నలుగురితో లవ్.. అంతాకలిసి జంప్.. లక్కీ డ్రాలో పెళ్లి

యూపీలో ఒక యువతి నలుగురు యువకులను ప్రేమించింది. ఆ యువకులు కూడా ఆమెను అంటే గాఢమగు ప్రేమించారు. కొన్నాళ్లకు వారితో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఈ ఐదుగురు కలిసి వారిలో ఒకరి బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు.ఇక ఆ యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెండి.. ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. కొద్దిరోజులకు ఆమె ఆచూకీ దొరకగా.. ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు.  తరువాత గ్రామ పెద్దలు ఆ నలుగురు యువకుల్లో ఒకరికి ఇచ్చి ఆ యువతికి వివాహం చేయాలని నిశ్చయించారు. దీంతో ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన‌ను గ్రామ పెద్దలు ఆ యువతి ముందుంచారు. అయితే ఆ యువతి ఈ విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో పాటు.. తాను ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నానో తెలియడం లేదని చెప్పింది.  దీంతో గ్రామ పెద్దలు ఎటూ పాలుపోక ఇక లాటరీయే దిక్కని భావించారు. ఆ నలుగురు యువకుల పేర్లను చీటీలపై రాసి ఒక చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. అందులో వచ్చిన యువకుడితో, ఆ యువతికి పెళ్లి ఖరారు చేసి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. దీంతో ఈ చిక్కుముడి వీడి త్వరలోనే వారిద్దరి పెళ్లి జరగబోతోంది. ఇలా ఒక జఠిల ప్రేమ కథకు ఆ గ్రామ పెద్దలు ఎలాగైతే శుభం కార్డు వేశారు.

శ్రీధరన్ ఓకే.. అద్వానీ, జోషీ నాట్ ఓకేనా?

2014 సార్వత్రిక ఎన్నికలు. బీజేపీ అఖండ విజయం. ప్రధాని రేసులో అద్వానీ, మోదీ. వయసు మీద పడిందనే ముద్రతో అద్వానీని పక్కన పెట్టేశారు కమలనాథులు. బీజేపీలో 75 ఏళ్లు పైబడిన నేతలందరికీ రాజకీయ సన్యాసమే. ఇదీ ఆ పార్టీ పెట్టుకున్న సిద్ధాంతం. అద్వానీ, జోషీ, శాంతకుమార్ లాంటి వారిని అలానే పక్కన పెట్టేశారు. మార్గదర్శక మండలి క్రియేట్ చేసి.. వారికి ఎలాంటి పని లేకుండా చేసి.. వారి ప్రాభవాన్ని మసకబార్చారు. ఇదంతా అప్పటి వరకూ పార్టీలో గట్టి పట్టున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్లను తనకు అడ్డు రాకుండా చేసేందుకు మోదీ నడిపిన మంత్రాంగం అని పార్టీ వర్గాలే అంటుంటాయి. లేటెస్ట్ విషయానికి వస్తే.. కేరళలో 89 ఏళ్ల శ్రీధరన్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మరోసారి వయసు వ్యవహారం తెరపైకి వచ్చింది.  బీజేపీ పెట్టుకున్న నియమం ప్రకారం 75 ఏళ్లు దాటితే ఎంతటి నేతైనా ఇక ఇంటికే పరిమితం. కానీ, కేరళలో ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. ఓట్లు దండుకునేందుకు 89 ఏళ్ల కురవృద్ధుడు, మిస్టర్ఱ క్లీన్ ఇమేజ్ మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఎన్నికల బరిలో దింపారు. అద్వానీ, జోషీ విషయంలో వర్తించిన రూల్.. శ్రీధరన్ ఎపిసోడ్ లో ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.  సుబ్రహ్మణ్యస్వామి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నేత. పార్టీలోనే ఉంటూ, పార్టీ లైన్ కు కట్టుబడే ఉంటూ.. కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేయడంలో దిట్ట. లేటెస్ట్ గా, శ్రీధరన్ విషయంలో సంచలన కామెంట్లు చేశారు. ఏజ్ పాలిటిక్స్ పై గట్టిగా ప్రశ్నించారు. 89 ఏళ్ల శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందున.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ, జోషిలు కూడా పోటీ చేయాలంటూ సూచించారు సుబ్రహ్మణ్యస్వామి.  ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87. 2024లో పోటీ చేద్దామన్నా శారీరకంగా సహకరించకపోవచ్చు. వాళ్లు పోటీ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన పాయింట్ మాత్రం పార్టీని ఇబ్బందికి గురి చేస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందేగా? బీజేపీ సైతం అందుకు అతీతమేమీ కాదుగా? అందుకే అంటారు చెప్పేందుకే నీతులు అని...

అప్పుడు ముద్దులు... ఇప్పుడు గుద్దులు...

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెందుర్తిలో రోడ్‌షో ప్రారంభించిన చంద్రబాబు.. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ప్రజలను కోరారు. అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలన్నారు. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి.  అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా?  వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు అన్నారు. ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీ తనకు తెలియదని సీఎం బుకాయించారు. పార్లమెంటులో మంత్రి సమాధానంతో అడ్డంగా దొరికిపోయారు. పోస్కోతో స్టీల్‌ప్లాంట్‌ నాన్‌బైండింగ్‌ ఒప్పందం బట్టబయలు కావడంతో వీరి కుట్రలు ప్రజలకు  తెలిశాయి అని చంద్రబాబు చెప్పారు. ఉక్కు భూములను అమ్మేయడానికి ఎన్‌బీసీకి అధికారం  ఇచ్చారన్నారు. భూములన్నా.. డబ్బులన్నా ఈ సీఎంకు పిచ్చి..రాష్ట్ట్రంలో ఆస్తులను అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోందనీ, ఏ, బీ, సీ, డీ పాలసీతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘సొంత చెల్లెల్ని రోడ్డున పడేసినవ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంత విశాఖకు ఏ-2 శని పట్టింది. నెల్లూరులో ఉండాల్సిన ఈ వ్యక్తికి విశాఖలో ఏం పని? ఇక్కడ అరాచకాలకు, భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.  జగన్‌ ఒక స్టిక్కర్‌, ఫేక్‌ సీఎం అని చంద్రబాబు దుయ్యబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులు పేరిట గుద్దులే.. గుద్దులే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

రాసలీల సీడీ.. 5 కోట్ల ఒప్పందం! కర్ణాటకలో మరో రచ్చ 

కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల  ఎపిసోడ్ లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. బీజేపీ మంత్రి  అడ్డంగా ఇరుక్కోవడంతో .. విపక్షాలు ఇదే అస్త్రంగా విమర్శల దాడి పెంచాయి. రాసలీలల సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మైసూరులో తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌ కనిపిస్తోందన్నారు.  ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్‌మెయుల్‌ చేశారని చెప్పారు. దీని వెనుక బడా నేతల హస్తముందని మరో బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. 

అంబాని కేసులో సంచలనం! బాంబులున్న కారు యజమాని మృతి!  

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పార్కు చేసిన కారులో పేలుడు పదార్థాలు లభించడం ముంబైతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈఘటనపై విచారణ జరుగుతుండగానే.. మరో  కలకలం రేగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం  యజమాని మాన్‌సుఖ్ హిరేన్ నేడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నౌపడా పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిరేన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. థానేలోని ముంబై క్రీక్ పైనుంచి దూకడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  మాన్‌సుఖ్ హిరేన్ మృతదేహాన్ని ముంబై క్రీక్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.  హిరేన్‌ మృతిపై ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, జాయింట్ కమిషనర్ మిలింద్ భరంబేలు స్పందించేందుకు నిరాకరించగా, ఉన్నతాధికారులు మాత్రం హిరేన్‌ది ఆత్మహత్యేనని ధ్రువీకరించారు. అయితే హిరేన్ కుటుంబ సభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదని చెబుతున్నారు. గురువారం రాత్రి అతడు ముంబై శివారులోని విరార్‌లోనే ఉన్నాడని పేర్కొన్నారు. హిరేన్ తన భవనంలో చిన్నారులకు ఈతలో శిక్షణ ఇస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.  గత నెల 25న ముకేశ్ అంబానీ నివాసమైన అంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం నుంచి క్వారీలలో పేలుడు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే  అంబానీ కుటుంబాన్ని హెచ్చరిస్తూ ఉన్న లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ స్కార్పియో వాహనం మాన్‌సుఖ్ హిరేన్‌దని తేలింది. ఏడాదికిపైగా తన కారు ఉపయోగంలో లేదని, దానిని విక్రయించే ఉద్దేశంతో ఇటీవలే దానిని బయటకు తీసినట్టు విచారణలో హిరేన్ వెల్లడించాడు. ఫిబ్రవరి 16న తన కారును ములుంద్-ఎయిరోలి లింక్ రోడ్డులో పార్క్ చేశానని, ఆ తర్వాతి రోజు వచ్చి చూస్తే అది కనిపించలేదని పోలీసులకు తెలిపాడు. తన కారు దొంగతనానికి గురైందంటూ విక్రోలి పోలీసులకు హిరేన్ ఫిర్యాదు కూడా చేశాడు. కేసు దర్యాప్తులో ఉండగానే హిరేన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది.  

చంద్రబాబు ప్రచారంలో పవర్ కట్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విశాఖపట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పెందుర్తి నుంచి ర్యాలీ ప్రారంభించిన చంద్రబాబు.. చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ మీదుగా ముందుకు వెళ్లారు. అయితే చంద్రబాబు పర్యటించనున్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో  వీధి దీపాలు వెలగలేదు. లైట్ల వెలుగకపోవడంతో రోడ్లు చీకటిమయమయ్యాయి. వైసీపీ నేతల ఆదేశాలతోనే విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  విశాఖలో రెండ్రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. 

'టైమ్స్’ కవర్ పై ఢిల్లీ ఆందోళన  

గత నాలుగు నెలలకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పటికే అంతర్జాతీయ సమాజం దృష్టిని,అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.  సోషల్ మీడియాలో సపోర్ట్ సంపాదించింది. అదొక వివాదంగా కూడా మారింది. కోర్టులు,కేసులు, అరెస్టులు విచారణలు సాగుతున్నాయి. ఇప్పుడు మహిళా రైతుల ఆందోళన ఏకంగా ‘టైమ్స్ మ్యాగజిన్’  కవర్ పేజీ ముఖ చిత్రంగా వచ్చింది.   అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టైమ్స్ మ్యాగజైన్’  ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఆ ప్రత్యేక సంచిక ముఖ చిత్రంగా ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫోటోను,  “నన్ను బెదిరించ లేరు ... నన్ను కొనలేరు” అనే మకుటంతో ముఖ్య చిత్ర కథనాన్ని ప్రచురించింది. ఆందోళనలో పాల్గొన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మహిళా రైతుల అనుభవాలు, అనుభూతులతో పాటుగా, రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన విశేషాలను ఫోటోలో ప్రతిబించేలా ఉంది.  మన దేశంలో మహిళలు లింగ వివక్ష, లైంగిక హింస,  అత్యాచారాలు,పితృస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాల గురించి కూడా  పత్రిక ప్రస్తావించిందిట. అయితే  పత్రిక ప్రచురించిన కథనంలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయో పూర్తిగా తెలియదు, పత్రిక   కవర్ పేజీని మాత్రమే ట్వీట్ చేసింది. పత్రిక మార్కెట్ లోకి వస్తేనే కానీ  ‘టైమ్స్ మ్యాగజైన్’  ఏ ఉద్దేశంతో ఈ కథనం ప్రచురించిందో తెలియదు.  అయితే మెల్లి మెల్లిగా చల్లారుతున్న రైతు ఉద్యమాన్ని మళ్ళీ రగిల్చేందుకు, జరుగతున్న ప్రయత్నాలలో ఇది కూడా భాగం కావచ్చన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, ‘కిసాన్ మహిళా దివస్’ గా నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించారు. ఈ  నేపధ్యంలో  ‘టైమ్స్ మ్యాగజిన్’ కథనం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వప్న సుందరి గోల్డ్ ట్విస్ట్.. సీఎం విజయన్ టార్గెట్!

కేరళ సీఎం పినరయ్ విజయన్. స్వప్న సురేశ్. కొంతకాలం క్రితం మారుమోగిన పేర్లు. 15 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం స్మగ్లింగ్ లో స్వప్న సురేశ్ నిందితురాలు. గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కూ సంబంధం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యమంత్రితో పాటు మరో ముగ్గురు మంత్రులకూ బంగారం స్మగ్లింగ్ లో లింకుందని అంటున్నారు.  మరో నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు. ఎల్డీఎఫ్ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పినరయ్ విజయన్ టార్గెట్ గా కేసు ఉచ్చు బిగుస్తోంది. సరిగ్గా కేరళ ఎన్నికల ముందు బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని తెలిపారు స్వప్న సురేశ్. సీఎం పినరయ్‌తో పాటు స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు వెల్లడించారు.  ‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  గతంలో తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఆమె సీఎం విజయన్, స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లు చెప్పడం ఎన్నికల వేళ కేరళలో సంచలనంగా మారింది. బంగారం స్మగ్లింగ్ కేసు కేరళ ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అనే ఆసక్తి పెరిగింది. 

నందిగ్రామ్.. దీదీ నయా సంగ్రామ్ 

సాధారణంగా ఏ పొలిటీషియన్ అయినా ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా సేఫ్ నియోజకవర్గం ఏది అని వెతికి మరీ పోటీ చేస్తారు. మరి కొంతమంది అయితే ఎందుకైనా మంచిదని రెండు మూడు నియోజకవర్గాలలో పోటీ చేయడం కూడా మనం చూసాం. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఈసారి నందిగ్రామ్ నుండి పోటీకి సై అన్నారు. ఇప్పటివరకు ఆమె వరుసగా పోటీ చేస్తున్న భవానీపూర్ ను కూడా కాదని నిన్నటివరకు తమ పార్టీలో ఉండి.. కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరి సవాల్ విసురుతున్న సుబేందును రాజకీయంగా ఎదుర్కోడానికి దీదీ రెడీ అయ్యారు. నందిగ్రామ్ నుండి పోటీ చేసి సీఎం మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని మాజీ టీఎంసీ నేత సువేంధు అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందరు పొలిటీషియన్స్ లాగా మమతా కూడా తన గెలుపు కోసం రెండు చోట్ల నుండి పోటీ చేసే అవకాశం ఉన్నా. ఆమె మాత్రం నందిగ్రామ్ ఒక్కచోటే పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిత్యం రాష్ట్ర పరిపాలనలో తనను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీకి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికలలో పోటీ చేసే 291 మంది అభ్యర్ధుల జాబితాను పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమత బెనర్జీ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "నాపై నమ్మకముంచండి.. బెంగాల్ ను ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత నాది" అంటూ ఆమె ఓటర్లకు హామీ ఇచ్చారు ఈ తొలి జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు సీట్లను కేటాయించారు.మరోపక్క పార్టీలోని 80 ఏళ్లు దాటిన నాయకులకు మమత టిక్కెట్టు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ లుగా ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు మమత టిక్కెట్లు ఇవ్వలేదు. ఇక వరుసగా కొన్ని దశాబ్దాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టులు ఈసారి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను అయినా దక్కించుకుంటారో లేదో తెలియని స్థితిలో ఉన్న కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పూర్తిగా యువ రక్తాన్నే ప్రోత్సహించాలని డిసైడ్ అయింది ఇప్పటికే బెంగాల్ లో మొత్తం టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయినా సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలలో గెలుపు కోసం తృణమూల్, బీజేపీ పోటాపోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి.

ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముళ్లు 

ఆస్తి గొడవలే అన్న చావుకి కారణం అయ్యింది. ఆస్తి కోసం తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఎకంగా రక్తం పంచుకుని పుట్టిన అన్ననే చంపేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టంగుటూరు గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరు ఘర్షణకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో పాండు, శ్రీనివాస్‌ కలిసి అన్న యాదయ్యను కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం పాండు, శ్రీనివాస్‌ శంకర్‌పల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపీనాథ్ తెలిపారు.  

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కాలభైరవ సేవలో బాలకృష్ణ.. అందుకోసమేనా?

హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు దైవభక్తి అధికం, ముహూర్తాలు, పూజలు, జాతకాలపై అమిత నమ్మకం. జ్యోతిష్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే అసలే పనీ ప్రారంభించరు. ప్రతీరోజూ రాశిఫలాలు ఫాలో అవుతుంటారు. హైదరాబాద్ లో ఉండే బాలకృష్ణ కుటుంబం సడెన్ గా కామారెడ్డి జిల్లాలో ప్రత్యక్షమైంది. రామారెడ్డి మండలం, ఇసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు బాలకృష్ణ. ఆయనతో పాటు సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి ఉన్నారు.  కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలోని 13వ శతాబ్దం నాటి కాలభైరవ స్వామి ఆలయం మహిమాన్మితమైనది. కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఇదే. ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. కార్తీక బహుళాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఘనంగా జరుపుతారు. కాలభైరవుడు అత్యంత పవర్ ఫుల్ గాడ్. జాతక దోషాలు మరీ విపరీతంగా ఉంటేనే కాలభైరవుడిని పూజిస్తుంటారు. ఎలాంటి గ్రహ దోషాలనైనా నివారించే శక్తి కాలభైరవుడికే సొంతం. బాలకృష్ణ ఫ్యామిలీ సైతం జాతక దోషాల నివారణకే కాలభైరవ ఆలయ దర్శనం చేసుకున్నారని అంటున్నారు. ఇటీవల ఏర్పడిన కాలసర్ప దోష ప్రభావం బాలకృష్ణపై ఉందని.. అందుకు పరిహారంగా కాలభైరవ పూజ చేయాలని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సూచించారని చెబుతున్నారు. అందుకే, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఉన్న కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లికి బాలకృష్ణ కుటుంబ విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారని తెలుస్తోంది.

కొవిడ్‌ రిపోర్టు ఉంటేనే తిరుమలకు!

ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. కరోనా భయం పూర్తిగా తొలగిన తర్వాతే ఆన్‌లైన్‌ లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంట‌ల ముందు కొవిడ్ ప‌రీక్ష చేయించుకుని స‌ర్టిఫికెట్ తీసుకువ‌స్తేనే అనుమ‌తిస్తామని ఆయన స్పష్టం చేశారు.  భ‌విష్యత్‌ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అలిపిరిలో రెండు చోట్ల 2వేల వాహ‌నాలు, తిరుమ‌ల‌లో రెండు చోట్ల 1,500 వాహ‌నాలు పార్క్ చేసేలా మ‌ల్టీలెవ‌ల్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో చెప్పారు. తితిదే క‌ల్యాణ మండ‌పాల లీజు కాలాన్ని 3 నుంచి 5 ఏళ్లకు, ఆ త‌ర్వాత మ‌రో రెండేళ్లు పొడిగించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ కోసం గ్రీన్ ఎన‌ర్జీ త‌యారు చేసే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయన్నారు. భ‌విష్యత్తులో విద్యుత్‌తో న‌డిచే వాహ‌నాల‌ను మాత్రమే తిరుమ‌ల‌కు అనుమ‌తించే విధంగా ఆలోచ‌న చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిలో భాగంగా 150 విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఆర్టీసీ ప్రయ‌త్నాలు ప్రారంభించిందన్నారు. తితిదే అధికారులకు కూడా విద్యుత్‌తో న‌డిచే వాహ‌నాల‌ను కేటాయిస్తామన్నారు. ఎన్టీపీసీ ద్వారా ధ‌ర్మగిరిలో 25 ఎక‌రాల్లో 5 మెగావాట్ల సామ‌ర్థ్యంతో సౌర‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు.  

పల్లాకు... నల్లేరుపై నడక కాదు ..

రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగతున్న ఎన్నికల పోలింగ్ తేదీ మార్చి 14 సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నియోజక వర్గం నుంచి ఏకంగా 71 మంది బరిలో నిలిచారు. అందులో ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి 21, ఖమ్మం జిల్లా నుంచి 15, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు రంగంలో వున్నారు.ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటుగా, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ప్రొ. కోదండ రామ్, అందరికి సుపరిచితులైన తీన్మార్ మల్లన్న, యువ తెలంగాణ నాయకురాలు,రాణి రుద్రమ వంటి వారున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున మంత్రులు జగదీష్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ పలువురు శాసన సభ్యులు ఎన్నకల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో పాటు, అన్ని రకాల హంగులు,ఆర్భాటాలు ముఖ్యంగా ఆవసరమయితే కోట్ల రూపాయలు ఖర్చు చేయగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి కావడంతో పార్టీ పెద్దలు ఈ నియోజక వర్గంపై అంతగా దృష్టి కేంద్రీకరించనట్లు కనిపిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కరే అన్నీ చక్కబెడుతున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్ధిగా మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు కుమార్తె వాణీదేవిని పోటీకి నిలపడంతో, అక్కడ పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్ల్యేలు వాణీ దేవి గెలుపు కోసం ప్రచారం  సాగిస్తున్నారు.   నల్గొండ,వరంగల్, ఖమ్మం నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామలు నాయక్ తరపున పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సార్లు జిల్లాలో ప్రచారం కొనసాగించారు. బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు, జిల్లాలలోని వివిధ పట్టణాలు, పల్లెలలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహింఛి ప్రచారం సాగిస్తున్నారు. ఏబివిపి, బిజెపి కార్యకర్తలు ప్రచార భాద్యతలు చేపట్టారు. యవ తెలంగాణ తరుపున బరిలో వున్న జర్నలిస్టు రాణి రుద్రమ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ప్రభుత్వ హామీలు వైపల్యాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తు ప్రచారం చేస్తున్నారు.తెలంగాణ జన సమితికి చెందిన ప్రొ.కోదండరామ్ విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే తెరాస ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతూ, ప్రధాన మీడియా చేయని సాహసం చేస్తున్న తీన్మార్ మల్లన.. ఎన్నికల ప్రకటకు ముందు నుంచి, పాదయాత్ర చేస్తూ, సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.  అన్నివర్గాల ప్రజలు, మేథావులు, ఆయన వెంట ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖ యువ న్యాయవాది ఉమేశ్ చంద్ర వంటి టి సామాజిక స్పృహ గల అనేక మందితో పాటుగా యువకులు, విద్యాధికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీన్మార్  మల్లన తరపున ప్రచారం సాగిస్తున్నారు. మల్లన్న తమ విజయం పట్ల విశ్వాసంతో ఉన్నారు.  ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఈ మూడు జిల్లాల పట్టభద్రులు ఎటు మొగ్గు చూపుతారు అనేది ఉహకు అందకుండా వుంది. అయితే అధికార పార్టీ అభ్యర్ధికి గెలుపు నల్లేరు మీద నడక కాదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రొ. కోదండ రామ్ సెకండ్ ప్రియారిటీ ఓటు మీద దృష్టి పెట్టి సాగిస్తున్న ప్రచారం అంచనాలాను తల్లకిందులు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు. 

సీతక్కకు ఉత్తమ్ హ్యాండ్.. రేవంత్‌రెడ్డి వల్లేనా?

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య కో్ల్డ్ వార్! ఆధిపత్య పోరులో ప్రస్తుతం రేవంత్ రెడ్డిదే అప్పర్ హ్యాండ్. ఉత్తమ్ ఖాళీ చేసిన పీసీసీ అధ్యక్షుడి పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, రేవంత్ కు పార్టీ పగ్గాలు లభిస్తే.. తమ ఉనికికే ఎసరు వస్తుందనే భయంతో సీనియర్లంతా ఆ డైనమిక్ లీడర్ దూకుడుకు మోకాలు అడ్డుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ టార్గెట్ గా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. ఆయన బలాన్ని బలహీనపరిచే ప్రయత్నాలూ జరుగుతున్నాయని చెబుతున్నారు. సీనియర్లలో వారిలో వారికి సఖ్యత లేకున్నా.. రేవంత్ ను కార్నర్ చేయడంలో మాత్రం అంతా పోటీ పడుతున్నారని మండిపడుతున్నారు.  తాజాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ప్రచారంలో ఇలాంటి పరిణామమే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు మద్దతుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈ మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను సమాయత్తం చేస్తున్నారు. దాదాపు అన్ని మీటింగ్ లకు హాజరైన ఉత్తమ్.. ములుగులో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. ఇదే ఇప్పుడు రేవంత్ వర్గం ఆగ్రహానికి కారణం.  ములుగు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ సీతక్క. ఆమె రేవంత్ రెడ్డి ప్రధాన ఫాలోయర్. రేవంత్ తో పాటే టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు సీతక్క. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ప్రధాన అనుచరురాలిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క రేవంత్ టీమ్ కాబట్టే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ములుగు కాంగ్రెస్ మీటింగ్ కు హాజరుకాలేదని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి చీఫ్ పాలి..ట్రిక్ ఏంటంటూ సీతక్క అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు మద్దతుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి, సీతక్క వర్గం సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ ఎపిసోడ్ కాక రేపుతుండగా.. సీతక్క ఎపిసోడ్ తో అది మరింత పీక్స్ కు చేరుతోంది. 

కేంద్రం పై కేటీఆర్ మరో బుల్లెట్..

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు,రాష్ట మంత్రి కే.తారక రామా  రావు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై వరస అస్త్రాలను సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాగిస్తున్న వేస్తున్న బాణాలతో పాటుగా, అధికార కార్యక్రమాలు, ఇతర వేదికలు ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అస్త్రాలుగా చేసుకుని బాణాలు సంధిస్తున్నారు. ఇతవరకు ఐటీఐఆర్, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంశాలను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన కేటీఆర్, తాజాగా మరో బుల్లెట్‌ పేల్చారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? ..హైదరాబాద్‌కు అర్హత లేదా? అంటూ సీఐఐ వార్షిక సమావేశం వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే,   వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయాన్నీ మరోమారు ప్రస్తావించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం, 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదన్నారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ కూడా కేటాయించలేదన్నారు. అలాగే,, ఐటీఐఆర్‌ కారిడార్‌ను రద్దు విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. అయితే, కేటీఆర్’ హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో లబ్ది పొందేందుకే, ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారని, బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.ఐటీఐఆర్ ‘ రాష్ట్రానికి రాక పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేసపూర్వకంగానే ప్రాజెక్ట్’ను అడ్డుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇక అక్కడి నుంచి ఐటీఐఆర్ విషయంలో తెరాస, బీజేపీ నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు సాగుతూనే ఉన్నాయి. మరో వంక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఐటీఐఆర్’విషయంలో తెరాస, బీజేపీ దొంగాటలు ఆడుతున్నాయని, ఆ ఇద్దరు దోషులే అని తేల్చేశారు. ఇక అసలు విషయంలోకి వస్తే 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజదాని, హైదరాబాద్ సహా మరో కొన్ని నగరాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేసింది. కానీ, కాంగ్రెస్ హయాంలో షరా మాములుగా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మొత్తం ఐటీఐఆర్’ ప్రాజెక్టులను కట్టకట్టి అటకెక్కించింది.  ప్రాజెక్ట్ మంచీ చెడులు,ప్రయోజనాలు,ఉపాథి అవకాశాలు పక్కన పెడితే, ఐటీఐఆర్’  ప్రాజెక్ట్ ఏపీ ప్రత్యేకక హోదాలాగా  ముగిసిన అధ్యాయం. ఇప్పుడదొక మృత ప్రాజెక్ట్, ఇప్పుడు ఆ మృత ప్రాజెక్ట్కు పైనే ఇంత రాజకీయం సాగుతోంది. అలాగని,కేంద్రం ప్రాజెక్టును అటకేక్కించిన విషయం రహస్యమా అంటే కాదు, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో చాలా స్పష్టంగా, ఐటీఐఆర్ ప్రాజెక్టులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు, అదే విషయాన్ని రాష్ట్ర  ఐటీ  మంత్రి కేటీ రామ రావు, మీడియాకు వివరించారు. అంటే ఆత్మవంచన, పరనింద తప్ప ఈ సవాళ్ళు,ప్రతి సవాళ్ళు వలన రాష్ట్రానికి జరిగే ప్రయోజనం శూన్యం.

ఇంత కక్కుర్తి అవసరమా జగనన్నా ..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ . జనాభా పరంగా చైనా అతిపెద్ద దేశం అయినప్పటికీ.. అక్కడ పేరుకు కమ్యూనిస్ట్ పాలనే ఉన్నా .. అక్కడ మొత్తం నియంతృత్వ పాలన సాగుతోంది. అమెరికాలో ప్రజాస్వామ్యమే ఉన్నా కూడా మొన్న జనవరిలో అధికార మార్పిడి సందర్భంగా క్యాపిటల్ హిల్ లో జరిగిన సంఘటనలు ఆ దేశానికీ మాయని మచ్చ తీసుకు వచ్చాయి. భారత్ లో ప్రజాస్వామ్యం ఇంతలా బలపడడానికి కారణం ఇక్కడి ప్రజలలో వ్యవస్థలపై ఉన్న విశ్వాసమే . అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను కనుక గమనిస్తే సామాన్య ప్రజలకు మొత్తంగా ఈ రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రక్రియపై నమ్మకం పోయేలా ఉంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలిచి మనుగడ సాగించేది ప్రజలు స్వచ్చందంగా కదిలి వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తేనే. ఆలా కాకుండా ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థులను కూడా భయపెట్టి సాధించే విజయం ప్రజాస్వామ్యం ముసుగులో సాగే నియంతృత్వానికి నిదర్శనం అవుతుంది. ప్రస్తుతం  ఏపీలో జరుగుతున్న ఎన్నికలను గమనిస్తే ఇదే విషయం స్పష్టమౌతోంది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుండి.. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలవరకు అధికార వైకాపా ఫాలో అవుతున్న పద్దతులను చూస్తే అసలు ఆ పార్టీకి డెమోక్రసీ పైన నమ్మకముందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ఎన్నికలలో కేవలం తమ పార్టీ అభ్యర్ధులు మాత్రమే రంగంలో ఉండాలి ఇంకెవరు కనీసం పోటీ కూడా చేయకూడదు అన్నట్టుగా ఆ పార్టీ మంత్రాంగం నడుపుతోంది. దీని కోసం ఆ పార్టీ చేయని అరాచకం కానీ, పాల్పడని నీచం కానీ లేవంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యేంతవరకు కనీసం బయటకు అడుగు పెట్టె పరిస్థితి లేదు. ఒకవేళ వైకాపా నాయకులు చేసే దౌర్జన్యాలు బెదిరింపులకు ఆ అభ్యర్థి మొండిగా ఎదురొడ్డి నిలబడినా.. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల నుండి పారిపోయేలా చేస్తున్నారు. ఈ దురాగతాలకు ఒక ఉదాహరణ.. రాయలసీమలో పోటీ చేస్తున్న ఒక ప్రతిపక్ష అభ్యర్థి పై వైకాపా నాయకులు ఎన్ని సార్లు ఒత్తిడి చేసినా ఎన్నికల నుండి తప్పుకోక పోవడంతో అతడి జీవనాధారమైన పందులను రాత్రికి రాత్రే లారీలో తరలించుకుపోవడంతో ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు భీతిల్లి.. వైకాపా ప్రత్యర్థి వద్దకు పరుగులు పెట్టి.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి మహాప్రభో అంటూ వేడుకుని నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. తాజాగా తిరుపతిలో జరుగుతన్న మున్సిపల్ ఎన్నికలలో ఏడో వార్డులో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారుల సాయంతో వైకాపా నాయకులు విత్ డ్రా చేయించేశారు. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి నేరుగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమె నామినేషన్ ను కొనసాగించాలని ఆదేశించినా అక్కడి ఆర్ఓ పట్టించుకోలేదు దీంతో నిమ్మగడ్డ మళ్ళి రంగంలోకి దిగి అక్కడ ఎన్నికల ప్రక్రియను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మొత్తానికి ఏపీలో 151 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ ఎన్నికలలో ఇంతగా దిగజారి ఏకగ్రీవాల కోసం అది సాధ్యం కాకపోతే ఎలాగైనా నెగ్గేందుకు ప్రయత్నాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలను సవ్యంగా ఎదుర్కొని వచ్చే సానుకూల ఫలితాలతో తృప్తి పడాల్సింది పోయి ఈ అడ్డగోలు దారులలో 80 లేక 90 శాతం సీట్లు సాధించి ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇలా బెదిరింపులు, ప్రలోభాలు, భయంతో సాధించే ఈ వాపును చూపించి.. ఇదే మా బలం అంటే జనం నమ్మే పరిష్టితి లో లేనే లేరని సాక్షాత్తు వైకాపా నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి  ఇంత బలవంతంగా తెచుకున్న ఈ వాపుతో సీఎం జగన్ ఏం సాధించాలనుకుంటున్నరో ఆయనకే తెలియాలి...