ఏయూ వీసీపై గవర్నర్ సీరియస్! సెలవుపై పంపించిన సర్కార్  

ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సెలర్‌  పీవీజీడీ ప్రసాదరెడ్డి సెలవుపై వెళ్లారు. గత నెల 28న విశాఖలో జరిగిన రెడ్డి కుల సంఘం సమావేశానికి ఆయన హాజరు కావడం వివాదాస్పదమైంది. ఆయన వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను సెలవులో పంపింది.  గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఇదే సమావేశానికి వీసీ ప్రసాదరెడ్డి కూడా హాజరై సాయిరెడ్డి పక్కన కూర్చొని.. అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడారు. ఆ వీడియోలో వైరల్ గా మారడంతో వివాదాస్పదమైంది. ఈ నెల 1న విశాఖలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కొందరు ఈ విషయంపై ఫిర్యా దు చేశారు. దీంతో ఆయన ప్రసాదరెడ్డి వ్యవహారంపై విచారించాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. వర్సిటీలకు చాన్సెలర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ కూడా దీనిపై స్పందించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు.. వీసీ ప్రసాదరెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.  విశాఖలో వైసీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఇక్కడి పరిస్థితులు, నాయకులపై పూర్తి అవగాహన లేదు. దీంతో కీలకమైన విషయాల్లో వీసీ ప్రసాదరెడ్డి సలహాలు తీసుకుంటున్నారు. జీవీఎంసీకి గత ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడు వైసీపీలో టికెట్ల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సాయిరెడ్డి ఆ దరఖాస్తులను ప్రసాదరెడ్డికి అప్పగించారు. వాటిని పరిశీలించి, విజయం సాధించే అవకాశం ఉన్నవారి జాబితాను ఇవ్వాలని కోరారు. ఈ పని పూర్తిచేయడానికి అప్పట్లో ఇన్‌చార్జి వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి తన విధులకు మూడు రోజులు సెలవు పెట్టి, రహస్యంగా ఓ గెస్ట్‌హౌ్‌సలో ఉండి ఆ పని పూర్తిచేశారని చెబుతున్నారు.ఆయన సూచించిన వారికే టికెట్లు లభించాయి. ఉప కులపతిగా ఉంటూ అధికార పార్టీ తరఫున పనిచేస్తుండడంతో పలువురు ఆయనపై ఫిర్యాదులు చేశారు. 

ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని పిటిషన్ వేశారు. హౌస్‌మోషన్ పిటిషన్‌ను 18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు.  తిరుపతిలో కార్పొరేషన్ లో టీటీడీ ఉద్యోగులు బరి తెగిస్తున్నారు. వినాయక్ నగర్  క్వార్టర్స్‌లో వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన 41వ డివిజన్ వైసీపీ అభ్యర్థి స్రవంతితో పాటు టీటీడీ ఉద్యోగులు ప్రచారం చేయటంపై సహోద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఉద్యోగులు మీడియాకు సమాచారమిచ్చారు. దాంతో ప్రచారం జరుగుతున్న వినాయకనగర్‌కు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. మీడియాను చూసి వైసీపీ అభ్యర్థి స్రవంతి, టీటీడీ ఉద్యోగులు వెళ్లిపోయారు. ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కోడ్ ఉల్లంఘనల విషయమై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈసీ అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి నేటి ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేసింది.

రీజనల్ రింగ్ రోడ్డుకు లైన్ క్లియర్ 

హైదరాబాద్‌ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో రింగ్‌ రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి ఉత్తర్వులపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయగా... త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మించి... ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం... త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించి భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగ్‌ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఢిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. 500 మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని.. ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది. ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది.

రేవంత్‌కే పీసీసీ పగ్గాలు! సీనియర్లకు రాహుల్ సిగ్నల్

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ క్రెడిట్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం హ్యాండ్సప్ అంది. తెలంగాణలో హస్తం పార్టీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. పేరుకే ప్రతిపక్షం. ఉనికి కోసం తాపత్రయం. అంతలా దిగజారిపోయింది కాంగ్రెస్. పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే సమర్థుడైన పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఉత్తమ్ తర్వాత గట్టి పిండం కోసం వెతుకుతోంది అధిష్టానం. రేసులో మేమున్నామంటూ సీనియర్లంతా హస్తినలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే తురుపు ముక్క కోసం చూస్తున్నారు. రాహుల్ లిస్టులో అందరికన్నా ముందున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  సీఎం కేసీఆర్ పై గట్టిగా పోరాడగల సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆయన మాట ఓ తూటా. గులాబీ బాస్ పై గురి పెట్టి వదిలే ఒక్కే డైలాగ్.. రాజకీయంగా డైనమైట్ లా పేలుతుంటుంది. ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఎఫ్పటికప్పుడూ కడిగేస్తూ, నిలదీసే నేత రేవంత్. రాహుల్ గాంధీకి కావలసింది అలాంటి నాయకుడే. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిన ప్రచార కన్వినర్ గా నియమించి, ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కొడంగల్ లో ఓడిపోవడం రేవంత్ కాస్త తగ్గినట్టు కనిపించినా.. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హడలెత్తిస్తున్నారు. అందుకే, రాహుల్ గాంధీకి రేవంత్ పై ఎనలేని గురి.  లేటెస్ట్ గా రాహుల్ మదిలోని మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.  మధుయాష్కితో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో సీనియర్లు సరిగ్గా పని చేయడం లేదనే అభిప్రాయం రాహుల్ లో కనిపించింది. పరోక్షంగా ఆలత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని.. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పైనే ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే.. రాహుల్ గాంధీని ఆకట్టుకున్న రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండో డోస్ తీసుకున్న వ్యక్తికి కరోనా

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. జనవరి 16న టీకా పంపిణి ప్రారంభం కాగా... కొందరికి రెండో డోసు వేయడం కూడా పూర్తైంది. రెండో విడతలో భాగంగా మార్చి 1నుంచి 60 ఏండ్లకు పైబడిన వృద్దులతో పాటు 45 ఏండ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. అయితే కరోనా టీకా సామర్ధ్యంపై అనుమానాలు మాత్రమే పోవడం లేదు. తాజాగా గుజరాత్ లో కరోనా టీకా రెండో డోస్ ను తీసుకున్న హెల్త్ ఆఫీసర్ కు  మహమ్మారి సోకడం కలకలం రేపింది. సదరు వ్యక్తి రెండో డోస్ తీసుకున్న రోజుల వ్యవధిలోనే వైరస్ బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు.  గాంధీనగర్  దేగం తాలూకా ప్రాంతానికి చెందిన ఆరోగ్య అధికారి జనవరి 16న తొలి డోసు, ఫిబ్రవరి 15న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవలే ఆయనకు జ్వరం రావడంతో నమూనాలు సేకరించి పరీక్షించగా, వైరస్ పాజిటివ్ వచ్చిందని స్థానిక చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి వెల్లడించారు. కరోనా సోకినా ఆయనలో కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన్ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని చెప్పారు. కరోనా సోకిన అధికారి ఆరోగ్యం మెరుగైన వెంటనే విధుల్లో చేరతానని తెలిపారని చీఫ్ హెల్త్ ఆఫీసర్ సోలంకి తెలిపారు.

లోకేశ్ ప్రచారంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఒంగోలు పర్యటన ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని 47వ డివిజన్‌లో లోకేష్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలు ఇవ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలను లోకేష్‌ సముదాయించారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పోలీసులు పంపివేశారు.   21 నెలల్లో హవాలా మంత్రి ఒంగోలుకి ఏం చేశాడని నారా లోకేష్ ప్రశ్నించారు.  ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. మరో అవకాశం ఇస్తే మన కుటుంబాలను జగన్ రెడ్డి నాశనం చేస్తాడని మండిపడ్డారు. తెలుగుదేశం గెలిచిన మొదటి వందరోజుల్లో 110 అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పారు. బకాయిలు ఉన్న ఇంటి పన్ను రద్దు చేస్తామని చెప్పారు.పేదలకు పెరిగిన నీటి పన్ను మాఫీ చేస్తామన్నారు. తాడేపల్లిలో ఆ రెడ్డి గారు.. ఒంగోలు‌లో ఈ రెడ్డి గారు ఏం చేశారని నిలదీశారు.ఒక్క రోడ్డు వేసారా... ఒక నీళ్ల ట్యాంక్ కట్టారా... ఒక ఎల్ఈడీ బల్బ్ బిగించారా.. అని ప్రశ్నించారు. మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలన్నారు. ఒంగోలు లో గత 21 నెలల్లో అభివృద్ధి పడకేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్చి మధ్యలో తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర  2021 -22 బడ్జెట్, ఆశాజనకంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్  ప్రతిపాదిత అంచనాల కోసం సిఎం కెసిఆర్  ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు.  పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా  కొనసాగిస్తామని సిఎం తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన మూడు లక్షల ఢబ్బయి వేల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికి గాను, రానున్న బడ్జెట్ లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సిఎం తెలిపారు.  గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని, దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ వున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపధ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సిఎం తెలిపారు.ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం అన్నారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానా కు దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సిఎం తెలిపారు.కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని,ఈ నేపథ్యంలో, గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నదని సిఎం తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి ఆర్ అండ్ బీ , పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,విద్యా, ఇరిగేషన్ తదితరర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సిఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్ పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది. బడ్జెట్  మార్చి నెల మధ్యలో  ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సిఎం తెలిపారు.  

కలిసిపోయిన బెజవాడ తమ్ముళ్లు! 

విజయవాడ టీడీపీలో వర్గపోరు ముగిసినట్టేనా? చంద్రబాబు ఎంట్రీతో అంతా సెట్ రైట్ అయ్యారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో బెజవాడ తమ్ముళ్లంతా విభేదాలు వీడి కార్పొరేషన్ ఎన్నికల్లో పని చేయనున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ మేయర్ అభ్యర్తి కేశినేని శ్వేత నేరుగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లారు. బొండ ఉమ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురామ్‌ కూడా ఉమ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సహకరించాలని ఆమె కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల మద్దతును శ్వేత కోరారు. శ్వేతనే నేరుగా ఈ ముగ్గురు నేతలను స్వయంగా కలవడంతో సమస్యకు పరిష్కారం దొరికిందనిటీడీపీ  నేతలు చెబుతున్నారు. మొదటి నుంచి కేశినేని శ్వేత మేయర్ అభ్యర్థిత్వంపై బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు బయటపడ్డాయి.   బెజవాడ టీడీపీ నేతల వ్యవహారంపై తొలుత  అధిష్టానం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ సమస్య పరిష్కారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.తిరిగి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సారి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.  టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడి వివాదం చల్లార్చారు. అసంతృప్తి నేతలను చంద్రబాబు సముదాయించినట్టు తెలుస్తోంది.     

పారిస్ ఇంటి తాళాల కోసం వెతికా..  ఐటి దాడులపై తాప్సి కౌంటర్

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటి శాఖ ప్రముఖ హీరోయిన్ తాప్సి. బాలివుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లపై మూడు రోజుల క్రితం దదుడ్లు చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడులు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఐటి సోదాలపై తాప్సీ తాజాగా ట్విటర్ ద్వారా తన స్పందన తెలిపింది. ముఖ్యంగా మూడు విషయాలపై గత మూడు రోజులుగా తీవ్ర శోధన జరిగింది. 1) నాకు పారిస్‌లో బంగ్లా ఉందని ఆరోపించారు కదా.. ఆ ఇంటి తాళాలు కోసం శోధించాను. ఎందుకంటే వేసవి వస్తోంది కదా.. 2) అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఆశతో రూ.5 కోట్ల రిసీప్ట్ కోసం వెతికాను. ఎందుకంటే ఆ డబ్బును నేను గతంలోనే తిరస్కరించాను. 3)అలాగే గౌరవనీయ ఆర్థిక మంత్రిగారు చెప్పినట్టు 2013లో నాపై జరిగిన ఐటీ దాడుల జ్ఞాపకాన్ని కూడా శోధించానని తాప్సీ కేంద్ర ప్రభుత్వం తో పాటు ఐటి శాఖల పై వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు ఇది ఇలా ఉండగా తాప్సీకి పారిస్‌లో ఓ ఖరీదైన బంగ్లా ఉందని, అలాగే లెక్కల్లోకి రాని 5 కోట్ల రూపాయల నల్లధనం ఆమె వద్ద ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క టాగ్ అజరుగుతున్న ఈ ఐటీ దాడులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ.. "ఇలాంటి దాడులు సర్వ సాధారణం. గతంలో 2013లోనూ వీళ్లపై ఐటీ దాడులు జరిగాయి కదా" అని ఆమె పేర్కొన్నారు. దీంతో తాప్సీ తాజాగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ట్విట్టర్ ద్వారా ఇచ్చింది అంతేకాకుండా తాప్సీపై ఇంతకుముందెపుడు ఐటీ దాడులు జరగలేదు.          

ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడు.. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమరం హీటెక్కింది. ప్రచారంలో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ . కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..   కుల బలం, మజిల్ బలం లేకుండానే కేసీఆర్ ప్రయాణ ప్రారంభించారని చెప్పారు. తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి తెలంగాణ జెండా పట్టారన్నారు. రాష్ట్రం వచ్చేవరకు పోరాటం చేయకపోతే రాళ్లతో కొట్టండన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, ఆయన కష్టంతో తెలంగాణ వచ్చిందన్నారు కేటీఆర్. అలాంటి నేతపై ఉద్యమంలో అడ్రస్ లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని.. వాళ్లకంటే చీల్చి చెండాడే సత్తా తమకుందన్నారు కేటీఆర్. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని, సీఎంలనే హడలెత్తించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఘనచరిత్ర ఉందని వెల్లడించారు. కేసీఆర్ అంటే కొందరు లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని విపక్షాలను హెచ్చరించారు. బీజేపీ నేతలది వాట్సప్ యూనివర్సిటీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమీ తెలియదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష? ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదు..  మన్ను లేదన్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని.. వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదన్నారు. అందరి లెక్కలు రాస్తున్నామని, మిత్తితో చెల్లిస్తామన్నారు. ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదన్నారు కేటీఆర్. 

మంత్రుల వ్యవహారంతో వచ్చే ఓట్లు కూడా పోయేలా ఉన్నాయి..

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీఆర్ఎస్ అధినాయకత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోరాడుతోంది. ఈ ఎన్నికలలో ఓడితే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు మరత్న చెలరేగిపోతాయని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఏకంగా మంత్రుల‌ను ఇన్ చార్జ్ లుగా నియ‌మించారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న జిల్లా మంత్రుల‌కు అదనంగా ఈ మంత్రులు అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రుల మాట‌లు, వ్య‌వ‌హరిస్తున్న తీరు టీఆర్ఎస్ పార్టీనే భ‌య‌పెడుతోంది. ఈ మంత్రులు జనంలోకి వెళ్లి ప్ర‌చారం చేసి కొత్త ఓట్లు తేవడం అసంగతి దేవుడెరుగు… అసలు ఉన్న ఓట్లు కూడా పోయేలా ఉన్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. కొత్తగా ప్రచారంలోకి దిగిన ఈ మంత్రి పుంగవులు "మీరు ఓటు వేయకపోతే మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది ఈ ఎన్నికలయ్యాక చూసుకుంటాం" అని ఒకరు… మా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో లబ్ది పొంది మాకు ఒక ఓటు వేయకపోతే వారి కుటుంబాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని మ‌రో మంత్రి భయపెట్ట‌డం తాజాగా ఓటర్లలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మంత్రుల వ్య‌వ‌హ‌రం చూస్తుంటే టిఆర్ఎస్ అభ్యర్థుల ఓట‌మి తప్పదని ఫిక్స్ అయిపోయారు అని సొంత‌పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం నానాపాట్లు పడుతున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు కొన్ని వివాదాస్ప‌ద కామెంట్స్ చేస్తున్నారని కేడర్ మొత్తుకుంటోంది. తాజాగా ఈ మంత్రులు చేసిన వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.      

ప్రేమకు నో చెప్పి.. పెళ్ళికి రెడీ..  

ఎవరైనా  ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారు. అతడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అయ్యాడు. అమ్మాయే కదా ఏం చేస్తుందని అనుకున్నాడు. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. స్థానిక విల్లివాక్కంలో ప్రియుడికి జరుగుతున్న వివాహాన్ని పోలీసుల సాయంతో ఓ యువతి అడ్డుకోవడం కలకలం రేపింది. చైన్నై తిరువళ్లూర్‌ జిల్లా తిరువాలంగోడుకు చెందిన గణేశన్‌ (30) విల్లివాక్కంలో కూయగూరల దుకాణం నడుపుతున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలసి తిరిగేవారు. ఈ నేపథ్యంలో, గణేశన్‌కు మరో యువతితో శుక్రవారం ఉదయం వివాహం జరుగనుందని తెలుసుకున్న ప్రియురాలు విల్లి వాక్కం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కల్యాణ మండపానికి చేరుకొని గణేశన్‌ విచారించారు. గణేశన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను యువతి చూపించడంతో  వధువు, ఆమె కుటుంబసభ్యులు దిగ్ర్భాంతి చెందారు. వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు గణేశన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

నాల్గో టెస్టులో ఘన విజయం! టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ కు భారత్ 

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్  నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించి  హ్యాట్రిక్‌ గెలుపును అందుకుంది కోహ్లీ సేన.  నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో  వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ) ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా.. తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది.  జూన్‌లో లార్డ్స్‌ వేదికగా  ఫైనల్ పోరు జరగనుంది.  నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది.  దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 55 పరుగులు మినహా మరెవరు రాణించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు చేసింది. ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును పంత్‌- సుందర్‌ జోడి ఆదుకుంది. పంత్‌- సుందర్‌ల సెంచరీ భాగస్వామ్యం అందించగా.. సుందర్‌- అక్షర్‌  కూడా సూపర్ గా ఆడి మరో  సెంచరీ భాగస్వామ్యం చేశారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యం దక్కింది.

ఏపీలో మైనార్టీలకు అన్యాయం.. జగన్ పై అసద్ సంచలనం! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది ఎంఐఎం పార్టీ. సీఎం జగన్ కు ఓపెన్ గానే సపోర్ట్ చేశారు పతంగి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్ మద్దతుగా ప్రకటనలు చేశారు అసద్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనార్టీలంతా జగన్ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జగన్ కు ఫుల్ సపోర్టుగా ఉన్న అసద్.. తీరులో ఇప్పుడు మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.   కర్నూల్ పర్యటనకు వచ్చిన అసదుద్దీన్.. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బేకార్ అని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు.  జగన్ మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన, వైసీపీ నేతల తీరుపై కర్నూల్ లో అసద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

ముత్తూట్‌ గ్రూప్ ఛైర్మన్‌ దుర్మరణం

ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్  కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది.  ఎంజీ జార్జ్ ముత్తూట్  హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 1949, నవంబరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్‌ ముత్తూట్‌. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్‌  గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. ఆయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ఈ బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్‌ గా ఉన్నారు. కాగా  రెండవ కుమారుడు పాల్ ముథూట్ జార్జ్ 2009 లో హత్యకు గురయ్యారు.  

విమానం టేకాఫ్‌ అయ్యాక షాకిచ్చిన ప్యాసింజర్ 

కొంత మంది నిర్లక్ష్యం చుట్టూ ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టడం తో పాటు ప్రమాదం పడేస్తుంది. తనకు పాజిటివ్ అని తెలిసి కూడా ప్లైట్ టెక్ ఆఫ్ అయ్యాక చెప్పాడు. ఇక అంటే విమానం లో ప్రయాణికులు అందరు గుండెలు పట్టుకుని కూర్చున్నారు.దేశంలో కరోనావైరస్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన మధ్య ఒక విమాన ప్రయాణికుడి నిర్లక్ష్య వైఖరి కలకలం రేపింది. విమానం మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్‌ తీసుకుంటుందనగా తనకు కరోనా పాజిటివ్‌ అంటూ ప్రయాణికుడు బాంబు పేల్చాడు. దీంతో  హతాశులైన విమాన సిబ్బంది వెంటనే  విమానాన్ని నిలిపి వేసి, అధికారులకు సమాచారమిచ్చారు. ఢిల్లీ నుండి పూణే బయలుదేరిన ఇండిగో 6ఇ -286 విమానంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్‌)సిద్ధమవుతుండగా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి, పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌కు పరిస్థితిని వివరించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన సదరు ప్రయాణికుడిని  అంబులెన్స్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కోవిడ్‌ సెంటర్‌కు తరలించారు అధికారులు. ఆ తరువాత ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించి, ఎవరికీ పాజిటివ్‌ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం మొత్తం శానిటైజ్‌ చేసిన తరువాత సుమారు గంటన్నర ఆలస్యంగా  విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. అలాగే ప్రయాణీకులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా  సూచించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీస్‌ ఉన్నతాధికారి  తెలిపారు.   కాగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. గత ఏడాది మార్చి నుంచి జాతీయ,అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. కోవిడ్-19‌ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ప్రత్యేక నిబంధనలతో దేశీయంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయంగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని డీజీసీఏ  మార్చి 31, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.  

సర్జరీ చేశారు.. బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు..  

వైద్యో  నారాయణ హరీ అంటారు.. డాక్టర్ ను దేవుడితో కొలుస్తుంటారు.. కాని ప్రస్తుతం అంతా కార్పోరేట్ మయం అయింది. వైద్యులు కూడా కాసుల కక్కుర్తిలో పడి .. ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి పాప బలైంది. హాస్పిటల్‌ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అ‍‍ప్పగించటంతో ప్రాణాలు కోల్పోయింది.  ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో  వెలుగు చూసింది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్‌ చేశారు. అయితే హాస్పిటల్‌ బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపును కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది.  ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఓ వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయటంతో సంఘటన వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. హాస్పిటల్ బిల్లు కట్టలేదని.. సర్జరీ చేసి కుట్లు వేయకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ హాస్పిటల్ ను సీజ్ చేయడంతో పాటు కుట్ల వేయకుండా వెళ్లిన డాక్టర్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది.   

బాలయ్య మళ్లీ కొట్టాడు..

బాలయ్య బాబుకు మళ్లీ కోపం వచ్చింది. మరోసారి ఆయన చెయ్యి లేచింది. టపీ టపీ మంటూ రెండు దెబ్బలేశాడు బాలకృష్ణ. ఆయన చేతిలో దెబ్బలు తిన్నది ఓ ఫోటోగ్రాఫర్. మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో పర్యటిస్తున్నారు బాలయ్య. 9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలయ్య ప్రచారం చేస్తుండగా అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ఫోటోలు క్లిక్ అనిపించాడు.  పర్మిషన్ లేకుండా తన ఫోటోలు తీయడంతో తీవ్ర ఆవేశానికి లోనయ్యారు బాలయ్య. వెంటనే అతనిపై చేయి చేసుకున్నారు. అనుమతి లేకుండా ఫోటో తీస్తావా అంటూ చెయ్యితో రెండు దెబ్బలేశారు. ఆవేశంతో ఊగిపోతూ.. ఫోటోగ్రాఫర్ మీద మీదకు వెళ్లి.. కొట్టారు. పక్కనే ఉన్న కార్యకర్తలు ఆపుతున్నా బాలయ్య ఆగలేదు. మొదట ఓ దెబ్బేశారు. అయినా, ఆయనలో ఆగ్రహం చల్లారలేదు. మళ్లీ మీదకు వెళ్లి మరోసారి చెయ్యికి పని చెప్పారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే ఫోటో తీస్తావా? వెంటనే డిలీట్‌ చేయ్‌ అంటూ మండిపడ్డారు బాలకృష్ణ. బాలయ్య కోపాన్ని చూసిన అక్కడి వారంతా హడలెత్తిపోయారు. 

మేయర్ మంట.. తమ్ముళ్ల తన్నులాట..

"నానిని ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని". "ఏ గొట్టం గాడు మాకు అధిష్టానం కాదు". "టీడీపీని  కుల సంఘంగా మార్చుతున్నాడు, పార్టీ ఎవరి జాగీరు కాదు". కేశినేని నానికి బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాల వార్నింగ్.  నాని కావాలా? మేమంతా కావాలా? చంద్రబాబుకు బెజవాడ తమ్ముళ్ల అల్టిమేటం.  విజయవాడ టీడీపీలో అంతర్ఘత కుమ్ములాట. పార్టీ లైన్ తప్పి తెలుగు తమ్ముళ్ల తన్నులాట. కేశినేని నాని ఒకవైపు.. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాలు మరోవైపు. కేశినేని కూతురు శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మిగతా వారంతా గుర్రుగా ఉన్నారు. అంతాకలిసి బొండా ఉమా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని.. కేశినేనిపై కస్సుమన్నారు. తమ పార్టీ నేతనే నోటికొచ్చినట్టు  చెడామడా తిట్టేశారు. టీడీపీలో ఈ స్థాయిలో వర్గ విభేదాలు గతంలో ఎన్నడూ చూడలేదు. ఆధిపత్య పోరు కాస్తా, కులాల కుమ్ములాటలుగా మారాయి. విజయవాడ టీడీపీలో కమ్మ వర్సెస్ కాపు రాజకీయం నడుస్తోంది. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతుంటున్నావంటూ నానిపై చిందులు తొక్కారు అసంతృప్త నేతలు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కేశినేనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు. గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం నాని అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానంటూ బుద్దా వెంకన్న సంచలన కామెంట్లు చేశారు. ‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. తన అనుచరుడుని పంపితే కేశినేని కాళ్లు విరగ్గొడతాడంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ నానిపై మండిపడ్డారు.  బొండా ఉమా సైతం కేశినేనిపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. పనిలో పనిగా అధినేత చంద్రబాబుకు సైతం అల్టిమేటం ఇచ్చారు. కేశినేని కావాలా? అందరూ కావాలా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం.. కులాల మధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వర్గాలను, విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే.. రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే.. కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. ఆదివారం జరిగే చంద్రబాబు టూర్ రూట్ మ్యాప్ ను కేశినేని మార్చేశారని.. ఇలా అయితే చంద్రబాబు పర్యటనకు తామంతా దూరంగా ఉంటామని హెచ్చరించారు బెజవాడ తమ్ముళ్లు. సొంత పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదన్నారు. తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసినవారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయొచ్చని చెప్పారు. విభేదాలు ఉన్నాయని వారుంటున్నారని, లేవని తానంటున్నానన్నారు. విమర్శలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు నాని. అటు.. బెజవాడ తెలుగు తమ్ముళ్ల విభేదాలు అధినేత చంద్రబాబు దృస్టికి చేరాయి. వెంటనే టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు.. అసంతృప్త నేతలను సముదాయించారు. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.