సాగర్ లో షాకింగ్ క్యాండిడేట్! జానారెడ్డి కోసం కేసీఆర్ స్కెచ్!
posted on Mar 4, 2021 @ 2:14PM
తేరా చిన్నపరెడ్డి.. నోముల భగత్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఎంసీ కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి... ఇవి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికార పార్టీ అభ్యర్థి రేసులో ఉన్న పేర్లు. వీరిలోనే ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా షాకయ్యేలా అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాల వారీగానే కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్యయాదవ్‌ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య యాదవ్ కొడుకు నోముల భగత్ బీసీ వర్గానికి చెందినవాడే. అయితే నాన్ లోకల్. నాగార్జున సాగర్ నియోజకవర్గ జనాల్లో లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ తలెత్తిందని కేసీఆర్ దృష్టికి వచ్చిందంటున్నారు.అందుకే స్థానికుడైన గురవయ్య యాదవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ఉపఎన్నిక టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వరుస ఓటములతో డీలా పడిన పార్టీ కేడర్ లో జోష్ నింపాలంటే... సాగర్ లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్. అందుకే గతానికి భిన్నంగా అభ్యర్థి ఎంపికలో గులాబీ బాస్ సుదీర్ఘ కసరత్తు చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బలమైన నేతను పోటీలోకి దించాలని భావించిన కేసీఆర్.. పలు సార్లు సర్వే చేయించారట. అన్ని సర్వేలతో పాటు నిఘా వర్గాలు కూడా బీసీ అయితేనే గెలిచే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చాయని సమాచారం. దీంతో కట్టబోయిన గురవయ్యయాదవ్ పేరును కేసీఆర్ దాదాపుగా ఫైనల్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరూ ఊహించని విధంగా గురవయ్యయాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
గురవయ్య యాదవ్ ది నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌కు అల్లుడు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు తోడల్లుడు. కావలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బీద మస్తాన్ రావుకు వియ్యంకుడు. 2018 సంవత్సరం వరకు కుందూరు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. 2018లోనే టీఆర్ఎస్‌లో చేరారు. బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పాటు ఆర్థికంగా ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ గురువయ్య యాదవ్ ను బరిలోకి దింపిందని భావిస్తున్నారు.
మరోవైపు గురువయ్య యాదవ్ పేరు తెరపైకి రావడంతో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని గెలిపించేందుకే కేసీఆర్... కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారని కూడా చర్చించుకుంటున్నారు. బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే నోముల భగత లేదా విద్యార్థి నేత బాలరాజు యాదవ్ కు ఇవ్వవచ్చని... కావాలనే కొత్త వ్యక్తిని పోటీలో పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ యాదవ వ్యక్తికి టికెట్ ఇస్తే బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ టికెట్ రేసులో నివేదితా రెడ్డితో పాటు కడారి అంజయ్య యాదవ్ ఉన్నారు.