జగన్, దిగ్విజయ్, కేసీఆర్ నా నాయకులు! పువ్వాడపై నారాయణ విసుర్లు
posted on Dec 3, 2020 @ 11:14AM
తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీపీఐ జాతీయ నేత నారాయణ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటరిచ్చారు నారాయణ. దయచేసి పువ్వాడ నాగ్వేశ్వర్‌రావు, సీపీఐ పేరును ప్రస్తావించవద్దని కోరుతూ ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఒకప్పుడు తమకు జగన్‌మోహన్‌రెడ్డి, తర్వాత దిగ్విజయ్‌సింగ్, తాజాగా కేసీఆర్ నాయకులంటూ అజయ్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు నారాయణ. ఇంత పరకాయ ప్రవేశం చేసిన వారు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మేపని చేయవద్దని హితవు పలికారు. తనపై మంత్రి చేసిన విమర్శలపై సమాధానం చెప్పాల్సి అవసరం లేదన్నారు నారాయణ.
"కేసీఆర్ వదిలిపెట్టిన చెవితెగుద్ది" అనడం ద్వారా కేసీఆర్ కన్నా తానే గొప్పవాడని అని బరితెగించి చెప్పుకున్నారని... దానిని కేసీఆర్ పరిశీలించుకోవాల్సిందే అని అజయ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు కామ్రెడ్ నారాయణ. తనపై బీజేపీ హత్యాప్రయత్నం చేసిందని స్వయంగా మంత్రే చెప్పారని...ఇది రాజకీయాలకు అతీతంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని చెప్పారు నారాయణ. ‘‘యువకుడుగా ఆర్టీసకీ మంత్రివయ్యావు , హిట్ అండ్ రన్ యాక్ట్ తీవ్రతను గురించి తెలిసుకోవాలసిన కనీస బాద్యత నీకుంది. నేను విద్యార్థి దశ నుండి సీపీఐలోనే ఉన్నాను. మీరెక్కడ నుండి బయలుదేరారో, ఇప్పుడెక్కడ ఉన్నారో, రేపెక్కడికిపోతారో చెప్పగలరా? సూర్యుడిపై ఎంగి ఊస్తే ఏమవుతుందో నన్నంటే అదే అవుతుందని అజయ్ బాబు గుర్తుంచుకోవడం మంచిది’అంటూ సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.
తాను ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా ఉన్నా ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు నారాయణ. పువ్వాడ నాగేశ్వర్‌రావు ఆనాడు తమ పార్టినాయకులని... ఈనాడు కూడా పార్టి వెంటనే ఉంటారని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంటుకు అభ్యర్థిగా పువ్వాడనే పోటీచేయమని అభ్యర్థించామని చెప్పారు. ఖమ్మం జిల్లా పార్టీ అనుమతిలేకుండా , రాష్ట్ర కార్యదర్శివర్గం తీర్మానం లేకుండా , కేంద్రపార్టీ అనుమతిలేకుండా తాను పొటీ చేయగలనా అని నారాయణ నిలదీశారు. విజ్ఞతతో ఆలోచించమని ప్రజలను ముఖ్యంగా ఖమ్మం ప్రజలను కోరుతున్నానని చెప్పారు. తనకు అవినీతిని అంటగట్టాలనే ప్రయత్నం ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు నారాయణ. అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర కార్యదర్శి వర్గ స్థాయికి ఎదగగలనా అని ప్రశ్నించారు.