ఎమ్మెల్సీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థుల లీడ్
posted on Mar 18, 2021 8:03AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది.
నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో కలిపి లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31987 , తీన్మార్ మల్లన్నకు 24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి.
తొలి రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 16 130, తీన్మార్ మల్లన్నకు 12046, కోదండరామ్ కు 9080, బీజేపీకి 6615, కాంగ్రెస్ కు 4354 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో పల్లాకు తీన్మార్ మల్లన్న కంటే 4084 ఓట్లు ఎక్కువ వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లాకు 15857, తీన్మార్ కు 12070, కోదండరామ్ కు 9448, బీజేపీకి 6669, కాంగ్రెస్ కు 3244 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 3 వేల 780 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఇక హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీ స్వల్ప ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కించగా.. 3 వేల ఓట్లు చెల్లించకుండా పోయాయి. మిగిలిన 53 వేల ఓట్లలో సురభి వాణిదేవీకి 17 429, బీజేపీ అభ్యర్థి రాంచంద్రరాావుకు 16 385, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగేశ్వర్ కు 8357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డితి 5501 ఓట్లు వచ్చాయి, తొలి రౌండ్ లో వాణిేదేవీకి 1044 ఓట్ల ఆధిక్యం వచ్చింది.