కేజ్రీ జోరు బీజేపీ బేజారు
దేశ రాజధాని ఢిల్లీపై తిరుగులేని పట్టు సాధించిన, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ మంచి జోరు మీదున్నారు. గత వారం గుజరాత్’లో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. అహ్మదాబాద్ సహా ఐదు కార్పొరేషన్లలో అడుగు పెట్టలేక పోయినా,ఇంకెక్కడా ఆయన పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా రాకపోయినా, సూరత్’లో మాత్రం ‘చీపురు’ తిరగేశారు. ఫస్ట్ అటెంప్ట్’లోనే డిస్టింక్షన్’ సాధించారు. చీపురి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచేసింది. మొత్తం 120 సీట్లున్న కార్పొరేషన్’ బీజేపీ 93 సీట్లు, ఆప్ 27 సీట్లు గెలుచుకున్నాయి. హస్తం పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఒక్క సీటు కూడా దక్కలేదు.
అదలా ఉంటే, ఆ ఆనందం మత్తు నుంచి ఇంకా బయటకు రాక ముందే, ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఐదు స్థానాలు జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆప్’ విజయ ఢంకా మోగించింది. ఐదింట నాలుగు సీట్లలో ‘ఆప్’ జైకేతనం ఎగరేసింది.మిగిలిన ఒక సీటును హస్తం పార్టీ ఎగరేసుకు పోయింది. బీజేపీకి ఢిల్లీ జనం మొండి చేయి చూపించారు. ఉన్న ఒక్క సీటు కూడా లాగేసుకున్నారు.
మరో సంవత్సరంలో,2022లో ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగనున్నాయి.ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలోను బీజేపీ అధికారంలో ఉంది, అయినా ఐదుకు ఐదు సీట్లలో కమలం పార్టీ కనుమరుగుకావడం ఆ పార్టీ ని కలవరానికి గురి చేస్తోంది. మరో వంక ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్ పార్టీ ఆనందడోలికల్లో తెలిపోతోంది. అయితే, ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ఆప్ సిట్టింగ్ స్థానాలు. ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్ల్యేలు కావడంతో, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇది తమకు అంత పెద్ద ఎదురుదెబ్బ కాదని బీజేపీ, బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అయితే,కేజ్రీవాల్ మాత్రం, వచ్చే సంవత్సరం ఏమి జరగబోతోందో ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు. నిజమే, ఎన్నిక ఎంత చిన్నదే అయినా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్యకర్తల నైతిక బలాన్నిపెంచుతుంది. ఓటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.అయితే సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో, బీజేపీ ప్రత్యన్మాయంగా ఎదిగేందుకు ‘ఆప్’ చేస్తున్న ప్రయత్నాలు సత్పలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసిన స్థానాన్ని ‘ఆప్’ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.ఇంతవరకు కొంత విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే కేజ్రీవాల్ ఇకముందు కూడా ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని, పార్టీని విస్తరిస్తామని ప్రకటించారు. అయితే, గతంలోనూ ‘ఆప్’పార్టీ విస్తరణ ప్రయత్నాలు చేయకపోలేదు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే, కేజ్రీవాల్ డీ కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేశారు,అయితే ఒక్క పంజాబ్ మినహా ఎక్కడా సక్సెస్ కాలేదు ... ఈ సారి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.