంతోనే  మోడీ సర్కార్ కొత్త చట్టాలను తీసుకు వచ్చిందన్నారు రాజా సింగ్. ఈ చట్టాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయన్న రాాజా సింగ్... మోడీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. శక్తితో పెట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. రైతుల భూములను కబ్జా చేసి, వెంచర్లు వేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు రాజా సింగ్.

90ఏళ్ల బ్రిటన్ బామ్మకు తొలి టీకా! రెండు వారాల్లో భారత్ కరోనా వ్యాక్సిన్ ?

కరోనా వ్యాక్సిన్ పంపిణిని ప్రారంభించింది బ్రిటన్. 90 ఏళ్ల వృద్ధురాలికి తొలి కరోనా టీకా ఇచ్చారు. ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన ఈ బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఈమే. మొట్టమొదటి టీకా తీసుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బామ్మ చెప్పారు.  జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్‌ హోంలో ఉండే వర్కర్లకు  ఇవ్వనున్నారు. యూకేతో పాటు ఫైజర్‌ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం డిసెంబరు 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. యూఎస్‌లో కూడా అనుమతి లభిస్తే.. డిసెంబరు మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్‌ భావిస్తోంది.  భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్‌ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి.  దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  కరోనా వ్యాక్సిన్ అవసరంతో పాటు దాని  భద్రత కూడా ముఖ్యమైన అంశం. అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్‌ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.అందుకే కరోనా టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ  ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరిశీలించారు. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌ -19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో  టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.