అమరావతికి మరో అన్యాయం.. రైల్వేకు రాం రాం..
posted on Mar 4, 2021 @ 10:01AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడుగడుగునా అన్యాయం. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ప్రారంభమైన అమరావతి.. నేడు పాడు బడిన రాజధానిగా కునారిల్లుతోంది. అమరావతి వెలుగు పూర్తిగా మసక బారింది. 400 రోజులకు పైగా రైతులు దీక్ష చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. వారి గోడు వినేందుకు, ఆంధ్రుల కలల రాజధానికి పూర్తి చేసేందుకు పూనుకునే నాయకుడే కానరావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతికి అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయి. సీఎం జగన్ రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు ముక్కలాట ఆడుకుంటుంటే.. అడ్డుకోవాల్సిన కేంద్రం సైతం చేష్టలుడిగి చూస్తూ.. చేతులెత్తేస్తోంది. తాజాగా, అమరావతికి ఇచ్చిన మరో హామీని తుంగలో తొక్కింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి రైల్వే లైను ఇస్తామని ప్రకటించింది. ఆ హామీపై ఇప్పుడు తూచ్ అంటోంది కేంద్రం. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందని వాపోతున్నారు రాజధాని ప్రజలు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు, కృష్ణా జిల్లా పెద్దాపురం నుంచి నంబూరు వరకూ, అమరావతి నుంచి పెదకూరపాడు వరకు, సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వరకూ సింగిల్ లైన్లకు గతంలో కేంద్రం హామీ ఇచ్చింది. తాజాగా, ఆ రైల్వే లైను నిర్మాణం నుంచి వెనక్కి తగ్గింది కేంద్రం. అందుకు కారణం జగన్ సర్కారే అనేది కేంద్ర ప్రభుత్వ మాట. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఖర్చును పంచుకునేందుకు రాష్ట్రం ముందుకు రాకుంటే తామేమీ చేయలేమని చెప్పింది. జగన్ రెడ్డి సర్కారు కాస్త చొరవ తీసుకుంటే అమరావతికి రైల్వే లైను తప్పక వచ్చేది. సంక్షేమ పథకాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు.. అమరావతి రైలు కోసం కాసిన్ని డబ్బులు విదిల్చినా చాలు. చుక్ చుక్ బండి ఏపీ రాజధాని నుండి దూసుకుపోతుంది. అలా చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కాసులు ఇచ్చేందుకు కనికరించడం లేదు. ఫలితం.. అమరావతికి రైల్వే స్టేషన్ ఇక తీరని కల. ఆ పాపం.. అక్షరాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాజధాని ప్రజలు ఆరోపిస్తున్నారు.