ప్రధాని మోడీకి ఎలక్షన్ కమిషన్ షాక్
posted on Mar 4, 2021 @ 11:23AM
దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఫొటోలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో మోదీ ఉన్న హోర్డింగులను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. దేశ ప్రధానమంత్రి ఫోటోలతో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఇది ఇలా ఉండగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను పెట్రోల్ పంపుల్లో ప్రదర్శిస్తున్నారని.. దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోదీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది