పెరిగిన పాజిటివ్ స్పీడ్.. రెండు రాష్ట్రాలు భయం భయం
posted on Mar 4, 2021 @ 10:47AM
మనదేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కొద్దిరోజుల క్రితం వరకు తగ్గినటుల్గా కనిపించినా తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు పది పన్నెండు వేల మధ్య నమోదు కాగా.. గడచిన 24 గంటలలో కొత్తగా 17,407 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. మరోపక్క నిన్న 14,031 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,08,26,075 కు చేరింది. అదే సమయంలో నిన్న కొత్తగా 89 మంది కరోనా కారణంగా కన్ను మూశారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,435 కు చేరింది. ప్రస్తుతం 1,73,413 మంది వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో ఉంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసులలో 60 నుంచి 70 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ నుండి నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 9,855 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. కేరళలో 2,700 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. మరోపక్క మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్క్ పెట్టుకో ని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమవీర్ సింగ్ హెచ్చరించారు. నగరంలోని ప్రత్యేక జోన్‌లలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు అయన తెలిపారు. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,60,500 మంది హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెజిల్ నుంచి వచ్చే మహారాష్ట్రవాసులు ఏడు రోజుల పాటు కంపల్సరీ హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు స్పష్టం చేశారు.