పెరిగిన పాజిటివ్ స్పీడ్.. రెండు రాష్ట్రాలు భయం భయం  

మనదేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కొద్దిరోజుల క్రితం వరకు తగ్గినటుల్గా కనిపించినా తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు పది పన్నెండు వేల మధ్య నమోదు కాగా.. గడచిన 24 గంటలలో కొత్తగా 17,407 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. మరోపక్క నిన్న 14,031 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,08,26,075 కు చేరింది. అదే సమయంలో నిన్న కొత్తగా 89 మంది కరోనా కారణంగా కన్ను మూశారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,435 కు చేరింది. ప్రస్తుతం 1,73,413 మంది వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో ఉంది చికిత్స తీసుకుంటున్నారు.  ఇది ఇలా ఉండగా తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసులలో 60 నుంచి 70 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ నుండి నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 9,855 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. కేరళలో 2,700 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. మరోపక్క మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్క్ పెట్టుకో ని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమవీర్ సింగ్ హెచ్చరించారు. నగరంలోని ప్రత్యేక జోన్‌లలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు అయన తెలిపారు. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,60,500 మంది హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెజిల్ నుంచి వచ్చే మహారాష్ట్రవాసులు ఏడు రోజుల పాటు కంపల్సరీ హోం క్వారంటైన్‌ లో ఉండాలని అధికారులు ఆదేశాలు స్పష్టం చేశారు.  

టీడీపీతో జనసేన పొత్తు.. ఏపీలో బీజేపీకి బిగ్ షాక్!  

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీల సత్తా ఏంటోమున్సిపల్ వార్ లో  తేలిపోనుంది. అందుకే అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కాని మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పొత్తు పూర్తిస్ఠాయిలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. కొన్ని పట్టణాల్లో బీజేపీకి షాకిచ్చింది జనసేన. తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. బీజేపీలో పోటీలో ఉన్నా.. ఆ పార్టీని కాదని.. ఒకప్పటి తమ మిత్రపక్షం టీడీపీతో జట్టు కట్టారు జన సైనికులు.  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో  బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇందులో 24 వార్డుల్లో టీడీపీ, 5 వార్డుల్లో జనసేన పోటీచేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో జంగారెడ్డి గూడెం ఎన్నిక  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంకొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమవారిని పోటీ నుంచి తప్పించారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. ఆ వార్డుల్లో జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఓపెన్ గానే ప్రచారం చేస్తూ జనసేన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీ లేని వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా ఉంటామని దెందులూరు  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.  వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పోతామంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. 

నడిరోడ్డుపై అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం 

అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంకేం రెచ్చిపోయాడు.. నడి రోడ్డుపై వీరంగం వేశాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ..  రోడ్డుపై తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగాడు. రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా సదరు నేత పట్టించుకోలేదు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్  ఎస్ఐతో గొడవపెట్టుకున్నారు. అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసిరికొట్టారు. ఎస్ఐని  నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ లాక్కొన్ని..విసిరికొట్టారు అధికార పార్టీ ఎమ్మెల్యే.  హైదరాబాద్‌ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్ రూట్‌లో వచ్చింది. అక్కడే ఉన్న ఎస్ఐ అడ్డుకున్నాడు. డ్రైవర్‌ను కిందకు దింపి అడిగితే.. తాను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మనిషినని, నన్నే అడ్డుకుంటావా? అని మండిపడ్డారు. నువ్వు ఎవరైతే నాకేంటి.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా.? అని ఎస్ఐ స్పష్టం చేశాడు. ఐతే ఆ వ్యక్తి.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో  కొన్ని నిమిషాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘటనా స్థలానికి వెళ్లారు.  రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డారు ఎమ్మెల్యే. అతడు నా అనుచరుడు అని చెప్పినా.. వినవా..? అంటూ మండిపడ్డారు. ఎస్ఐ పట్ల దుర్భాషలాడారు. నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఇలా ప్రవర్తిస్తారా? అని ట్రాఫిక్ ఎస్ఐ తీరుపై మైనంపల్లి మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురికీ సర్దిచెప్పారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.  ఈ ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ.. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా.. నోటికొచ్చినట్లు తిట్టారని, ఫోన్ పగులకొట్టారని పేర్కొన్నారు. తన డ్యూటీ తాను చేయడం కూడా తప్పా..? అని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ట్రాఫిక్ ఎస్ఐపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

20 ఏళ్ళ జైలు జీవితం తర్వాత నిర్దోషి..

తప్పులు అందరు చేస్తారు. కొందరు తప్పులు చేసి తప్పించుకుంటారు. మరికొందరు దొరికిపోతారు. అదే చేయనని నేరానికి శిక్ష పడితే. కుటుంబం దిక్కులేనిది అవుతుంది. పిల్లను దిక్కులేని వాళ్ళు అవుతారు..అయినా.. ఇలాంటివి సినిమాల్లో కదా జరిగేది అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే. అతడు 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. అర్థ ఆయుష్షు ఉన్నపుడు అయ్యాడు. అతను బతికి ఉన్నాడు అనే విషయం తన కుటుంబం కూడా మరిచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ గ్రామానికి చెందిన విష్ణు తివారీ 23 సంవత్సరాల వయసులో ఓ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 20  ఏళ్ళు జైలు లో ఉన్నాడు. 43 వ ఏట జైలు నుండి విడుదల అయ్యాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తర్వాత.. కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు సా..గుతూ వచ్చింది. అంతలోనే ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లో సగం జీవితం గడిపాడు.  ప్రస్తుత వయసు 43 ఏళ్లు. విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది’’ అంటూ వాపోయాడు. ఎక్కడో జరిగిన తప్పునకు సగం జీవితంతో పాటు.. కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరిగా మిగిలిపోయాడు విష్ణు తివారీ.

అమరావతికి మరో అన్యాయం.. రైల్వేకు రాం రాం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడుగడుగునా అన్యాయం. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ప్రారంభమైన అమరావతి.. నేడు పాడు బడిన రాజధానిగా కునారిల్లుతోంది. అమరావతి వెలుగు పూర్తిగా మసక బారింది. 400 రోజులకు పైగా రైతులు దీక్ష చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. వారి గోడు వినేందుకు, ఆంధ్రుల కలల రాజధానికి పూర్తి చేసేందుకు పూనుకునే నాయకుడే కానరావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతికి అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయి. సీఎం జగన్ రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు ముక్కలాట ఆడుకుంటుంటే.. అడ్డుకోవాల్సిన కేంద్రం సైతం చేష్టలుడిగి చూస్తూ.. చేతులెత్తేస్తోంది. తాజాగా, అమరావతికి ఇచ్చిన మరో హామీని తుంగలో తొక్కింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి రైల్వే లైను ఇస్తామని ప్రకటించింది. ఆ హామీపై ఇప్పుడు తూచ్ అంటోంది కేంద్రం. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందని వాపోతున్నారు రాజధాని ప్రజలు.  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు, కృష్ణా జిల్లా పెద్దాపురం నుంచి నంబూరు వరకూ, అమరావతి నుంచి పెదకూరపాడు వరకు, సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వరకూ సింగిల్ లైన్లకు గతంలో కేంద్రం హామీ ఇచ్చింది. తాజాగా, ఆ రైల్వే లైను నిర్మాణం నుంచి వెనక్కి తగ్గింది కేంద్రం. అందుకు కారణం జగన్ సర్కారే అనేది కేంద్ర ప్రభుత్వ మాట. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఖర్చును పంచుకునేందుకు రాష్ట్రం ముందుకు రాకుంటే తామేమీ చేయలేమని చెప్పింది. జగన్ రెడ్డి సర్కారు కాస్త చొరవ తీసుకుంటే అమరావతికి రైల్వే లైను తప్పక వచ్చేది. సంక్షేమ పథకాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు.. అమరావతి రైలు కోసం కాసిన్ని డబ్బులు విదిల్చినా చాలు. చుక్ చుక్ బండి ఏపీ రాజధాని నుండి దూసుకుపోతుంది. అలా చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కాసులు ఇచ్చేందుకు కనికరించడం లేదు. ఫలితం.. అమరావతికి రైల్వే స్టేషన్ ఇక తీరని కల. ఆ పాపం.. అక్షరాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాజధాని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రెండు కాళ్ల సిద్ధాంతం.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ది రెండు కాళ్ల సిద్ధాంతం.. ఒక కాలు అమరావతిలో.. మరొక కాలు విశాఖపట్నంలో.. రెండు కాళ్ల సిద్దాంతంతో  రాజకీయ ప్రయోజనాల కోసం  ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.. ఇది టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. రాజధాని విషయంలో  జగన్ డబుల్ రోల్ ను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు లోకేష్.   ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. ప్రధాన పార్టీలన్ని జోరుగా జనంలోకి వెళుతున్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ సర్కార్ పై ఘాటు  వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెడ్డి రెండు వైపులా ఉంటారని లోకేష్ విమర్శించారు. ఒకవైపు మూడు రాజధానులు అంటారని, మరోపక్క విశాఖకు కార్యాలయాలు తరలిస్తారని అన్నారు. ఏ2 విజయసాయిరెడ్డికి విశాఖలో ఏం పని? ప్రశ్నించారు నారా లోకేష్. విశాఖలో దోచుకోడానికి వచ్చారా? అని అన్నారు.  టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పార్టీ మారిపోతారంటూ.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.మున్సిపల్  ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు  మూతపడ్డాయన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెంచుతామన్న ఇంటిపన్నును రద్దు చేస్తామన్నారు. ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నా... ఫోకస్ అంతా  విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపైనే ఉంది.  ఏపీ రాజధాని అమరావతికి దగ్గరలో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు ఉండగా... జగన్ రెడ్డి ప్రతిపాదించిన పరిపాలనా రాజధాని విశాఖపట్నం. అందుకే ఈ మూడు నగరపాలక ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ, గుంటూరులో గెలిచి.. అమరావతి రాజధానికే ప్రజలు మద్దతు ఉందని చూపించాలనే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. విశాఖలోనూ విజయం సాధించి.. ఉత్తరాంధ్ర జనం కూడా అమరావతికే జైకొడుతున్నారని చెప్పే ప్రయత్నంలో ఉంది. అధికార వైసీపీ కూడా విశాఖను గెలవడంతో పాటు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకుని.. మూడు రాజధానుల ప్రతిపాదనకే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని నిరూపించాలనే యోచనలో ఉంది. అందుకే ఈ మూడు నగరాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.    

జనాలను కాల్చిన సైనికులు..

ఆ  ప్రాంతం అంత నెత్తురోడింది. మరో యుద్ధ భూమిని తలపించింది. ఎక్కడైనా ఆందోళనలు చేస్తే ఆందోళనకారులను అణిచివేస్తారు .. కానీ అక్కడ అమానుషంగా 38 మందిని చంపేశారు. మీడియా, అంబులెన్సు ఉద్యోగులపైనా దాడిచేశారు. మయన్మార్ అధికార పగ్గాలకోసం సాగిన బాటలో అమాయకులు చావు  చవిచూసింది మయన్మార్ సైనిక సేన. మయన్మార్ లో  పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులపై మారణహోమం సాగిస్తోంది. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది, కవరేజీలో ఉన్న విలేకరులపైనా దాడి చేస్తోంది. బుధవారం ఒక్క రోజే.. ఫేస్‌బుక్‌, స్థానిక మీడియా బయట పెట్టిన ఆధారాల మేరకు పోలీసులు 38 మంది ఆందోళనకారులను కాల్చి చంపారు. బుధవారం ఉదయం 9 గంటలకు పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. సాయంత్రం 5 గంటల సమయంలో.. మిలటరీ సైనికులు రంగప్రవేశం చేశా రు. పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగిస్తుండగా.. సైనికులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఆటోమేటెడ్‌ గన్స్‌తో కాల్పులు జరిపారు.  ఒక్క యాంగాన్‌లోనే 18 మంది మృతిచెందినట్లు సోషల్‌మీడియా, స్థానిక మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియో ఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే, మోన్యవా నగరాల్లో జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు మృతిచెందారు. ఈ మారణకాండను ‘‘రక్తపాత ది నం’’ అని ఐక్యరాజ్య సమితి మయన్మార్‌ అధికార ప్రతినిధి క్రిస్టిన్‌ స్కారనర్‌ అభివర్ణించారు. ఆందోళనలతో సంబంధం లేని వారిపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. యాంగాన్‌లో క్షతగాత్రులకు సాయం చేసేందుకు వచ్చిన ముగ్గురు అంబులెన్స్‌ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆందోళనలను కవ ర్‌ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. 

శశికళతో అమిత్ షా డీల్! స్టాలిన్ టార్గెట్ గా నయా ప్లాన్ 

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకేకు షాకిస్తుందని భావించిన శశిక.. సడెన్ గా రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేయడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పుతారని భావిస్తున్న చిన్నమ్మ.. అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని  ప్రకటన చేయడం తీవ్ర చర్చగా మారింది.  మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా, చిన్నమ్మగా పరిచయమైన శశికళ.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం గత నెలలో విడుదలైంది. దీంతో అన్నాడీఎంకేలోని ఓ వర్గం తిరిగి తమకు మంచిరోజులు వస్తాయని భావించింది. ఆమె దగ్గరి బంధువు టీటీవీ దినకరన్, ఏకంగా తానే సీఎంను అవుతానన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేయడం అందరిని అశ్యర్యపరిచింది.  అయితే శశికళ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి ఇలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది.మరోవైపు డీఎంకే మాత్రం శశకళ నిర్ణయంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్నిఆపలేరని ప్రకటించారు స్టాలిన్.  

పవన్ తో జేడీ మంతనాలు? జనసేనలోకి మళ్లీ ఎంట్రీ! 

ఆంధ్రప్రదేశ్ లో జనసేన బలోపేతంపై ఫోకస్ చేశారు పవన్ కల్యాణ్. ఇటీవల జరిగినపంచాయతీ ఎన్నికల్లో జన సేన మద్దతుతో బరిలో నిలిచిన వారు మంచి ఫలితాలే సాధించారు. 27 శాతం  ఓట్లు సాధించామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల జోష్ తో మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు జనసేన ప్రయత్నిస్తోంది.  జనసేన బలోపేతం అవుతుండటంతో ఆ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. గతంలో ఆ పార్టీలో పనిచేసిన బయటికి వెళ్లిన నేతలు మళ్లీ జనసేనలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పవన్ కల్యాణ్ తో మంతనాలు సాగించారని చెబుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు  లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. అప్పట్లో లక్ష్మీనారాయణ ఆరోపణలపై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇటీవల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓట్ల శాతంపై ఓ న్యూస్ చానెల్ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జనసేన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ తమ ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుందని చెప్పుకొచ్చారు. పార్టీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో తిరిగి చేరతారా అంటే..పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే చేరతానంటూ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత లక్ష్మీనారాయణ మరే ఇతర పార్టీలో చేరలేదు. జనసేన పార్టీపై విమర్శలు కూడా చేయలేదు. దీంతో ఆయన మళ్లీ జనసేనలో చేరడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. లక్ష్మినారాయమ  చేరిక వల్ల పార్టీకి మంచిదే తప్ప నష్టమేమీ లేదని జనసేన నేతవు కూడా  అంటున్నారు.   

దమ్ముందా..? బండికి కేటీఆర్ కౌంటర్

దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేటీఆర్. ఐటీఐఆర్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ITIR ప్రాజెక్టును పక్కన పెట్టామంటూ కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. సొంత పార్టీ మంత్రి చేసిన ప్రకటన బండి సంజయ్ కు తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బెంగళూరు ITIR కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మరి బెంగళూరుకు ఐటిఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా తమ ప్రభుత్వమే కారణమేనా అని ప్రశ్నించారు.  2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన DPRలు బండి సంజయ్ కు పంపిస్తామని.. ITIR తీసుకువచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా అని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే ITIRపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలన్నారు. అసత్యాలు, అబద్దాలతో ప్రచారం చేస్తూ ప్రజలను BJP నేతలు తప్పు దోవ పట్టిస్తున్నారని KTR ఆరోపించారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మీడియాలో ప్రచారం కోసంమే అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారన్నారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా అసత్యాలు, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బయటపడిందన్నారు కేటీఆర్. 

జగన్ తో షర్మిలకు ఆస్తి గొడవలు!

తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. దూకుడు పెంచారు. లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతు కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే మద్దతు పాటు షర్మిల పార్టీపై కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.  షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలపై వైఎస్సార్ కు సన్నిహితంగా మెలిగిన, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని చెప్పారు. షర్మిలకు జగన్ లోక్‌సభ సీటు, రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు. జగన్  కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయన్నారు గోనే ప్రకాశ్ రావు.  గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలైయ్యారని, చాలా మంది భూములు అమ్మి.. స్వరం కోల్పోయారన్నారు గోనే ప్రకాశ్ రావు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే తరహాలో నడుస్తోందన్నారు. ఇలా పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దన్నారు. వైఎస్ విజయలక్ష్మి ఆశీర్వాదం షర్మిలకు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ నేతలందరికి విజయమ్మ ఫోన్ చేస్తున్నారని తెలిపారు,  తెలంగాణలో పార్టీ పెట్టి రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవొద్దని వైఎస్ షర్మిలకు హితవు పలికారు గోనే ప్రకాశ్ రావు.   

ట్రబుల్ షూటర్ 2 .0

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న అధికార తెరాస పార్టీ, పార్టీ అభ్యర్ధి మాజీ ప్రధాన మంత్రి పీవీ కుమార్తె, ఎస్ వాణి దేవి గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  మరోసారి ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించారు. గత కొంత కాలంగా, సిద్దిపేటకే పరిమితమైన హరీష్ రావు, రంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేతలందరూ ఒక తాటిపైకి వచ్చి పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జి నియమిస్తూ పోలింగ్ తేదీ వరకు ఒక్కో ఓటర్ ను మూడు నుంచి ఐదు సార్లు కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తెరాస అభ్యర్థికి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరించాలని, ఇదుకు అవసరమైన ప్రచార సామగ్రిని త్వరలో అందజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తదితరాలపై ఓటర్లకు అవగాహన కల్పించి వారిని తెరాస అభ్యర్థికి ఓటు వేసేలా కృషిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు .. కమల్ మధ్యనే పోటీ ఉంటుందని, ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిల్లా ఎన్నికల ఇంచార్జ్ నాగేంద్ర గౌడ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.       

మండలి ఎన్నికల్లో ఎదురుగాలి! బోగస్ ఓట్లను నమ్ముకున్న గులాబీ ? 

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి.  మార్చి 14న జరగనున్న పోలింగ్ లో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన అధికార పార్టీకి మండలి ఎన్నికలు సవాల్ గా మారాయి. దుబ్బాక, గ్రేటర్ ఫలితాన్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేసేలా బీజేపీ జోరు పెంచింది. మండలి ఎన్నికల్లో సత్తా చాటి తాము బలంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ లో కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందుండి.. ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు.    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోస ంప్రధాన పార్టీలన్ని తమ బలగాలను మోహరించాయి. అయితే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానంలో పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంటిలిజెన్స్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లా పరిధిలో బీజేపీకి సానుకూలత ఉండగా.. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ కొంత ముందుండే అవకాశం ఉంది.  ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. ప్రతి 60 మంది ఓటర్లకో ఇంచార్జ్ ను నియమించింది. పార్టీ పెద్దల ఆదేశాలతో గులాబీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు. దీంతో పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ కొంత పుంజుకుందని తెలుస్తోంది. వాణిదేవి మహబూబ్ నగర్ జిల్లా కోడలు కావడం కూడా ఆమెకు అక్కడ కలిసి వస్తుందని చెబుతున్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి ఓటర్లలో మంచి అభిప్రాయమే ఉంది. విద్యాధికుడు, సౌమ్యుడు అయిన చిన్నా రెడ్డి గురించి ఉద్యోగులు, నిరుద్యోగులు సానుకూలంగా చెబుతున్నారు. అయితే అధికార పార్టీని ఓడించాలనే కసితో ఉన్న  పట్టభద్రులు... గెలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులు.. తమ ఓట్లు చీలకుండా ఒకరికే ఓటు వేయాలని నిర్ణయించుకోవడంతో.. చిన్నారెడ్డి రేసులో వెనకబడిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకే చెందిన హర్షవర్ధన్ రెడ్డి కూడా పోటీలో ఉండటం చిన్నారెడ్డికి ఇబ్బందిగా మారింది. నిజానికి హైదరాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి  ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణిదేవిని రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.  ఇక నల్గొండ-వరంగల్- ఖమ్మం సీటులో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు వెనకబడి పోగా... టీజేఎస్ అధినేత కోదండరామ్, తీన్మార్ మల్లన్న మధ్యే హోరాహోరీ పోరు సాగుతుందని తెలుస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ సర్కార్ పై పోరాడుతున్నారు తీన్మార్ మలన్న. ఆయనపై ప్రభుత్వం కొన్ని కేసులు కూడా పెట్టింది. అయినా బెదరకుండా ముందుకు పోతున్నారు మల్లన్న. దీంతో యూత్ లో మల్లన్నపై ఫుల్ క్రేజీ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నే రేసులో దూసుకుపోతున్నారని తెలుస్తోంది. నిఘా వర్గాల సర్వే ప్రకారం యువ ఓటర్లు ఎక్కువగా మల్లన్నకు మద్దతుగా నిలుస్తుండగా.. ఉద్యోగుల్లో కోదండరామ్ పై సానుకూలత కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమ నేతగా కోదండరామ్ పై  అభిమానం చూపిస్తున్న పట్టభద్రులు.. దాన్ని ఓటు రూపంలో మలుస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. కోదండరామ్ కు ఉద్యోగుల ఓట్లు ఏకపక్షంగా పడితే తప్ప.. మల్లన్న గెలుపు ఖాయమనే చర్చ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరుగుతోంది.  నల్గొండ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే చేతులెత్తేశారని చెబుతున్నారు. తనకు ఇష్టం లేకపోయినా... హైకమాండ్ బలవంతం మీద పోటీ చేస్తున్నారు పల్లా. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్లినా స్పందనే కనిపించడం లేదట. పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం లేదట. దీంతో పరిస్థితిని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ముందే పలాయనం చిత్తగించారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రచారంలో ఏమాత్రం ప్రభావం చూపించడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా రాములు నాయక్ బరిలో ఉన్నా... టీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో పట్టభద్రులంతా కోదండరామ్, మల్లన్న వైపే మొగ్గు చూపుతున్నారని .. హస్తం పార్టీ నేతలే అఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నారు.  హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ సీటులో ఓటర్ల నుంచి తమకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉందంటున్నారు.  ఈ ఎమ్మెల్సీ పరిధిలోనూ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అధికార పార్టీ నేతలు భారీగా బోగస్ ఓటర్లను నమోదు చేయించారని తెలుస్తోంది. ఒక్క మేడ్చల్ జిల్లా పరిధిలోనే మంత్రి మల్లారెడ్డి కాలేజీల కేంద్రంగా దాదాపు 50 వేల బోగస్ ఓట్లు ఎన్ రోల్ అయ్యాయని చెబుతున్నారు. హైదరాబాద్ ఓల్ట్ సిటీలో భారీగా ఫేక్ ఓటర్లు ఉన్నారంటున్నారు. అందుకే పట్టభద్రులు, ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నా.. బోగస్ ఓట్లతో గెలుస్తామనే ధీమాలో గులాబీ పార్టీ నేతలు ఉన్నారంటున్నారు.      పట్టభద్రుల స్థానాల్లో తమకు ఎదురుగాలి వీస్తుండటంతో.. ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ కుట్రలకు ప్లాన్ చేస్తుందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. పోలింగ్ రోజుల దొంగ ఓట్లు వేయించేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించిందని చెబుతున్నారు. తాము ముందే నమోదు చేయించిన బోగస్ ఓట్లు వేయడంతో పాటు.. ఓటింగ్ కు హాజరు కాని పట్టభద్రుల ఓట్లను చివరి రెండు గంటల్లో ఫేక్ ఓటర్లతో వేయించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాలని విపక్ష పార్టీలు, మండలి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కోరుతున్నారు.      

న్యాయవాదుల హత్యపై.. క్రొకోడైల్ కన్నీళ్లు..

వామన రావు దంపతుల హత్య పై ఎట్టకేలకు అధికార తెరాస పార్టీ స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామ రావు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ భవన్’లో నిర్వహించిన లాయర్ల సమావేశంలో, ఓ నిట్టూర్పు విడిచారు. వామన రావు దంపతుల హత్య వార్త విని బాధ తానూ చాలా చాలా బాధ పడ్డానని అన్నారు. అంతే కాదు, కొంత పరోక్షంగానే అయినా, వామనరావు దంపతులను హత్య చేసింది తెరాస పార్టీ వారే, అని అందరిలో వ్యక్తమవుతున్న అనుమానాన్ని అయన కూడా దృవీకరించారు. ఈ దారుణ హత్యకు కొందరు తెరాస నాయకులు బాధ్యులని తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకొచ్చారు. జంట హత్యలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీపడబోరన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అయితే, వామన రావు దంపతుల దారుణ హత్య జరిగి ఇన్ని రోజులు అయినా, హత్యలకు కారకులు కారు పార్టీ వారని లోకం కోడై కూస్తున్నా, పార్టీ నాయకత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఆనం సార్వజనీన ప్రశ్న సమాధానం చెప్పలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం రాజీ పడదని అంటున్న, కేటీఅర్, న్యాయవాదుల దారుణ హత్యకు సంబదించి ఇంతవరకు పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటో కూడా చెప్పి ఉంటే బాగుండేదని, న్యాయవాదులు అంటున్నారు. అదేమీ లేకుండా రాష్ట్రంలో ఏ వర్గంలోనూ ఎలాంటి అసంతృప్తి లేదని, విద్యార్ధులు హ్యాపీ, యువకులు నిరుద్యోగులు డబుల్ హ్యాపీ .. ఇక ఉద్యోగులు అంతతా వారు మరీ మరీ హ్యాపీ అనంట్లుగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, ఆత్మవంచన చేసుకోవడం అంత మంచిది కాదని, కేటీఅర్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న న్యాయవాదులు అంటున్నారు. అలాగే,  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం కార్చే క్రొకోడైల్ కనీళ్ళు ఎవరినీ శాంతింప చేయవు సరికదా, ఆవేదన, ఆగ్రహాన్ని మరింతగా పెంచుతాయి. అంతే కాదు, న్యాయవాదులకే రక్షణ లేని రాష్ట్రంలో , న్యాయానికి, ధర్మానికి చోటెక్కడ అనే ప్రశ్న తెలుత్తుతుంది. అందుకే, ఇప్పడు కావలసింది నిట్టూర్పులు, మొసలి కన్నీళ్ళు కాదు, న్యాయం. భరోసా .. కానీ, కేటీఆర్ మాటల్లో అది లేదనే అంటున్నారు, న్యాయవాదులు. అలాగే, వామనరావు దంపతుల జంట హత్యల ప్రభావం, ఇటు వృత్తిపరంగా, అటు సామాజికంగా కూడా ఓటర్లను ప్రభావితం చేస్తుందని అంతటా వినవస్తోం

జనసేన, బీజేపీలకు ప్రచారం చేస్తా: టీడీపీ నేత

ఏపీలో మున్సిపల్ ఎన్నికల సమరంలో అధికార వైసిపి నాయకులూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నయానో భయానో నామినేషన్లు విత్ డ్రా చేసుకునేలా తీవ్ర వత్తిడి తెస్తుండడంతో వారు ఎన్నికల నుండి సైలెంట్ గా తప్పుకుంటున్నారు. తాజాగా ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీడీపీ తరపున 23వ డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్ధి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తెలుగుదేశం తరపున నామినేషన్ వేసి తరువాత వైసిపి ప్రలోభాలకు లోబడి విత్ డ్రా చేసుకున్న వారిని వదిలేది లేదని ఆయా స్థానాల్లో జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్టీని అమ్ముకున్న వారికి ఇక భవిష్యత్ వుండబోదని, ఐతే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం తాను అండగా వుంటానని అయన భరోసా ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ఏలూరు కార్పొరేషన్లో టీడీపీకి సరైన దిశా నిర్దేశం చేసే లీడర్ కరవయ్యారు. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్టీని లీడ్‌ చేసి విజయపథాన నడిపించారు. అయితే అయన చనిపోవడంతో బుజ్జి తమ్ముడు బడేటి చంటికి కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించినా అయన పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారు. మరోపక్క ఏలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా ఉన్న ఆళ్ళ నాని పార్టీ కేడర్ కంటే అధికారుల సపోర్ట్ తోనే కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత కాలం క్రితం వింత వ్యాధితో సతమతమైన ఏలూరు ప్రజలు ఈ ఎన్నికలలో ఏ తీర్పు ఇస్తారో వేచి చూడాలి.            

జగన్ తో చెల్లికి, తల్లికి విభేదాలు..

జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీలో విభేదాలు లేవా.. షర్మిలకు, జగన్‌కు, తల్లికి విభేదాలు లేవా అని వ్యాఖ్యలు చేశారు. అన్నొక పార్టీ పెట్టారు.. చెల్లి షర్మిల ఒక పార్టీ పెట్టారు.. వాళ్లకున్నాయిగా విభేదాలు.. ఇవన్నీ మాములే అని కేశినేని నాని అన్నారు. ఒక కుటుంబమన్నాక సహజంగా విభేదాలుంటాయని.. రాజకీయాల్లో ఏముంది అని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ఎంపీ సవాల్ విసిరాడు. జగన్‌కు అంత కాన్ఫిడెన్స్ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో కచ్చితంగా తాము కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తీరతామని నాని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 75 నుంచి 80 శాతానికిపైగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతుందన్నారు. విజయవాడలో 64 డివిజన్లు ఉంటే అందులో 45 నుంచి 50 వరకు టీడీపీకే వస్తాయని తెలిపారు.  ఏపీ సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలో అతనిపై అతనికే నమ్మకంలేదని... అందుకే టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఒక్క విజయవాడలోనే టీడీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడగలిగారన్నారు. విజయవాడలోని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరు కూడా నామినేషన్లు ఉపసంహరణకు లొంగేవారు కాదని చెప్పారు. తమ విజయవాడలో అందరూ ఫైటర్సే అని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని వ్యాఖ్యానించారు. భయపెట్టడం, డబ్బులు ఆశచూపి లోబర్చుకోవడం, రకరకాలుగా ఏదో విధంగా ప్రలోభాలు గురిచేయడం, పోలీసులను అడ్డంపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేస్తున్నారన్నారు. జగన్‌పై జగన్‌కే నమ్మకంలేకనే ఇదంతా చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

జగన్ కు మోగిన గంట! వైసీపీలో కుమ్ములాటలేనా?

విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. గంటా వైసీపీలో చేరే అవకాశముందని ఎంపీ విజయసాయిరెడ్డి కన్ఫామ్ చేసేశారు. లేటెస్ట్ గా గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ విజయసాయి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందు అనుచరుడు, ఆ వెనకాలే నాయకుడు కూడా అధికార పార్టీలో చేరుతారని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు, జగన్‌ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  అయితే, గంటా చేరిక వైసీపీలో వర్గ విభేదాలకు కారణమవుతోంది. గంటా అంటే అస్సలు పడని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి గంటాపై బహిరంగ విమర్శలు చేశారు. గంటాకు వ్యతిరేకంగా విశాఖలో ధర్నాలు కూడా నిర్వహించింది అవంతి వర్గం. లోకల్ మంత్రి కాదంటున్నా.. వైసీపీ అధిష్టానం గంటా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటున్నారు. ఒకవేళ గంటా వస్తే.. అవంతి పరిస్థితేంటి? పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతుందా? హైకమాండ్ పై అవంతి అలుగుతారా? ఫ్యాన్ రెక్కలు తలో దిక్కుకు వీస్తాయా? విశాఖ వైసీపీలో వర్గ పోరు ముదిరి అసలుకే ఎసరు వస్తుందా? ఇలా రకరకాల ప్రశ్నలు. విశాఖ రాజకీయంపై జోరుగా చర్చలు. ఇక గంటా శ్రీనివాసరావు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారం లేని చోట ఆయన ఉండరు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కు.. ఆ తర్వాత టీడీపీకి.. ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మంత్రిని కూడా చేశారు. టీడీపీ అధికారం కోల్పోగానే.. పార్టీపై వెగటు పుట్టినట్టుంది. 20 నెలలుగా టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు గంటా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అది కూడా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నా.. పార్టీలో ఇన్ యాక్టివ్ గా ఉంటూ.. విశాఖలో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఇదంతా వైసీపీలో చేరేందుకేనని అంతా అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి నోటి నుంచే ఈ మాట రావడంతో ఇక గంటా సైకిల్ దిగి.. ఫ్యాను గాలిలో కలిసిపోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే, అధికార పార్టీలో బద్ధ శత్రువులైన ఇద్దరు శ్రీనివాసులు ఇమడగలరా? వైసీపీలో వర్గ పోరు ఏ తీరాలకు..?

పీఆర్వో పోస్ట్ ఊస్ట్.. కోల్డ్ వారే కొంపముంచిందా?

గటిక విజయ్ కుమార్. పేరు చెబితే వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ, సీఎం కేసీఆర్ పీఆర్వోగా చాలా మందికి తెలుసు. ప్రెస్ మీట్లలో కేసీఆర్ వెనకే ఉంటాడు. సైలెంట్ గా మీడియాను కోఆర్డినేట్ చేసుకుపోతుంటాడు. CMO, సీఎం తరఫున ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం అసలు పని. అయితే, మనోడు అసలుతో పాటు కొసరు పనులు కూడా బాగానే చేస్తుండే వాడట. ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా ఇటీవలే గుర్తించారట. దీంతో, ఏడేళ్లుగా సీఎంవోకు పీఆర్వోగా ఉన్న విజయ్ కుమార్ పై వేటు పడింది. అతన్ని పీఆర్వో పోస్ట్ నుంచి తీసేశారు. విజయ్ కుమార్ మాత్రం తాను రాజీనామా చేశానని చెబుతున్నాడు.  ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విజయ్ ను సడెన్ గా ఎందుకు తీసేశారనేది చర్చనీయాంశంగా మారింది. పీఆర్వోగా ఉండే విజయ్ కుమార్ సీఎంవో కేంద్రంగా అనేక పనులు చక్కబెట్టేవారని అంటున్నారు. అందులో అనేకం ఆయన సొంత పనులు కూడా ఉండేవట. బాగానే వెనకేసాడట. అలాంటి వారికి ఇలాంటివన్నీ కామనే అయినా.. కేసీఆర్ కు కోపం రావడానికి అసలు కారణం వేరేనట. విజయ్ చేస్తున్న రాజకీయ కుట్రలే అతని పదవిని పీకేసిందని అంటున్నారు.  నిత్యం కేసీఆర్ వెంటే ఉండే విజయ్.. అంతర్ఘత చర్చలు, మంత్రాంగాలను లీక్ చేసే వాడని కొందరు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆ లీకులు మరింత పెరిగాయని.. ఆ విషయం గుర్తించిన సీఎమ్వో విజయ్ పై యాక్షన్ తీసుకుందని అంటున్నారు. అయితే, అసలు కారణం అది కాదని.. చిన బాస్ కేటీఆర్ కు వ్యతిరేకంగా విజయ్ వ్యవహరిస్తున్నారని అందుకే కేసీఆర్ కు కోపం వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల వరకూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి మార్పు అంశంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఇంటర్నల్ గా ఆయన చేసిన కామెంట్లు అసలుకే ఎసరు పెట్టాయని టాక్. ఇక, కేటీఆర్ ను కాదని ఎంపీ సంతోశ్ కుమార్ కు అనుకూలంగా విజయ్ మంత్రాంగం నడిపిస్తుడని.. ఆ విషయం వెలుగుచూడటంతో పీఆర్వోపై వేటు పడిందని సమాచారం.  సీఎంవో పీఆర్వో పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. గతంలో పలు మీడియా సంస్థలకు వరంగల్ లో జర్నలిస్టుగా పని చేశాడు విజయ్ కుమార్. కేసీఆర్ జరిపిన ఉద్యమంపై 'జ్వలిత దీక్ష' పుస్తకం కూడా రాశాడు. విజయ్ పని తీరుకు మెచ్చి సీఎంవోలో పీఆర్వోగా అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్. విజయ్ కోసం అనేక నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగా విజయ్ కుమార్‌ను తెలంగాణ విద్యుత్ శాఖలో జనరల్ మేనేజర్‌ హోదాలో నియమించారు. ఆయనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించి, ఆ జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారనే విమర్శలు వచ్చాయి. అక్కడి నుంచి డిప్యూటేషన్ పై సీఎంవో పీఆర్వోగా తీసుకొచ్చారు. పీఆర్వోగా ఏడేళ్లు అంతా తానై వ్యవహరించారు. ఇప్పుడు యవ్వారం బెడిసికొట్టడంతో పీఆర్వో పోస్ట్ ఊడిపోయింది. కొన్ని కారణాలతో తన పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు విజయ్ కుమార్. పీఆర్వో ఉద్యోగంతో పాటు ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ జాబ్ కి కూడా రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రగతి భవన్ లో ప్రక్షాళన మొదలైందా? అనే చర్చ కూడా జరుగుతోంది.

దేశంలో నెంబ‌ర్ వ‌న్ మోస‌గాడు కేసీఆర్!

భార‌త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో కేసీఆర్‌ను మించిన బ్రోక‌ర్, మోస‌గాడు లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పీఆర్సీ 7శాతం అంటూ ఉద్యోగుల‌ను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వ‌కుండా, నోటిఫికేష‌న్లు వేయ‌కుండా యువ‌త‌ను మోసం చేస్తున్న టీఆర్ఎస్ స‌ర్కార్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పాలి కోరారు. భువనగిరి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఈద్గాలో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి.. స‌ర్కార్ సొమ్ముతో ఓట్లు కొన్న టీఆర్ఎస్ పార్టీకి పొయే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని భావించి ఓటుకు ఎంతైనా పెట్టి కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ప్ర‌భావం రాష్ట్రంలోని 77 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌డుతుంద‌ని వివ‌రించారు. కాబ‌ట్టి విద్యావంతులు, మేధావులు టీఆర్ఎస్ ఓడిపోవ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ఓటును కాంగ్రెస్ వేయాలి కోరారు. క‌మీష‌న్లు వ‌చ్చే ప‌నులే త‌ప్ప క‌మాన్ పీపుల్ ల‌బ్దిపొందే ఒక్క పని కేసీఆర్ చెయ్యలేద‌ని ఆరోపించారు.  వాడేందుకు వీలుగా ఉన్న స‌చివాల‌యాన్ని వాస్తు పిచ్చితో కూల్చి రూ. వెయ్యి కోట్ల‌తో నూత‌న స‌చివాల‌యం క‌ట్టడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. వ‌ర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని మాత్రం ఇప్పటి వ‌ర‌కు నిధులు మంజూరు చేయలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జావ‌స‌రాల‌కు కాకుండా కొడుకును సీఎం చేయాల‌నే కేసీఆర్ దృష్టి సారించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్కార్ విద్యావంతులకు, నిరుద్యోగుల‌కు మొండి చెయ్యి చూపిస్తుంద‌న్నారు.  7శాతం పీఆర్సీ అంటూ ఉద్యోగుల‌ను అవ‌మానించే విధంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. 1.91 ప్ర‌భుత్వ ఖాళీలు ఉన్నాయ‌ని బిస్వాల్ క‌మిటీ చెప్పిన నోటిఫికేష‌న్లు వేయ‌డంలో  ఎంద‌కు మీన‌మేషాలు లెక్కిస్తున్నార‌న్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు 4వేల పాఠ‌శాల‌లు మూసి వేసి నిరుపేద బిడ్డ‌ల‌ను  చ‌దువుకు దూరం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 55వేల మంది టీచ‌ర్లు రిటైర్ అయ్యిన ఇప్ప‌టి వ‌ర‌కు డీఎస్సీ ఎందుకు వేయ‌లేద‌ని ప్ర‌‌శ్నించారు. యువ‌త నోటిఫికేష‌న్లు వేయ్యాల‌ని డిమాండ్ చేస్తున్న దున్న‌పోతు మీద వ‌ర్షం ప‌డ్డ‌ట్లు స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. ఇక రానున్న ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయమ‌ని భావించిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం.. రామేశ్వ‌ర్ రావుతో క‌లిసి హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ సర్కార్ వ‌చ్చిన త‌రువాత వీరి అవినీతి, భూక‌బ్జాల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌న‌ని స్ప‌ష్టం చేశారు. అస‌లు ఉద్యోగ నోటిఫికేష‌న్లు వేసే ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌ని స‌ర్కార్ ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తుంద‌ని ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నించారు. ఏడేళ్లుగా ఒక్క నిరుపేద‌కు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వ‌ని కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై మాట్లాడే హ‌క్కులేద‌న్నారు. అవినీతిపై ఎక్క‌డ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు మ‌ద్ద‌తు తెలిపారని వివ‌రించారు