నలుగురు మంత్రుల మాఫియా
posted on Mar 4, 2021 @ 1:04PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడివేడీగా సాగుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు బాలయ్య. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి... మరొకరు లిక్కర్ మాఫియా నడపడానికే ఉన్నారన్నారు బాలకృష్ణ. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు గత ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వారనీ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి మారిపోయిందని బాలయ్య వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రస్తుతం ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. గతంలో మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామని, ఇప్పుడు ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. హిందూపురంలో ఎవ్వరు భయపడొద్దని, రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లామన్నారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. జవాబు దారి తనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.