టీఆర్ఎస్ కు మజ్లిస్ షాక్! 

టీఆర్ఎస్ కు మజ్లిస్ షాక్ ఇవ్వబోతుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న మజ్లిస్ పార్టీ.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరందూరంగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల వరుస పరాజయాలతో కుదేలైన కారు పార్టీకి.. ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం. పట్టభద్రులు, ఉద్యోగులు ఎక్కువ ఓటర్లు ఉండే ఈ స్థానంలో అధికార పార్టీకి గెలుపు కత్తిమీద సామే. అందుకే  ప్రతి ఓటు కోసం శ్రమిస్తున్నారు గులాబీ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్థానంలో కీలకంగా ఉన్న ఎంఐఎం పార్టీ... అధికార పార్టీకి హ్యాండ్ ఇచ్చిందని తెలుస్తోంది.  ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్‌– మహబూబ్‌ నగర్‌–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ  ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్‌ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా,  ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మజ్లిస్ పోటీలో లేనందున మైనార్టీల ఓట్లన్ని.. టీఆర్ఎస్ అభ్యర్థికి పడవచ్చని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మాత్రం మరోలా ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిత్వంపై పతంగి పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణి దేవి..  మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్‌ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు.. అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావే బాధ్యుడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి కూతురు  అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం ఎంఐఎం  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ సహకరించే  పరిస్థితి కనిపించడం లేదు.    అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన మిత్రబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు  సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..  మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు  మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం.. అభ్యర్థి కారణంగా అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంఐఎం తీరుతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

షర్మిలకు ఉస్మానియా విద్యార్థుల మద్దతు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, స్వయానా ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల  తెలంగాణాలో పార్టీ పెట్టనున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తెలంగాణాలో వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తూ చాలా చురుగ్గా కొత్త పార్టీ పెట్టె పన్నుల్లో ఉన్నారు. ఈ నేపథ్యం లో  షర్మిల పార్టీ పై ఎన్ని వ్యతిరేకతలు ఉన్న, మరిన్ని తప్పుడు అభిప్రాయాలూ ఉన్న తెలంగాణాలో షర్మిలకు వైఎస్ అభిమానుల ఆదరణ ఉండనే చెప్పాలి. అభిమానులు మాత్రమే కాదు  ఉస్మానియా యూనివర్సిటీ విద్యారథులు కూడా షర్మిల పార్టీని స్వాగతిస్తున్నారు.    రాజేశేఖర్ రెడ్డి ‌వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కూతురు షర్మిల త్వరలోనే తెలంగాణలో పెట్టబోయే పార్టీని ఓయూ విద్యార్థులు ఆహ్వానిస్తున్నారని ఓయూ జేఏసీ నాయకుడు, పరిశోధక విద్యార్థి అర్జున్‌ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో షర్మిల పార్టీని స్వాగతిస్తూ విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. వైఎస్‌ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు మేలుచేస్తే, టీఆర్‌ఎస్‌  తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఓయూ విద్యార్థులు పలువురు పాల్గిన్నారు. 

ఎక్కడి పొత్తులు అక్కడే ఎవరి గోల వారిదే ..

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదరడం సాధారణ విషయం. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు.అందుకే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనే నానుడి పుట్టింది.అయితే అన్ని పొత్తులను ఒకే గాటన కట్టేయ లేము. ఒకప్పుడు పొత్తులకు అంతో ఇంతో ‘భావసారుప్యత’ లేదా ‘లౌకికవాదం’ అనే ముసుగులు అయినా ఉండేది. ఇప్పుదు అవి కూడా తొలిగి పోయాయి. అధికారం కోసం కొందరు ఉనికిని నిలుపుకునేందుకు ఇంకొన్ని పార్టీలు ఎవరితో అంటే వారితో సంసారానికి సిద్దమై పోతున్నాయి. ముఖ్యంగా దేశంలో సంకీర్ణ రాజకీయాలు పొద్దుపొడిచిన అనంతరం ఒకటి రెండు   మినహాయింపులను పక్కన పెడితే ఇంచు మించుగా దేశంలో ఉన్న అన్నీపార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏలో లేదా అటు బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా అధికారాన్ని అనుభవించాయి. కొన్ని పార్టీలు అయితే సమయానుకూలంగా,అటు యూపీఏలో ఇటు ఎన్డీఏలోనూ అధికారాన్ని పంచుకున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే, పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నబీజేపీ,టీఎంసీ ఒకప్పుడు కలిసి కాపురం చేసిన మిత్రులే...అటల్ బిహారీ వాజపేయి మంత్రి వర్గంలో, మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు.అలాగే,తృణమూల్,బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యాన్మాయంగా తెరపైకొచ్చిన, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తులు అయితే మరీ చిత్రంగా సాగుతున్నాయి. బెంగాల్లో ఆరెండు పార్టీలదీ ఒకటే  జట్టు. రెండు పార్టీలు కలిసి, మరో ముస్లిం పార్టీ తోడుగా పోటీ చేస్తున్నాయి. అదే  కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో కుస్తీ పడుతున్నాయి. ఇప్పుడే కాదు,ఎప్పటి నుంచో, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎం) సారధ్యంలోని, వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్),కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఎఫ్) ప్రధాన ప్రధాన ప్రత్యర్దులుగా హోరా హోరీగా పోరాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ఈ రెండు కూటములే శాసిస్తున్నాయి. కుండ మార్పిడి పద్దతిలో ఐదేళ్లకో సారి అధికారం ఆ కూటమి నుంచి ఈ కూటమికి ఈ కూటమి నుంచి ఆ కూటమికి మారుతూ వస్తోంది. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య శత్రుమిత్ర సంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాగే, అటూ ఇటూ మారుతూ వస్తున్నాయి. తెలుగు రాష్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్’తో ఒకసారి తెలుగు దేశంతో ఒక సారి, ఇలా సమయానుకూలంగా సర్దుబాట్లు చేసుకోవడం చాలా కాలంగా ఉన్నదే. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా చివిచిత్ర పొత్తులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, మహారాష్రాలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన (మహా వికాస్ అఘాది) కూటమి అధికారంలో ఉంది. అయితే, బెంగాల్లో ఎన్సీపీ, శివ సేన పార్టీలు, కాంగ్రెస్’కు మొండి చేయిచూపించాయి. మమత బెనర్జీకి మద్దతు ప్రకటించాయి. అలాగే, బీహార్’ లో కాంగ్రెస్ మిత్ర పక్షం ఆర్జేడీ కూడా కాంగ్రెస్ – కమ్యూనిస్ట్ కూటమిని కాదని, మమత బెనర్జీకి జై కొట్టింది. ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే .. బీజేపీని ఓడించడం .. అయినా, ఎక్కడి పొత్తులు అక్కడే .. ఎవరి గోల వారిదే ..  

ఆ ఒక్కటీ అడక్కు అప్పులకు బుగ్గన భాష్యం

అవసరానికి అప్పులు చేయడం, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడం తప్పు కాదు, కానీ, వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అనుత్పాదక రంగంలో ఖర్చు  చేయడం అయితే అది తప్పే.ఉమ్మడి ఆంద్ర రాష్ట్రంలో అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య మాటల్లో చెప్పాలంటే, స్నో పౌడర్లకు ఖర్చు చేయడం,తప్పు.పప్పూ బెల్లాలకు ఖర్చు చేయడం తప్పు.అయితే, అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, ప్రభుత్వాలు అప్పులు చేయకుండా బండి నడిపించే పరిస్థితి లేదు. రాష్ట్రం ఏదైనా, అధికారంలో ఎవరున్నా, అప్పు లేని, చేయని రాష్ట్రం ఏదీ లేదు. ఎక్కువ తక్కువలు అంతే తేడా మిగిలింది అంతా సేమ్ టూ సేమ్. అందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు మినహాయింపు కాదు, నిజానికి, అక్షర క్రమంలో ముందున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్రం, అప్పులు చేయడంలోనూ ముందు వరసలోనే ఉంది. అది ఎవరో అనడం కాదు, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పిన సత్యం. “అవును రాష్ట్ర ప్రభుతం అంచనాలకు మించి అప్పులు చేసింది,అది నిజం, ఇందులో దాపరికం లేదు” అని అయన కుండబద్దలు కొట్టారు. అంతే కాదు, ప్రజల కోసం, సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం, అప్పులు చేయక తప్పలేదని బుగ్గన అంగీకరించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48, 290 కోట్లు అప్పులు చేయాలన్నది బడ్జెట్‌లో చూపించిన అంచనా. కానీ... ఇప్పటికే రూ.73వేల కోట్ల అప్పులు తీసుకొచ్చాం.సంక్షేమం కోసమే అప్పులు చేశాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రజల కోసం అప్పులు చేశాం. ప్రభుత్వానికి వేరే మార్గం లేదు’’అని బుగ్గన అసలు రహస్యాన్ని బయట పెట్టారు. అయితే, సంక్షేమ పథకాల వలన ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరిగిందని జీఎస్టీ వసూళ్లల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని బుగ్గన వెల్లడించారు. కొవిడ్ కాలంలోను, రాష్ట్రంలో మద్యం పై వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గలేదని. ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ఆదాయం పెరిగిందని మంత్రి వివరించారు. అంటే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవడం వలన రాష్ట్ర రాబడి పెరిగిందని ఆయన వివరించారు.ఇదంతా కూడా జగనన్న సక్షేమ పథకాల వల్లనే సాధ్యమైందని చెప్పారు. బాగుంది. అయితే, రోజు రోజుకు పెరిగి పోతున్న అప్పులను తీర్చే మార్గం ఏదైనా ఉందా అంటే .. ఆఒక్కటీ అడక్కు, అన్నట్లుగా అమాత్యుల సమాధానం ఉంది. నిజానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రుణపరిమితి అధిగమించింది. కొవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రుణ పరిమితిని రెండు శాతం పెంచడం వలన ఇంకా అప్పులు పుడుతున్నాయి కానీ, లేదంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

జగన్ లా వీడియో గేమ్స్ ఆడట్లే! బూతులు మాట్లాడితే తట్టుకోలేరు..

హిందూపురం మున్సిపాలిటీలో సుడిగాలిలా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ. వైసీపీ సర్కార్, జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. తనకు ఎన్నో పనులు ఉన్నాయని... ఎంతో బిజీగా ఉంటూ కూడా తాను ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో సేవ చేస్తున్నాని తెలిపారు. ఇదే సమయంలో సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని కూడా పంచుతున్నానని చెప్పారు. తాను తిడితే తనకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఎవరూ ఉండరని అన్నారు. అయితే తనకు సంస్కారం ఉందని... సంస్కారానికి కట్టుబడే తాను పద్ధతిగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లో వైసీపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌ని అన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నార‌ని బాలకృష్ణ విమ‌ర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు. త‌మ‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ స‌ర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టింద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది త‌మ పార్టీ మాత్ర‌మేన‌ని అన్నారు. నలుగురు మంత్రులు త‌మ పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.

నెంబర్ 2నే విన్నర్! మండలి లెక్కే వేరప్పా...

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్ గా మారాయి. గతంలో ఎప్పుడు లేనంత హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్.. ఇతర ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఓటరు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే బరిలో ఎంతమంది ఉంటే అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు. 79 మంది పోటీలో ఉంటే.. ఒకటి నుంచి 79 వరకు ప్రాధాన్యత ఓట్లు వేసుకోవచ్చు. ఎమ్మెల్సీ  ఎన్నికల్లో గెలుపును ఖరారు చేసేది కూడా భిన్నమే. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వస్తేనే.. గెలిచినట్లు ప్రకటిస్తారు.   తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం ఓట్లు రాకపోతే.. చివరి నుంచి ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అలా.. ఎవరో ఒకరికి 50 శాతం ఓట్లు వచ్చేవరకు ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూనే ఉంటారు.  అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఓటుతో పాటు రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు అత్యంత కీలకం. ప్రస్తుతం జరుగుతున్న  నల్గొండ, హైదరాబాద్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారింది. అభ్యర్థులు కూడా దీనిపైనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు కోదండరామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లు రెండో ప్రాధాన్యత ఓట్లనే నమ్ముకుని విజయంపై ఆశలు పెట్టుకున్నారు.  నల్గొండ స్థానంలో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా రాములు నాయక్ బరిలో ఉన్నారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ తో పాటు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమాదేవిలు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు  గట్టిగా పోరాడుతున్నారు. ఇంతమంది రేసులో ఉన్నారు కాబట్టి.. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఇదే ఇప్పుడు కోదండరామ్ కు కలిసివస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న కోదండరామ్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో సానుకూలత కన్పిస్తోంది. అదే సమయంలో వివిధ పార్టీల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు కూడా ఆయనపై వ్యతిరేకత లేదు. దీంతో వారంతా తమ పార్టీ అభ్యర్థులకు తొలి ఓటు వేసి.. రెండో ప్రాధాన్యత ఓటును కోదండరామ్ కు వేయవచ్చని భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్న, చెరుకుకు మద్దతుగా ఉంటే ఓటర్లు కూడా రెండోప్రాధాన్యత ఓటును కోదండరామ్ కు వేయవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన నల్గొండ సీటులో రెండో ప్రాధాన్యత ఓటుతో కోదండరామ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.  హైదరాబాద్ స్థానంలోనూ నల్గొండ లాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో  గెలుస్తాననే ధీమాలో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి దివంగత ప్రధాని పీవీ కూతురు వాణిదేవీ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు బరిలో ఉన్నారు. ముగ్గురు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓటులో ఒక్కరికే 50 శాతం ఓట్లు రావడం దాదాపుగా అసాధ్యం. అయితే వివిధ పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే పట్టభద్రులు.. రెండో ప్రాధాన్యత ఓటును నాగేశ్వర్ కు వేయవచ్చని భావిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి గెలిచిన నాగేశ్వర్.. రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారు. గత ఎన్నికల్లో రామచంద్రరావు కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గట్టెక్కారు. అందుకే తన ప్రచారంలో రెండో ప్రాధాన్యత ఓటు పై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు నాగేశ్వర్. మరోవైపు తమకు రెండో ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో అధికార పార్టీ తొలి ఓటుపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల మద్దతు తీసుకునేందుకు.. మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన రహస్య సమావేశాలు నిర్వహిస్తూ.. ప్యాకేజీలు ప్రకటిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమ అభ్యర్థులు ఓడిపోతే.. పీఆర్సీ అతి తక్కువగా ఇస్తామంటూ ఉద్యోగులను అధికార పార్టీ నేతలు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా అన్ని పార్టీలకు సవాల్ గా మారిన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరీ... 

ఉత్తమ సర్పంచ్ చెత్త పని..

అవినీతికి కాదెవరు అనర్హం అన్నట్లుగా తయారైంది మనదేశంలో పరిస్థితులు. ప్రతి నిత్యం సర్కార్ తో ఎదో ఒక పని పడే సామాన్యుడు.. అధికారులు, నేతలు చేస్తున్న లంచాల డిమాండ్లతో తల పట్టుకొంటున్నాడు. తాజాగా ఒక ప్రభుత్వ అనుమతి కోసం వచ్చిన ఒక పౌరుడిని స్థానిక సర్పంచ్ లంచం డిమాండ్ చేసాడు. తనకు ఉన్న భూమిలో ఒక కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి ఒక వ్యక్తి నుండి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా.. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌పాషా కుటుంబానికి మన్నెగూడ పంచాయతీ పరిధిలోని వికారాబాద్‌ రోడ్డుపై 200 ఎకరాల భూమి ఉంది. అయితే రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో.. ఒక కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అదే సమయంలో స్థానిక పంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీనికోసం రూ. 20 లక్షలు లంచం ఇస్తేనే కావలసిన అనుమతి ఇస్తానంటూ సర్పంచ్‌ వినోద్‌గౌడ్‌ చెప్పాడు. దీంతో సాజిద్‌పాషా ఏసీబీని ఆశ్రయించారు. నగర శివార్లలో ఉన్న హైదర్‌షాకోట్‌లోని ఆరెమైసమ్మ ఆలయం వద్ద డబ్బు అందజేస్తానని సర్పంచ్‌కు కబురు పెట్టారు. ఆ ఆలయం వద్ద కారులో తెచ్చిన రూ. 13 లక్షలు వినోద్‌గౌడ్‌కు అందజేశారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వినోద్‌గౌడ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా అధికారులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అధికారులు అతడిని వెంబడించి మరీ పట్టుకుని కెమికల్‌ పరీక్షలలో పాజిటివ్‌ రావడంతో, అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా ఏసీబీ అరెస్టు చేసిన వినోద్‌గౌడ్‌ గతంలో ఉత్తమ సర్పంచ్‌ అవార్డును అందుకోవడం కొసమెరుపు.

100 రోజులకు రైతుల ఆందోళన.. బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ 

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వందరోజులకు పైగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనను ఎంతకాలం అయినా కొనసాగిస్తామని, ఆందోళను సారధ్యం వహిస్తున్న రైతు సంఘాల సమాఖ్య స్పష్తం చేస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ ఆందోళనకు దేశం సరిహద్దుల వెలుపలి నుంచి మద్దతు లభిస్తోందా అంటే, అవుననే అనవలసి వస్తోంది. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రైతు  సంఘాలు, రైతు సంఘాలకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు, కేవలం, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ మూడు  రాష్ట్రాలకే పరిమితం అయిన ఆందోళను, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నం అంతగా చేయడం లేదు. కానీ, అంతర్జాతీయ మద్దతును కూడకట్టడంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బహిరంగంగానే అంతర్జాతీయ సమాజం మద్దతు కోరుతున్నారు. అంతర్జాతీయ ప్రముఖుల మద్దతును రైతు సంఘాలు బహిరంగంగానే స్వాగతించాయి.  మన దేశంలో జరుగతున్న రైతుల ఆందోళన బ్రిటీష్ పార్లమెంట్’లో  మార్చి 8న చర్చకు రానుంది. అయితే భారత దేశంలో జరుగతున్న రైతుల ఆందోళన ఆ దేశ అంతర్గత వ్యవహారం’ అని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్తం చేసింది ‘రైతుల నిరసనల అంశం భారత్‌ అంతర్గత సమస్యేనని బ్రిటన్‌ ప్రభుత్వం అభిప్రాయం. వాటిని పరిష్కరించుకోవడం పూర్తిగా భారత్‌ చేతుల్లోనే ఉంది’ అని భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌ స్పష్టంచేశారు. అయితే బ్రిటన్‌ పార్లమెంట్‌ నియమాల ప్రకారం, ఏదైనా అంశంపై లక్షకు పైగా సంతకాలతో, ఈ-పిటిషన్‌ దాఖలైతే పార్లమెంట్ చర్చించక తప్పుదు. భారత దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనపై చర్చను కోరుతూ లక్షకు పైగా సంతకాలతో ఈ-పిటీషన్ దాఖలైంది. అందుకే చర్చ. ఇది సాధారణ ప్రక్రియ. బ్రిటీష్ ప్రభుతం మాత్రం రైతుల ఆందోళను భారత దేశ అంతర్గత సమస్యగానే చూస్తోంది, అని భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ స్పష్టం చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వ భావన ఏదైనా,భారత రైతుల ఆందోళనను  అంతర్జాతీయ సమస్యగా చిత్రించే ప్రయత్నం సాగుతోంది అనేది మాత్రం, లక్ష సంతకాలతో స్పష్టమైంది.  మరోవంక ‘టైమ్స్ మ్యాగజైన్’ తాజా సంచిక రైతుల ఆందోళనలో మహిళా రైతుల పాత్రను హై లైట్ చేస్తూ, కవర్ స్టొరీ ప్రచురించింది. అలాగే, ‘ఫ్రీడం హౌస్’ అనే స్వచ్చంద సంస్థ భారత దేశంలో మానవ హక్కుల హననం జరుగుతోందని ఆరోపిస్తూ, భారతప్రజలకు సంపూర్ణ స్వేఛ్చ లేదని  పాక్షిక స్వేచ్ఛను మాత్రమే అనుభవిస్తున్నారని,2021 వార్షిక నివేదికలో పేర్కొంది.  భారత ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని పలుమార్లు, పార్లమెంట్ లోపల వెలుపల కూడా స్పష్టం చేసింది. నూతన వ్యసాయ చట్టాల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలిగించేందుకు రైతు సంఘాలతో 11 మార్లు చర్చలు జరిపింది. అలాగే, చట్టాలకు సవరణలు చేసేందుకు, 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపి వేసేందుకు సంసిద్ధతను వ్యక్త పరిచింది. అయినా, రైతు సంఘాలు మాత్రం మెట్టు దిగిరావడం లేదు. చట్టాల సంపూర్ణ,సముల రద్దు తప్ప దేనీకీ అంగీకరించేది లేదని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. అందుకే, రైతుల ఆందోళన విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ శక్తుల జోక్యానికి సంబంధించి పలు సందేహాలు వ్యక్త మవుతున్నాయి. 

బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖ టీడీపీలో ఫుల్ జోష్

బొబ్బిలి పులిలా గాండ్రించాలి. అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి. ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి. విశాఖలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇది. ఆయన కూడా అదే పని చేశారు. విశాఖ వీధుల్లో జగన్ సర్కారుపై బొబ్బిలి పులిలా గాండ్రించారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అల్లాూరి సీతారామరాజులా ఉద్యమించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడారు. విశాఖలో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై టీడీపీ, జై చంద్రన్న, జై విశాఖ ఉక్కు నినాదాలతో స్టీల్ సిటీ మారుమోగిపోయింది.  అనూహ్యం. అద్భుతం. చంద్రబాబు విశాఖ టూర్ ఆసాంతం సూపర్ హిట్. ప్రభుత్వంపై ప్రజలు ఎంత అసహనంతో ఉన్నారనే దానికి చంద్రబాబు పర్యటన విజయవంతం అవడమే నిదర్శనం. చంద్రబాబు వెళ్లిన చోటల్లా అభిమానులు భారీగా తరలివచ్చారు. బాబు మాటలను ఆసక్తిగా విన్నారు. చంద్రబాబు స్పీచ్ సైతం ఇదివరకులా చప్పగా సాగలేదు. మాంచి ఫైర్ మీదున్నారు బాబు. బాంబుల్లాంటి మాటలతో జనాల్లో జోష్ నింపారు. "విశాఖకు రౌడీలు వచ్చారు. భూములు లాక్కొంటున్నారు. ఇంకొన్నాళ్లు పోతే ప్రజల ఆస్తులు కొట్టేస్తారు." ఇలా సర్కారుపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రతిపక్ష నేత ఫుల్ ఫైర్ రాజేశారు.  హుద్ హుద్ తుఫాను తర్వాత విశాఖ ఎలా మార్పు చెందిందో.. ప్రస్తుత నగరం ఎలా ఉందో పోల్చి చెబుతూ.. ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు చంద్రబాబు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోస్కోతో చీకటి డీల్.. ఇలా ప్రభుత్వ లోటుపాట్లను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో సక్సెస్ అయ్యారు. నెల రోజులుగా జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి చంద్రబాబు పర్యటనతో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.  మార్చి 10న విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. అధికార పార్టీ ఏడాది నుంచి నగరంపై కన్నేసింది. ఎంపీ విజయసాయిరెడ్డిని ఇంఛార్జిగా నియమించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తూ వచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించాక, వైసీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. విశాఖలో తమకిక తిరుగులేదనుకున్నారు. అంతలోనే.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడం.. పోస్కో వెనుక వైసీపీ పెద్దల మంత్రాంగం ఉందని తెలుస్తుండటంతో అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు విశాఖ ఓటర్లు. అదే సమయంలో విశాఖ ఉక్కు కోసం టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండటం, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు నిరవధిక నిరాహార దీక్ష దిగడంతో.. విశాఖలో పొలిటికల్ ఈక్వేషన్ ఒక్కసారిగా టీడీపీ వైపు టర్న్ అయింది.  చంద్రబాబు విశాఖలో  పర్యటించడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. చంద్రబాబు స్పీచ్ అదిరిపోయేలా, ఆకట్టుకునేలా, ఆలోచన కలిగించేలా ఉండటంతో ప్రజల్లో చైతన్యం మరింత పెరిగింది. గతంలో హుద్ హుద్ సమయంలో చంద్రబాబు నగరంలోనే మకాం వేసి తుఫాను సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షించిన తీరు.. విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం.. పలు అంతర్జాతీయ సంస్థలను విశాఖకు తీసుకురావడం.. ఇలా సీఎంగా చంద్రబాబు హయాంలో జరిగిన నగర అభివృద్ధి ఆసాంతం ప్రజల కళ్లముందు సాక్షాత్కరించింది. టీడీపీ పాలన, వైసీపీ ప్రభుత్వ విధానాలను పోల్చి చూసుకుంటూ.. బాబు గారు ఎంతో బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఆ ప్రజాభిమానం మార్చి 10న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిఫలించడం ఖాయం. చంద్రబాబు విశాఖ టూర్ తో బాస్ ఈజ్ బ్యాక్ నినాదం హోరెత్తుతోంది. 

ఈసారి చంచల్ గూడా కాదు.. ఫారిన్ జైలుకే

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జాతీయ మీడియాలో జగన్ సర్కార్ పై వచ్చిన కథనాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేసారు. ఎపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు కేవలం తనపై ఉన్న కేసుల మాఫీకోసమేనని తేలిపోయిందని ఎద్దేవా చేసారు. తాజాగా నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే జగన్ అండ్ డెకాయిట్ బ్యాచ్‌కు మరోసారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోందన్నారు. అయితే తాజాగా కొంతమంది విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్‌ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఈసారి చంచల్ గూడా కాకుండా.. విదేశీ జైల్యూక్ వెళతారని లోకేష్ అన్నారు.   అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎపి సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని కొన్ని విదేశీ సంస్థలు ఆరోపణలు చేసాయి. సీఎం జగన్‌కు దగ్గరగా ఉండే వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవాళ్లు విదేశాల్లో లెక్కపెట్టలేనన్ని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం అనుచరులు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విదేశాల నుండి పిర్యాదులు, ఆరోపణలు రావడంతో కేంద్రం వాటి సంగతి తేల్చేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నలుగురితో లవ్.. అంతాకలిసి జంప్.. లక్కీ డ్రాలో పెళ్లి

యూపీలో ఒక యువతి నలుగురు యువకులను ప్రేమించింది. ఆ యువకులు కూడా ఆమెను అంటే గాఢమగు ప్రేమించారు. కొన్నాళ్లకు వారితో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఈ ఐదుగురు కలిసి వారిలో ఒకరి బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు.ఇక ఆ యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెండి.. ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. కొద్దిరోజులకు ఆమె ఆచూకీ దొరకగా.. ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు.  తరువాత గ్రామ పెద్దలు ఆ నలుగురు యువకుల్లో ఒకరికి ఇచ్చి ఆ యువతికి వివాహం చేయాలని నిశ్చయించారు. దీంతో ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన‌ను గ్రామ పెద్దలు ఆ యువతి ముందుంచారు. అయితే ఆ యువతి ఈ విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో పాటు.. తాను ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నానో తెలియడం లేదని చెప్పింది.  దీంతో గ్రామ పెద్దలు ఎటూ పాలుపోక ఇక లాటరీయే దిక్కని భావించారు. ఆ నలుగురు యువకుల పేర్లను చీటీలపై రాసి ఒక చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. అందులో వచ్చిన యువకుడితో, ఆ యువతికి పెళ్లి ఖరారు చేసి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. దీంతో ఈ చిక్కుముడి వీడి త్వరలోనే వారిద్దరి పెళ్లి జరగబోతోంది. ఇలా ఒక జఠిల ప్రేమ కథకు ఆ గ్రామ పెద్దలు ఎలాగైతే శుభం కార్డు వేశారు.

శ్రీధరన్ ఓకే.. అద్వానీ, జోషీ నాట్ ఓకేనా?

2014 సార్వత్రిక ఎన్నికలు. బీజేపీ అఖండ విజయం. ప్రధాని రేసులో అద్వానీ, మోదీ. వయసు మీద పడిందనే ముద్రతో అద్వానీని పక్కన పెట్టేశారు కమలనాథులు. బీజేపీలో 75 ఏళ్లు పైబడిన నేతలందరికీ రాజకీయ సన్యాసమే. ఇదీ ఆ పార్టీ పెట్టుకున్న సిద్ధాంతం. అద్వానీ, జోషీ, శాంతకుమార్ లాంటి వారిని అలానే పక్కన పెట్టేశారు. మార్గదర్శక మండలి క్రియేట్ చేసి.. వారికి ఎలాంటి పని లేకుండా చేసి.. వారి ప్రాభవాన్ని మసకబార్చారు. ఇదంతా అప్పటి వరకూ పార్టీలో గట్టి పట్టున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్లను తనకు అడ్డు రాకుండా చేసేందుకు మోదీ నడిపిన మంత్రాంగం అని పార్టీ వర్గాలే అంటుంటాయి. లేటెస్ట్ విషయానికి వస్తే.. కేరళలో 89 ఏళ్ల శ్రీధరన్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మరోసారి వయసు వ్యవహారం తెరపైకి వచ్చింది.  బీజేపీ పెట్టుకున్న నియమం ప్రకారం 75 ఏళ్లు దాటితే ఎంతటి నేతైనా ఇక ఇంటికే పరిమితం. కానీ, కేరళలో ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. ఓట్లు దండుకునేందుకు 89 ఏళ్ల కురవృద్ధుడు, మిస్టర్ఱ క్లీన్ ఇమేజ్ మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఎన్నికల బరిలో దింపారు. అద్వానీ, జోషీ విషయంలో వర్తించిన రూల్.. శ్రీధరన్ ఎపిసోడ్ లో ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.  సుబ్రహ్మణ్యస్వామి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నేత. పార్టీలోనే ఉంటూ, పార్టీ లైన్ కు కట్టుబడే ఉంటూ.. కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేయడంలో దిట్ట. లేటెస్ట్ గా, శ్రీధరన్ విషయంలో సంచలన కామెంట్లు చేశారు. ఏజ్ పాలిటిక్స్ పై గట్టిగా ప్రశ్నించారు. 89 ఏళ్ల శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందున.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ, జోషిలు కూడా పోటీ చేయాలంటూ సూచించారు సుబ్రహ్మణ్యస్వామి.  ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87. 2024లో పోటీ చేద్దామన్నా శారీరకంగా సహకరించకపోవచ్చు. వాళ్లు పోటీ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన పాయింట్ మాత్రం పార్టీని ఇబ్బందికి గురి చేస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందేగా? బీజేపీ సైతం అందుకు అతీతమేమీ కాదుగా? అందుకే అంటారు చెప్పేందుకే నీతులు అని...

అప్పుడు ముద్దులు... ఇప్పుడు గుద్దులు...

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెందుర్తిలో రోడ్‌షో ప్రారంభించిన చంద్రబాబు.. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ప్రజలను కోరారు. అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలన్నారు. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి.  అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా?  వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు అన్నారు. ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీ తనకు తెలియదని సీఎం బుకాయించారు. పార్లమెంటులో మంత్రి సమాధానంతో అడ్డంగా దొరికిపోయారు. పోస్కోతో స్టీల్‌ప్లాంట్‌ నాన్‌బైండింగ్‌ ఒప్పందం బట్టబయలు కావడంతో వీరి కుట్రలు ప్రజలకు  తెలిశాయి అని చంద్రబాబు చెప్పారు. ఉక్కు భూములను అమ్మేయడానికి ఎన్‌బీసీకి అధికారం  ఇచ్చారన్నారు. భూములన్నా.. డబ్బులన్నా ఈ సీఎంకు పిచ్చి..రాష్ట్ట్రంలో ఆస్తులను అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోందనీ, ఏ, బీ, సీ, డీ పాలసీతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘సొంత చెల్లెల్ని రోడ్డున పడేసినవ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంత విశాఖకు ఏ-2 శని పట్టింది. నెల్లూరులో ఉండాల్సిన ఈ వ్యక్తికి విశాఖలో ఏం పని? ఇక్కడ అరాచకాలకు, భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.  జగన్‌ ఒక స్టిక్కర్‌, ఫేక్‌ సీఎం అని చంద్రబాబు దుయ్యబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులు పేరిట గుద్దులే.. గుద్దులే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

రాసలీల సీడీ.. 5 కోట్ల ఒప్పందం! కర్ణాటకలో మరో రచ్చ 

కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల  ఎపిసోడ్ లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. బీజేపీ మంత్రి  అడ్డంగా ఇరుక్కోవడంతో .. విపక్షాలు ఇదే అస్త్రంగా విమర్శల దాడి పెంచాయి. రాసలీలల సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మైసూరులో తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌ కనిపిస్తోందన్నారు.  ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్‌మెయుల్‌ చేశారని చెప్పారు. దీని వెనుక బడా నేతల హస్తముందని మరో బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. 

అంబాని కేసులో సంచలనం! బాంబులున్న కారు యజమాని మృతి!  

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పార్కు చేసిన కారులో పేలుడు పదార్థాలు లభించడం ముంబైతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈఘటనపై విచారణ జరుగుతుండగానే.. మరో  కలకలం రేగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం  యజమాని మాన్‌సుఖ్ హిరేన్ నేడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నౌపడా పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిరేన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. థానేలోని ముంబై క్రీక్ పైనుంచి దూకడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  మాన్‌సుఖ్ హిరేన్ మృతదేహాన్ని ముంబై క్రీక్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.  హిరేన్‌ మృతిపై ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, జాయింట్ కమిషనర్ మిలింద్ భరంబేలు స్పందించేందుకు నిరాకరించగా, ఉన్నతాధికారులు మాత్రం హిరేన్‌ది ఆత్మహత్యేనని ధ్రువీకరించారు. అయితే హిరేన్ కుటుంబ సభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదని చెబుతున్నారు. గురువారం రాత్రి అతడు ముంబై శివారులోని విరార్‌లోనే ఉన్నాడని పేర్కొన్నారు. హిరేన్ తన భవనంలో చిన్నారులకు ఈతలో శిక్షణ ఇస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.  గత నెల 25న ముకేశ్ అంబానీ నివాసమైన అంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం నుంచి క్వారీలలో పేలుడు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే  అంబానీ కుటుంబాన్ని హెచ్చరిస్తూ ఉన్న లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ స్కార్పియో వాహనం మాన్‌సుఖ్ హిరేన్‌దని తేలింది. ఏడాదికిపైగా తన కారు ఉపయోగంలో లేదని, దానిని విక్రయించే ఉద్దేశంతో ఇటీవలే దానిని బయటకు తీసినట్టు విచారణలో హిరేన్ వెల్లడించాడు. ఫిబ్రవరి 16న తన కారును ములుంద్-ఎయిరోలి లింక్ రోడ్డులో పార్క్ చేశానని, ఆ తర్వాతి రోజు వచ్చి చూస్తే అది కనిపించలేదని పోలీసులకు తెలిపాడు. తన కారు దొంగతనానికి గురైందంటూ విక్రోలి పోలీసులకు హిరేన్ ఫిర్యాదు కూడా చేశాడు. కేసు దర్యాప్తులో ఉండగానే హిరేన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది.  

చంద్రబాబు ప్రచారంలో పవర్ కట్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విశాఖపట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పెందుర్తి నుంచి ర్యాలీ ప్రారంభించిన చంద్రబాబు.. చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ మీదుగా ముందుకు వెళ్లారు. అయితే చంద్రబాబు పర్యటించనున్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో  వీధి దీపాలు వెలగలేదు. లైట్ల వెలుగకపోవడంతో రోడ్లు చీకటిమయమయ్యాయి. వైసీపీ నేతల ఆదేశాలతోనే విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  విశాఖలో రెండ్రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. 

'టైమ్స్’ కవర్ పై ఢిల్లీ ఆందోళన  

గత నాలుగు నెలలకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పటికే అంతర్జాతీయ సమాజం దృష్టిని,అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.  సోషల్ మీడియాలో సపోర్ట్ సంపాదించింది. అదొక వివాదంగా కూడా మారింది. కోర్టులు,కేసులు, అరెస్టులు విచారణలు సాగుతున్నాయి. ఇప్పుడు మహిళా రైతుల ఆందోళన ఏకంగా ‘టైమ్స్ మ్యాగజిన్’  కవర్ పేజీ ముఖ చిత్రంగా వచ్చింది.   అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టైమ్స్ మ్యాగజైన్’  ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఆ ప్రత్యేక సంచిక ముఖ చిత్రంగా ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫోటోను,  “నన్ను బెదిరించ లేరు ... నన్ను కొనలేరు” అనే మకుటంతో ముఖ్య చిత్ర కథనాన్ని ప్రచురించింది. ఆందోళనలో పాల్గొన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మహిళా రైతుల అనుభవాలు, అనుభూతులతో పాటుగా, రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన విశేషాలను ఫోటోలో ప్రతిబించేలా ఉంది.  మన దేశంలో మహిళలు లింగ వివక్ష, లైంగిక హింస,  అత్యాచారాలు,పితృస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాల గురించి కూడా  పత్రిక ప్రస్తావించిందిట. అయితే  పత్రిక ప్రచురించిన కథనంలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయో పూర్తిగా తెలియదు, పత్రిక   కవర్ పేజీని మాత్రమే ట్వీట్ చేసింది. పత్రిక మార్కెట్ లోకి వస్తేనే కానీ  ‘టైమ్స్ మ్యాగజైన్’  ఏ ఉద్దేశంతో ఈ కథనం ప్రచురించిందో తెలియదు.  అయితే మెల్లి మెల్లిగా చల్లారుతున్న రైతు ఉద్యమాన్ని మళ్ళీ రగిల్చేందుకు, జరుగతున్న ప్రయత్నాలలో ఇది కూడా భాగం కావచ్చన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, ‘కిసాన్ మహిళా దివస్’ గా నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించారు. ఈ  నేపధ్యంలో  ‘టైమ్స్ మ్యాగజిన్’ కథనం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వప్న సుందరి గోల్డ్ ట్విస్ట్.. సీఎం విజయన్ టార్గెట్!

కేరళ సీఎం పినరయ్ విజయన్. స్వప్న సురేశ్. కొంతకాలం క్రితం మారుమోగిన పేర్లు. 15 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారం స్మగ్లింగ్ లో స్వప్న సురేశ్ నిందితురాలు. గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కూ సంబంధం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యమంత్రితో పాటు మరో ముగ్గురు మంత్రులకూ బంగారం స్మగ్లింగ్ లో లింకుందని అంటున్నారు.  మరో నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు. ఎల్డీఎఫ్ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పినరయ్ విజయన్ టార్గెట్ గా కేసు ఉచ్చు బిగుస్తోంది. సరిగ్గా కేరళ ఎన్నికల ముందు బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని తెలిపారు స్వప్న సురేశ్. సీఎం పినరయ్‌తో పాటు స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు వెల్లడించారు.  ‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  గతంలో తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఆమె సీఎం విజయన్, స్పీకర్, మరో ముగ్గురు మంత్రుల పేర్లు చెప్పడం ఎన్నికల వేళ కేరళలో సంచలనంగా మారింది. బంగారం స్మగ్లింగ్ కేసు కేరళ ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అనే ఆసక్తి పెరిగింది.