కేటీఅర్ కల చెదిరినట్లేనా ?

అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రుల కుమారులు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు. కాసు బ్రహ్మానంద రెడ్డి,చెన్నా రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీరామా రావు వంటి హేమాహేమీ నాయకుల సంతతి రాజకీయాల్లో అయితే ఉన్నారు కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఎవరికీ దక్కలేదు. వైఎస్సార్ కుమారుడు, జగన్మోహన్ రెడ్డిని కూడా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆ అదృష్టం వరించలేదు. రాష్ట్ర విభజన తర్వాతనే జగన్ రెడ్డి 13 జిల్లాల అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి వైఎస్ చనిపోయిన వెంటనే ఆయన కుర్చీలో కుర్చోవాలని జగన్ రెడ్డి ఆశపడ్డారని,  ఆసక్తి చూపారని అంటారు. అయన తరపున  మద్దతు కూడగట్టేందుకు ఎమ్మెల్ల్యేల  సంతకాల సేకరణ చేపట్టారని కూడా అంటారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మీద మనసు పరేసుకున్నది అయితే నిజం. అయితే అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన ఆశ తీరలేదు. అంతే కాదు అలా  ఆశకుపోయే ఆయన జైలు పాలయ్యారని అంటారు. అలాగే  తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామా రావు, తమ రాజకీయ వారసుడు, బాలకృష్ణ అని ప్రకటించినా అదీ జరగలేదు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారులు,కుమార్తెలకు ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.  ఆంధ్ర రాష్ట్రం నుంచి విడివడి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆచారమే కొనసాగుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నపరిణామలు,వినవస్తున్నరాజకీయ వ్యాఖ్యలు గమనిస్తే ముచ్చటపడి కాబోయే ముఖ్యమంత్రిగా పిలిపించుకున్న, కేసీఆర్ కుమారుడు కేటీఅర్ కు కూడా ముఖ్యమంత్రి కుర్చీ అందని ద్రాక్షగానే మిగిలి పోతుందని తెలుస్తోంది. కాబోయే సీఎం అంటూ కీర్తించిన నోళ్లే ఇప్పుడు గుసగుసలు పోతున్నాయంటున్నారు.  ప్రస్తుతం అధికార తెరాసలో మునుపటి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పార్టీ మీద పట్టు సన్నగిల్లింది.  కుటుంబంలో పాటు పార్టీలోనూ అంతర్గత విబేధాలు బుసలు కొడుతున్నాయి. నలుగురు నాలుగు దిక్కులా లాగడంతో  ఎటూ పాలుపోక  కింకర్తవ్యం అన్న మీమాంసలో ఆయన ఉన్నట్లు సమాచారం. అంతర్గత విబేధాలను, ఫ్యామిలీలో, పార్టీలో సాగుతున్న కిస్సా కుర్సీకా  కుమ్ములాటలకు తాత్కాలిక పరిష్కారంగానే ముఖ్యమంత్రి ఇటీవల పదేళ్ళు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని బాంబు పేల్చారు. అయినా ముఖ్యమంత్రి పదవి మీద మనసు పారేసుకున్న కేటీఆర్, అది కాస్తా చేజారిపోవడంతో మనసు కష్ట పెట్టుకున్నట్లు, తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమీప భవిష్యత్ లో ముఖ్యమంత్రి మార్పు ఉండదు అనేది స్పష్టమై పోయింది. కనీసం ప్రస్తుత పదవీ కాలం ముగిసే వరకు అయితే  కేటీఆర్ కోరిక తీరదు. ఆ తర్వాత  రాజెవరో .. రెడ్డెవరో ..

వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కాసేపటికే వ్యక్తి మృతి 

దేశంలో తాజాగా 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే క‌రోనా వ్యాక్సిన్‌పై ప్రజలలో ఉన్న అపోహ‌లను పొగొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎంత తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. కొన్ని అప‌శ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి దీంతో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పట్ల అనుమానాల‌ను పెంచుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న స‌మ‌యంలో కారణాలేమైనప్పటికీ చాలా మంది అస్వ‌స్థ‌త‌కు గురి కాగా.. కొంతమంది మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వారి మ‌ర‌ణాల‌కు వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అధికారులు తేల్చారు. ఇది ఇలాఉండగా తాజాగా మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లా భీవండిలో క‌రోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్య‌క్తి..తరువాత కొద్దిసేప‌టికే మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బివాండీ నగరానికి చెందిన సుఖదేవ్ కిర్దత్ (45) కంటి వైద్యనిపుణుడి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్నాడు. సుఖదేవ్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత పరిశీలన గదిలోనే మూర్చపోయాడు. దీంతో వెంటనే అతడిని ఇందిరాగాంధీ స్మారక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యశాఖ డ్రైవరుగా ఉన్న సుఖ్ దేవ్ జనవరి 28న మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే నెలరోజుల క్రితం మొదటి డోస్ తీసుకున్నపుడు సుఖదేవ్ కు ఎలాంటి సమస్య లేదని, అయితే అతనికి కొన్నేళ్లుగా రక్తపోటు సమస్య ఉందని, కాళ్ల వాపు లక్షణాలు కూడా ఉన్నాయని భివాండీ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి కేఆర్ ఖరత్ తెలిపారు. అయితే సుఖ్‌దేవ్ కుటుంబ స‌భ్యులు మాత్రం అత‌నికి గ‌తంలో ఎలాంటి అనారోగ్యం లేద‌ని చెప్తున్నారు. ఇది ఇలాఉండగా సుఖ్ దేవ్ మరణానికి కారణం చెప్పడం కష్టమని.. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని డాక్టర్ ఖరత్ తెలిపారు .         

తనకు పిల్లలు లేరని..పసికందును చంపేసింది..

వివాహం జరిగి 16 నెలలైంది. సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైంది. తనకు పిల్లలు లేరని. అందుకని ఎవరికి పిల్లలు ఉండకుండనుకుంది ఓ మహిళా. మానవత్వాన్ని మరిచిన ఆ కసాయి మహిళా తన తోడికోడలిని అమ్మ బంధానికి దూరం చేసింది. తోడికోడలు కుమారుడిని రెండో అంతస్తుపై నుంచి విసిరేసింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ ఘటన భవానీనగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ కథనం ప్రకారం.. ఈదీబజార్‌ కుమ్మర్‌వాడీకి చెందిన మహ్మద్‌ ఏత్తెషాముద్దీన్‌, మమ్మద్‌ సుజావుద్దీన్‌ సోదరుడు. సుజావుద్దీన్‌కు అయేషాబాను (21)తో 2019 నవంబర్‌లో వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం కలగకపోవడంతో తరుచూ భర్తతో గొడవపడేది. తనకు పిల్లలు లేరని, ఎవరికీ పిల్లలు ఉండకూడదని ఇంట్లో కరెంట్‌ తీగలను బయటకు తీసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాటిని సరిచేయించి, అయేషా బానును పుట్టింటికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత అందరూ సర్దిచెప్పడంతో అయేషా బాను భర్త దగ్గరకు వచ్చింది. మంగళవారం ఎత్తెషాముద్దీన్‌ కుమారుడు నుమానుద్దీన్‌(3)ను మాయమాటలతో రెండో అంతస్తుపైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఆ చిన్నారిని కిందికి పడేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు తీవ్రగాయం కావడంతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అధికార పార్టీలకే మళ్లీ అధికారం! ఐదు రాష్ట్రాలపై  ఒపీనియన్ పోల్

దేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు  కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాల్లో కాక రేపుతున్న పశ్చిమ బెంగాల్ తో పాటు అసోం. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమరం జరుగుతోంది. పుదిచ్చేరికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలే కొనసాగుతాయని ఓపీనియన్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. తాజాగా వచ్చిన ఏబీపీ-సీ-వోటర్ సంస్థ సర్వేలోనూ ఇదే తేలింది.  పశ్చిమ బెంగాల్ లో మరోమారు మమతా బెనర్జీ పాలనా పగ్గాలు చేపట్టనున్నారని అంచనా వేసింది. కేరళలో ఇప్పుడున్న వామపక్ష ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని.. అసోం తిరిగి బీజేపీ హస్తగతమవుతుందని బీపీ-సీ-వోటర్ సంస్థ అంచనా వేసింది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 148 నుంచి 164 సీట్ల వరకూ రావచ్చని సర్వే తెలిపింది.  బీజేపీకి 92 నుంచి 108 సీట్ల వరకూ సాధించి, బెంగాల్ గడ్డపై తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 31 నుంచి 39 సీట్లు దక్కవచ్చని అభిప్రాయపడింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఎన్డీయే కూటమికి 68 నుంచి 76 సీట్ల వరకూ రావచ్చని, కాంగ్రెస్ 43 నుంచి 51 మధ్య, ఇతరులకు 5 నుంచి 10 సీట్లు దక్కవచ్చని తెలిపింది.   140 సీట్లున్న కేరళలో పినరయి విజయ్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్  83 నుంచి 91 సీట్లు సాధించి మరోసారి అధికారం దక్కించుకుంటుందని ఏబీపీ-సీ-వోటర్ సంస్థ  సర్వేలో తేలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 47 నుంచి 55 స్థానాలు, బీజేపీకి రెండు సీట్లు దక్కవచ్చని తెలిపింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా.. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే - బీజేపీ కూటమికి ఎదురు దెబ్బతప్పదని, ఆ పార్టీకి 58 నుంచి 66 సీట్లు మాత్రమే రావచ్చని ఏబీపీ సీ -ఓటర్ అంచనా వేసింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 154 నుంచి 162 సీట్లు సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని తెలిపింది. కమల్ హాసన్ పార్టీ  మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 8 నుంచి 20 సీట్లు రావచ్చని ఏబీపీ-సీ-వోటర్ అంచనా వేసింది.  

మోదీ ఇలాకాలో మజ్లిస్.. ఇక కాస్కో..

ప్రస్థానం ఒక్క అడుగుతోనే ప్రారంభం. దశాబ్దాల క్రితం పాతబస్తీలో ఎగిరిన పతంగి.. నేడు దేశవ్యాప్తంగా రెపరెపలాడుతోంది. హైదరాబాద్ గడ్డపై నుంచి గోద్రా వరకూ విస్తరించింది MIM. గుజరాత్ లోని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ హవా కొనసాగింది. గోద్రా మున్సిపాలిటీలో 9 స్థానాల్లో MIM పోటీ చేసింది. అందులో 7 చోట్ల గెలిచింది. గోద్రాలో మజ్లిస్ గెలుపుతో పతంగి పార్టీలో ఫుల్ జోష్.  గోద్రా. 2002లో మత ఘర్షణలతో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. ఆ తర్వాత గుజరాత్ లో బీజేపీ బాగా బలపడింది. మరో వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మజ్లిస్ పార్టీ ఓ వర్గానికి ప్రతినిధిగా గోద్రాలో అడుగుపెట్టింది. అక్కడి మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన ఎమ్ఐఎస్.. తక్కువ స్థానాల్లోనే అయినా సంచలన విజయాలు నమోదు చేసింది. 9 లో 7 గెలిచి పతంగి జెండా పైపైకి ఎగిరింది.  గోద్రా కంటే ముందే గుజరాత్ లో పలు చోట్ల పాగా వేసింది మజ్లిస్ పార్టీ. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్ఐఎస్  సత్తా చాటింది. అహ్మదాబాద్ లో 4 డివిజన్లు దక్కించుకుంది. మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసి 9 సీట్లు గెలుచుకుంది. బరూచ్‌లోనూ బోణీ కొట్టింది.  ఇన్నేళ్లూ హైదరాబాద్‌ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం.. స్లో అండ్ స్టడీగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మొదటిసారి బీజేపీ ఇలాకా గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో ఎంట్రీ ఇచ్చి.. గెలిచి.. సంచలనం స్రుష్టించింది. 

ప్రేమించలేదని.. పొడిచేశాడు..

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించలేదని అమ్మాయి రక్తం కళ్ల చూశాడు కిరాతకుడు. హైదరాబాద్ నార్సింగ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని హైదర్షాకోట్‌లో ఈ ఘటన జరిగింది. వారిద్దరికీ రెండు ఏళ్ళ పరిచయం ఉంది. ఆ పరిచయం స్నేహంగా ఉండాలని అమ్మాయి భావిస్తే.. ప్రేమగా మారాలని అబ్బాయి ఒత్తిడి తెచ్చేవాడు. ప్రేమించమని తరుచూ వేధిస్తుందనడంతో .. ఆ అమ్మాయి  షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. తన ప్రేమను ఒప్పుకోలేదని కక్షతో కత్తితో పొడిచేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదర్షాకోట్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో ఓ యువతి (23) తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కేంద్రంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమెకు.. స్థానికంగా ఓ సెలూన్‌లో పనిచేసే హరియాణా నివాసి షారుక్‌సల్మాన్‌తో రెండేళ్ల క్రితం పరిచయమైంది. ప్రేమ పేరుతో అతడు తనను తరచుగా వేధించడంతో ఆమె షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే.. ఆమెకు వచ్చే మే నెలలో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో షారుక్‌ సల్మాన్‌ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. మళ్లీ రాత్రి 8 గంటల సమయంలో ఆమెను ఇంట్లో నుంచి పక్కకు తీసుకెళ్లి.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో.. కత్తితో ఆమె కడుపులో పలుమార్లు పొడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతణ్ని అడ్డుకొని కేకలు పెట్టడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతణ్ని పట్టుకుని నార్సింగ్‌ పోలీసులకు అప్పగించారు. యువతిని లంగర్‌హౌజ్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.   

సూపర్ పవర్ సంతోష్! కేటీఆర్, కవిత నారాజ్!   

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకం సచివాలయం. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవోనే సూపర్ పవర్. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్ని సీఎంవోలోనే  ఫైనల్ అవుతుంటాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ ఎవరిదీ అంటే అంతా మంత్రి కేటీఆరే పేరే చెబుతారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే.. పాలనలోనూ చక్రం తిప్పుతున్నారని అనుకుంటున్నారు. సీఎంవోలో ఆయన చెప్పిందే వేదమని భావిస్తుంటారు. అయితే అసలు సంగతి మాత్రం విస్తుపోయేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణ సీఎంవోలో అంతా ఎంపీ సంతోష్ కుమార్ హవానే సాగుతుందని తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ ను ఎవరూ కలవాలన్నా ముందు సంతోష్ ను ప్రస్ననం చేసుకోవాల్సిందేనట. కేసీఆర్ ఫాంహౌజ్ లోకి సంతోష్ కు తప్ప ఎవరికి ఎంట్రీ లేదని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ లోకి మంత్రి కేటీఆర్ , కవిత వెళ్లాలన్న ముందు సంతోష్ ఓకే చేస్తేనే సాధ్యమవుతుందనే చర్చ తెలంగాణ భవన్ లోనే జరుగుతుంది. కేటీఆర్, కవితకే అలా ఉంటే... మిగితా టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కేసీఆర్ వ్యక్తిగత విషయాలతో పాటు పాలనా పరమైన అంశాల్లోనూ ఇప్పుడు సంతోష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు సైతం తమ నివేదికలను సంతోష్ కే ఇస్తున్నారని తెలుస్తోంది. రోజువారి నిఘా వర్గాల వివరాలు కూడా సంతోష్ కు వెళుతున్నాయంటే ఆయన పవర్ ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు.   టీఆర్ఎస్ తో పాటు ప్రభుత్వంలో సంతోష్ పవర్ ఫుల్ సెంటర్ గా మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. అందుకే కేసీఆర్ కలవాలనుకునే నేతలు..  మంత్రులైనా సరే ముందు సంతోష్ ను బతిమాలిడుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సీఎంవోలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావు సలహాదారులుగా ఉంటూ కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వీళ్లతో పాటు సీఎంవోలో ప్రస్తుతం సంతోష్ టీమ్ కూడా పని చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ  పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ సర్వస్యం అయ్యారని తెలుస్తోంది.  గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు వాళ్లంతా సంతోష్ దగ్గరకు వెళుతున్నారట. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను  ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీ  సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి సంతోష్ కేసీఆర్ సీఎంవోలో పవర్ ఫుల్ కావడంపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుస్తోంది. కేటీఆర్ వర్గం కూడా ఈ పరిణామాలపై అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. సంతోష్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుండటంతో... భవిష్యత్ లో కేటీఆర్ కు గండంగా మారవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

సజ్జల ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైంది..!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏ మంత్రికి లేని అధికారాలు ఆయనకే ఉన్నాయని.. సాక్షాత్తు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఆయనకే రిపోర్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తాయి. అయన కనుసన్నలలోనే  రాష్ట్ర హోమ్ శాఖ పని చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అయన మరెవరూ కాదు సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.  తాజాగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవీ హర్షకుమార్‌ విరుచుకుపడ్డారు. "ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండీ? మరీ ఓవరేక్షన్‌ ఎక్కువైంది. అయ్యా మినిస్టర్లూ మీరు కొంచెం ఆత్మగౌరవంతో బతకండి. ఎందుకు ఈ వెధవ పదవులు. కనీసం మీలో ఒక్కడికి కూడా సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వడు. అన్ని వ్యవహారాలపై సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తాడు. ఎందుకు మీకు ఈ వెధవ బతుకులు, కొద్దిగానైనా గౌరవం పెంచుకోండి" అని మాజీ ఎంపీ, రాష్ట్ర మంత్రులను హర్షకుమార్ ఎద్దేవా చేశారు.  ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన హర్షకుమార్..  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి  సీఎం గా ఉన్నప్పుడు ఆయన సలహాదారుల గురించి ప్రజలకు తెలిసేది కాదన్నారు. అప్పట్లో సీఎం ముఖ్య సలహాదారు కేవీపీ రామచంద్రరావుతో సహా అందరూ వెళ్లేవారు. అయితే అన్ని విషయాలు కేవీపీతో చర్చించిన తర్వాతే వైఎస్‌ ఫైనల్ గా నిర్ణయం తీసుకునేవారన్నారు. అయితే కేవీపీప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలను ఎపుడు బయటకు చెప్పేవారు కాదని చెప్పారు. కానీ ఈ సజ్జల ఎవరండీ బాబు, ప్రజల డబ్బు తింటూ.. ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తాడు.. ప్రతిపక్షనేతలను విమర్శిస్తాడూ అని హర్షకుమార్ మండి పడ్డారు. 

ఓటు వేయలేదు.. పింఛన్ కట్.. 

తమ పార్టీకి ఓటు వేయలేదని, పింఛన్ ఇవ్వనన్నారు. పలుసార్లు లభిదారులు వెళ్లి  మొర పెట్టుకున్న పింఛన్ ఇచ్చేది లేదని తెగేశారు. వెళ్లి దిక్కు ఉన్న చోట చెప్పుకోమన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ కి ఓటు వేయలేదని 150 మందికి పింఛన్ ఇవ్వలేదు. పింఛన్ దారుల చేత వేలిముద్రలు వేయించుకుని పింఛను ఇవ్వబోమంటున్నారని నరసరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో  ఏవోకు, ఆర్డీవో ఈవూరి బూసిరెడ్డికి  బాధితులు  ఫిర్యాదు చేశారు. పింఛను డబ్బులు అడిగితే సాయంత్రం ఇస్తామన్నారని, సాయంత్రం అడిగితే మార్కెట్‌ యార్డు చైర్మన్‌, ఎమ్మెల్యేని కలవాలని వలంటీరు చెబుతున్నారని తెలిపారు. అదేమని అడిగితే.. దిక్కున్నచోట చెప్పుకోండని సమాధానమిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే గ్రామస్థులకు పింఛను ఆపివేశారని పమిడిపాడు సర్చంచి గౌసియాబేగం ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది  ప్రజల స్వతంత్రపు హక్కు. తమ ఓటును వాళ్లకు నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీలకు వేసుకుంటారు. అదే ప్రజాస్వామ్యం  తన పార్టీకి ఓటు వేయలేదని పింఛన్ ఇవ్వకపోవడం, ప్రజల హక్కును హరించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాచరిక పాలనలో ఉండేదని. వాదించేవాడు మనవాడైతే వరసలో చివరిలో ఉన్న మనకు అందాల్సినది అందుతుందని, వైసీపీ ప్రభుత్వం తమకు ఓటువేసి వారికే పెన్షన్ ఇవ్వడం విడ్డూరమని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.  

షర్మిల అనుచరుడికి రేవంత్ టీమ్ బెదిరింపులు! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. వరుస సమావేశాలతో దూకుడు పెంచారు. పార్టీ  ఏర్పాట్లలో షర్మిల వెంట అంతా తానై వ్యవహరిస్తున్నారు కొండా రాఘవరెడ్డి. ఇటీవలే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో రేవంత్ సైన్యం పేరిట తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. భౌతిక దాడులు తప్పవంటూ వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను మీడియాకు చూపించారు.  ‘‘నమస్తే కొండా రాఘవరెడ్డి గారూ.. ఈ రోజు మీ ప్రెస్‌మీట్ విన్నాం. 14 ఏళ్లుగా రేవంత్‌రెడ్డి గారు ప్రజల  పక్షాన కొట్టాడుతున్న నాయకుడు. ప్రశ్నించే గొంతుగా ఆయనను ప్రజలు గెలిపించారు. అలాంటి నేతపై మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. రేవంత్‌రెడ్డి గారికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులు తప్పవు’’ అని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. తనకు వచ్చిన హెచ్చరికలపై నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్ షర్మిల పార్టీపై ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యార్థులతో జరిగిన సమావేశంలో షర్మిల డ్రామా చేశారని చెప్పారు. షర్మిలతో మాట్లాడిన వివరాలు బయటపెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన కొండా రాఘవ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంపై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఉద్యోగం ఇప్పిస్తానంటూ రాసలీలలు! కర్ణాటక మంత్రి వీడియో వైరల్ 

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. యడ్యూరప్ప కేబినెట్ లోని ఓ మంత్రి రాసలీలల వీడియో లీక్ వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను లోబరుచుకున్న మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల బాగోతం ఆ వీడియోలో ఉంది.  ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఆరోపించిన మహిళ.. ఆ ఏకాంత దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు.ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ చానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు. అనంతరం ఆ సామాజిక కార్యకర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన రాసలీలల వీడియోపై మంత్రి రమేశ్ జార్కిహోళి స్పందించారు. ఆ సీడీలో ఉన్నది తాను కాదని, తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.  రాసలీలల వీడియో బయటికి రావడంతో బీజేపీలో కలవరం కల్గుతోంది. తమ మంత్రి తప్పు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు  రాత్రి బెంగళూరులో ధర్నా నిర్వహించారు.

టీడీపీ కార్యకర్త పళ్లు పీకి దాడి.. తిరుపతిలో వైసీపీ అరాచకం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను బెదిరించి.. విత్ డ్రా కోసం ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు.  తిరుపతి కార్పొరేషన్‌లోని 45వ డివిజన్ నుంచి చంద్రమోహన్ అనే వ్యక్తి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. లోకేశ్ నాయుడు అనే వ్యక్తి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సాయంత్రం చంద్రమోహన్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే చంద్రమోహన్ అభ్యర్థిత్వాన్ని తాను ప్రతిపాదించడంతో రగిలిపోయిన వైసీపీ కార్యకర్తలు తనపై దాడిచేశారని లోకేశ్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రాత్రి పది గంటల సమయంలో పార్కు పక్కన ఉన్న తన దుకాణంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడిచేసి ధ్వంసం చేశారని, పారిపోయేందుకు ప్రయత్నించిన తనను పట్టుకుని తీవ్రంగా కొట్టారని, దీంతో తన పళ్లు రెండు ఊడిపోయాయని పోలీసులకు  ఇచ్చిన ఫిర్యాదులో లోకేశ్ నాయుడు ఆరోపించారు. ఊడిపోయిన పళ్లను అలిపిరి పోలీసులకు చూపించారు. మరోవైపు, వార్డు కార్యాలయంలో తనపై ఒత్తిడి తెచ్చినట్టు లోకేశ్ నాయుడు చెబుతున్న 47వ వార్డు టౌన్ ప్లానింగ్ కార్యదర్శి సురేంద్ర కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు పని ఖతం! సభ్యులు కావలెను..

70 లక్షల సైన్యం. ఇది గులాబీ దళం బలగం. కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే సంఖ్య. ఇన్నేళ్లూ ఏమో కానీ, ఇప్పుడా లెక్క తప్పింది. పాతాళానికి పడిపోతోంది. టీఆర్ఎస్ ది బలుపు కాదు వాపు అని తేలిపోతోంది. ఈ యేడాది నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిస్సారంగా సాగుతోంది. కారు పార్టీలో చేరేందుకు ప్రజలెవరూ ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఎత్తున చేపట్టాలని చూసిన మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రొగ్రామ్ ప్రజాదరణ లేక తుస్సు మంది. గులాబీ నేతల్లో కలవరం మొదలైంది.  కొంత కాలంగా టీఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. దుబ్బాకలో కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు. జీహెచ్ఎమ్సీ ఎలక్షన్లో గెలిచి ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థే కరువు. నాగార్జున సాగర్ లో ప్రజలు నిండా ముంచేస్తారనే భయం. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ లలో గెలుపు అతి కష్టమే. ఇలా.. కారు పార్టీ నాలుగు టైర్లూ పంక్ఛర్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో పరువంతా పోయి ఇంచు కూడా ముందుకు కదలలేని దుస్థితి. ఇలాంటి నిస్సహాయ సమయంలో కార్యకర్తల బలం సమకూర్చుకునేందుకు పార్టీ సభ్యత్వ నమోదును చాలెంజింగ్ గా తీసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనేక సార్లు మీటింగ్ లు, రివ్యూలతో పార్టీ నేతలను సమాయత్తం చేశారు. ఒక్కో నియోజక వర్గానికి 50వేల మందిని సభ్యులుగా చేర్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే.. సమయం ముగిసే నాటికి లక్ష్యం సగం కూడా పూర్తవలేదు. 50వేల మంది దేవుడెరుగు.. అందులో సగం మంది కూడా పార్టీ తీర్థం తీసుకునేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీపై ప్రజల్లో అంతటి వ్యతిరేకత వచ్చిందంటున్నారు.  పార్టీ మెంబర్ షిప్ లు అంతంత మాత్రంగానే అవుతుండటంతో చిన్న బాస్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారట. ఇలాగైతే ఎలా? పార్టీ ఇజ్జత్ ఏమై పోతుందంటూ నేతలను నిలదీశారని చెబుతున్నారు. ఇటు కేటీఆర్ కస్సుమనడం, అటు జనాలు ఛీ కొడుతుండటంతో.. ఏం చేయాలో తెలీక తలపట్టుకుంటున్నారట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందుకే, చిన బాస్ కు తెలీకుండా ఓ కన్నింగ్ ప్లాన్ అమలు చేస్తున్నారని అంటున్నారు. ప్రజలు ఎలాగూ పార్టీ సభ్యత్వం తీసుకోవడం లేదు కాబట్టి, వారి పేరు మీదుగా టీఆర్ఎస్ లీడర్లే మెంబర్ షిప్ లు తీసేసుకుంటున్నారట. ఎవరిదో పేరు రాసి.. రిజిష్టర్ లో నేమ్ ఎంటర్ చేసి.. పార్టీ మెంబర్ షిప్ ను అమాంతం పెంచేస్తున్నారట. అయినా, కేటీఆర్ పెట్టిన నియోజక వర్గానికి 50వేల సభ్యత్వాల లక్ష్యాన్ని చేరుకోవడం అతికష్టంగా మారింది. ఆ సంఖ్య చేరుకోలేక, కేటీఆర్ తో తిట్లు తినలేక.. నానా తంటాలు పడుతున్నారు జిల్లా స్థాయి నేతలు.  గ్రౌండ్ లెవల్ లో టీఆర్ఎస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కేటీఆర్ మాత్రం పార్టీ సభ్యత్వాలు 70 లక్షలకు చేరుకున్నాయంటూ ప్రకటించడం విచిత్రంగా ఉందంటున్నారు. నవ్వి పోదురు గాక నాకేంటి అన్నట్టు ఉంది టీఆర్ఎస్ తీరని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో ఇక గులాబీ పార్టీకి భవిష్యత్ లేదని.. అందుకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడమే నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. గులాబీ పార్టీ గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు.

ప్రచారానికి సై సై..

రేణిగుంట విమానాశ్రయం ఘటనతో చంద్రబాబు ఈగోను రెచ్చగొట్టింది వైసీపీ సర్కార్. ఇక అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రంగంలోకి దిగారు. జూలు విదిలించిన సింహంలా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సై సై అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారంలో పాల్గొననున్నారు చంద్రబాబు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార షెడ్యూలును తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున చంద్రబాబు పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

వైసీపీ గెలిస్తే.. టీడీపీని మూసేస్తాం..

  ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామని సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సడెన్ గా ఎన్నికలేంటి? ఈ సవాలేంటి? అనుకుంటున్నారా. టీడీపీ నేత బుద్దా వెంకన్న డైలాగ్ పవర్ ఇలానే ఉంటుంది మరి. రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరన్నారు. చంద్రబాబే తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడన్న భయం జగన్‌లో మొదలైందన్నారు. జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామన్నారు బుద్దా వెంకన్న.

బెయిల్ పై వచ్చాడు.. ఆమె తండ్రిని చంపేశాడు..

2018లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని హత్రాస్ లో చెవుటుచేసుకున్న అత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో పొలం ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న బాలిక‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో కోర్టు ఇద్ద‌రు నిందితుల‌ను దోషిగా తేల్చింది. అయితే అందులో ఒకడైన గౌర‌వ్ శ‌ర్మ ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌ల‌య్యాడు. అతడు సోమవారం  గ్రామంలోని ఆలయానికి వెళ్లాడు. అదేసమయంలో బాధితురాలి కుటుంబం మొత్తం అక్కడే ఉంది. దీంతో గౌరవ్ ఆ కుటుంబంతో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో గౌరవ్ శర్మ తన దగ్గరున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాల పాలై బాధితురాలి తండ్రి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. దీంతో బాధితురాలు త‌మ కుటుంబానికి న్యాయం చేయండి.. గౌర‌వ్ శ‌ర్మ అనే కుక్క‌ను శిక్షించండి అంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. ఈలోగా హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆ ఘటనలో గౌరవ్ శర్మతో పాటు నలుగురు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలించి.. . వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈకేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు          

మీటింగ్ లో మతలబేంటి? మీడియా ఓవరాక్షన్..

ఇదిగో తోక అంటే ..అదిగో పులి అంటారు, ఇది ఒక విధంగా మానవ నైజం. ముఖ్యంగా రాజకీయాలలో, రాజకీయ నాయకులలో ఇలాంటి నైజం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరో వంక మీడియా ఎక్కడ, ఎవరితో కలిసారు.. ఎందుకు కలిసారు.. ఏమి మాట్లాడుకున్నారు అని దుర్భిణి వేసి మరీ వెతుకుతుంటుంది.  ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులో, లేదా రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నవారో ఎక్కడో కలిస్తే.. ఇక అక్కడి నుంచి కధలు, కహానీలు మొదలవుతాయి. మీడియా ట్రయిల్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇటు మీడియా అటు సోషల్ మీడియా కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలుతుంది. ఇప్పుడు మీడియాకంటే  సోషల్ మీడియాడి పై చేయి అయిన నేపధ్యంలో ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ కథలు మరీ ఎక్కువయ్యాయి. అది చాలదు అన్నట్లుగా, నిప్పు లేనిదే పొగ రాదనే సమర్ధింపులు. ఇంకో అడుగు ముదుకేసి, మీడియాలోనో,  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న, డబుల్ మర్డర్ కథనో కాదంటే పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అవినీతి భాగోతాన్నో జోడించి, ఆ ఇద్దరు ఎందుకు కలిసారు? అందుకేనా? అంటూ తలా తోకా లేని.. సెన్సేషన్ హెడ్డింగ్స్ తో రేటింగ్స్  పెంచుకునే కహానీలు ప్రసారంచేయడం మీడియాకు అలవాటుగా మారింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు హెచ్చరికలు చేసినా, ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా.. మీడియాలో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మార్పు రావడంలేదు.  అందుకే కావచ్చు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో సమావేశమైన చిన్ని క్లిప్పింగ్, సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అనేక విషయాల్లో పరస్పర అవగాహనా, సహకారం, ఇచ్చి పుచ్చుకోవడాలు వంటివి సవాలక్ష ఉంటాయి. అలాగే.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఒకరినొకరు కలుసుకోవడం సాధారణ విషయం. నిజానికి అది మంచి సంప్రదాయం. గతంలో ఏమో గానే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాష్ట్ర గవర్నర్, ప్రధాన న్యాయమూర్తులను కలసి పరిపాలన సంబంధ విషయాలను చర్చిండం, వారి సలహాలు తీసుకోవడం ఒక ఆచారంగ పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని కలవడం కూడా అలాంటి సత్సంప్రదాయంలో భాగమే కావచ్చును. అంతే కానీ, ఇంకేదో ఉహించుకుని ఇదిగో తోక అదిగో పులి కథనాలకు పోతే.. అది మీడియాకు.. సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా అదిగో పులి కథనాలకు స్వస్తి చెప్పడం మంచింది. కాదంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది.  

పీకేకు పంజాబ్ సవాల్

ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. రాజకీయ పార్టీల జాతకాలను, రాజకీయ నాయకుల తల రాతలను మార్చే మాంత్రికుడిగా ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వారు రాజకీయ మీడియా వర్గాల్లో ఉండరు. నిజానికి రాజకీయ మీడియా వర్గాల్లో మాత్రమేకాదు, మాములు జనాలకు కూడా ఆయన పేరు సుపరిచితమే కావచ్చును. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే, ఆయన  చాలా చాలా సుపరిచిత వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీని గెలిపించింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది,ఈ మాంత్రికుడే అంటారు.గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో, నడిచింది వైఎస్ అయినా నడిపించివాడు కేవీపీ అన్నట్లుగా, జగన్ రెడ్డిని అధికార పీఠం ఎక్కించిన పాదయత్రలో నడిచింది, జగనే అయినా నడిపించిన వాడు మాత్రం ప్రశాంత్ కిషోర్’ అంటారు.  సుమారు గత దశాబ్దకాలంలో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు,చాలా పార్టీలకు రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అలా అందరికీ తెలిసిన రాజకీయ పండితుడిగా ప్రసిద్ధి చెందారు. మధ్యలో స్వయంగా రాజకీయ అరంగేట్రం చేశారు, స్వీయ రాజకీయ భవిష్యత్’ను పరీక్షించుకున్నారు. అయితే ఇప్పడు ఈ ఉపోద్ఘాం ఎందుకంటే, ఇప్పుడు ఆయన్ను మరో అదృష్టం వరిచింది. ఇప్పటికే అయన చేతిలో రెండు మూడు కీలక ప్రాజెక్టులున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్ళీ గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహ కర్తగా, ప్రచార సలహా దారుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎన్నికల వ్యూహ కర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతూ, నినాదాలకు ప్రతి నినాదాలు అందిస్తూ షా’కు చెక్ పెట్టేలా పావులు కడుపుతున్నారు. అంతే కాదు, బెంగాల్’లో బీజేపీకి 200 లకు పైగా స్థానాలు వస్తాయని అమిత షా ధీమా వ్యక్తం చేస్తే, ప్రశాంత్ కిషోర్’ అంతోటి ఆయన గాలి యిట్టె తీసేశారు.  టూ హండ్రెడ్  కాదు,బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య టూ డిజిట్, రెండంకెలు దాటదు, దాటితే ట్విట్టర్  సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. అదలా ఉంటే, ఇప్పుడు ఆయన్ని కొత్తగా వరించిన అదృష్టం, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆయన్ని, క్యాబినెట్ రాంక్ పోస్టు ఇచ్చి తమ సలహాదారుగా తీసుకున్నారు.ప్రశాంత్  కిషోర్, 2017లోనూ పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ నేపధ్యంలో, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరో మారు ప్రశాంత్ కిషోర్’ను కీలక పదవిలోకి తెసుకోవడంతో, అయన నియామకం  మరింత ప్రాధాన్యత   సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకరి కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలే ప్రశాంత్ కిషోర్’తో టచ్’లో ఉన్నట్లు సమాచారం.  

శ్రీమతికి ప్రేమతో...

తెలుగు భాషాభిమాని వెంకయ్య నాయుడు. తన శ్రీమతి ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అచ్చ తెలుగులో లేఖ రాశారు ఉపరాష్ట్రపతి. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా.. తన ప్రేమాభిమానాలన్నీ ఏర్చి కూర్చి.. లేఖతో అక్షరమాల రచించారు. శ్రీమతి ఉషను కొనియాడుతూ వెంకయ్య రాసిన లేఖ.. నిజంగా అద్భుతం. ఆ లేఖ తెలుగు వన్ పాఠకుల కోసం..   న్యూఢిల్లీ, 1 మార్చి 2021. అర్ధాంగి లక్ష్మీ ఉషమ్మకు, నీ 66 ఏళ్ళ జీవితంలో, నేటికి ఐదుపదులకు మించిన జీవితాన్ని నా కోసం, మన కుటుంబం కోసం వెచ్చించిన నీ ప్రేమ, సహనం, ఆదరం, ఆప్యాయత, అవ్యాజానురాగం అనిర్వచనీయమైనవి.  జన్మదినమిదమ్ అయి ‘ప్రియసఖీ’ శం తనోతు తే సర్వదా ముదమ్ ।।  ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వరః సదా త్వాం చ రక్షతు ।। పుణ్య కర్మణా కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకమ్ ।। ఓ ప్రియసఖీ, నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు ఎల్లప్పుడూ శుభమగుగాక. భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన నిన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక, పుణ్యకర్మలాచరించి, కీర్తిని సంపాదించి, జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవలెనని ఆకాంక్షిస్తున్నాను. స్నేహ బాంధవీ.. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి!  మన పెళ్ళి నాడు ఈ ప్రమాణం చేశాము. ఐదు పదుల మన వివాహ బంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అడుగడుగునా నీవు పాటించి, నా చేత పాటింపజేసిన ప్రతి అంశాన్ని ఈ శ్లోకం గుర్తుకు తెస్తుంది. మన వివాహం నాటికి ముందు నుంచే, నా జీవితం ప్రజలతో పెనవేసుకుపోయింది. ఆ తర్వాత ప్రజలనే తప్ప, కుటుంబాన్ని పట్టించుకున్నది చాలా తక్కువని నీకు బాగా తెలుసు.  అయినప్పటికీ పిల్లలను ప్రయోజకులను చేయడమే గాక, వారి పిల్లల బాధ్యతను కూడా తీసుకుని, భారతీయ కుటుంబ వ్యవస్థకు చిరునామాగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు ఉన్నతమైనది. నీదైన, మనదైన ప్రపంచంలో మన పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికీ చోటునిచ్చిన ఆప్యాయతానురాగాలను పంచిన తీరు అపురూపం. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన నాకు, అంతటి అనురాగాన్ని అందించిన అర్ధాంగికి, మనదైన కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన గృహలక్ష్మికి, నా జీవితానికి చేదోడుగా నిలిచిన సహధర్మచారిణికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నాతో కలిసి ఏడడుగులు నడిచిన నీవు, నా తోడు నీడగా ఏడేడు జన్మలూ నడవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమాభినందనలతో...