జనవరిలో పార్టీ పెడతానన్న రజనీ! ఈసారైనా ఖాయమేనా?
posted on Dec 3, 2020 @ 3:55PM
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీపై సాగదీత దోరణి కొనసాగిస్తూనే ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. మూడేళ్లుగా పెండింగులో ఉన్న పార్టీ ఏర్పాటుకు సంబంధించి తాజాగా ట్వీట్ చేసినా .. అందులోనూ పూర్తి స్పష్టత ఇవ్వలేదు . త్వరలోనే తాను పార్టీ పెట్టబోతున్నానని గతంలో చెప్పినట్లే మళ్లీ చెప్పారు తలైవా. డిసెంబర్ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఆ సస్పెన్స్ ను కొనసాగించారు. వచ్చే మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ ఏర్పాటుపై సాగదీయడంపై విమర్శలు వస్తున్నాయి. అసలు రజనీకాంత్ కు పార్టీ పెట్టే ఆలోచన ఉందా? పార్టీ పెట్టినా సీరియస్ గా ముందుకు పోతారా లేక నామ్ కే వాస్తాగా మారుస్తారా ? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీపై మూడేళ్లుగా నాన్చడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.
మూడేళ్ల క్రితం రాజకీయ పార్టీపై ప్రకటన చేసినా అది ప్రచారంగానే మిగిలిపోవడం.. మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో అత్వవసరంగా సమావేశమయ్యారు. చెన్నైలో జరిగిన ఈ భేటీకి తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి ఆర్ఎంఎం బాధ్యులు, అభిమానులు వచ్చారు. సమావేశం తర్వాత పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని భావించారు. కాని అప్పుడు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఆర్ఎంఎం సభ్యులతో సమావేశం తర్వాత చెప్పినట్లే రాజకీయ పార్టీపై రజనీకాంత్ ప్రకటన చేసినా.. అది క్లారిటీగా లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది.
2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. రజనీ రాజకీయాలకు వస్తారన్న ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. త్వరలోనే పార్టీ అనే ప్రకటనలతోనే మూడేళ్లు గడిచిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెడుతుండగా.. తమ హీరో స్పష్టత ఇవ్వకపోవడంతో రజనీకాంత్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.
రజనీకాంత్ మౌనంతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే కొద్ది రోజుల క్రితం రజనీ కాంత్ పేరిట సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం మరింత గందరగోళానికి దారి తీసింది అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్.. అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో తమిళనాట రజనీ పార్టీ ఉండకపోవచ్చనే అంతా భావించారు.
మరోవైపు రజనీకాంత్ రాజకీయ పార్టీపై పూర్తి స్పష్టత లేకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం న్యూ ఇయర్ గిఫ్ట్ గా కొత్త పార్టీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. రజనీకాంత్ తాజా ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటూ క్రాకర్స్ కాల్చుతున్నారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకుల అంచనా. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్లస్ , డీఎంకే మైనస్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టిన కమల్ హాసన్ పెద్దగా ప్రభావం చూపలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.