పిల్లకాయలకు ఇస్కూళ్ళు బంద్... మళ్ళీ ఆన్ లైన్ క్లాసులే ..!
posted on Mar 18, 2021 @ 10:19AM
లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి దాదాపు 10 నెలల పాటు తెలంగాణలో బడులు మూసి ఉన్న సంగతి తెల్సిందే. మరోపక్క కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గడచిన నెల ఫిబ్రవరి 1 వ తేదీ నుండి 9, 10 తరగతి విద్యార్థులకు ఆఫ్ లైన్ లోనే (తరగతి గదిలో) క్లాసులు జరపాలని నిర్ణయించింది. దీంతో అప్పటి నుండి 9 వ తరగతి పైబడిన విద్యార్థులందరూ స్కూళ్లకు వెళుతున్నారు. తరివాత అదే నెల 24వ తేదీ నుండి 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా ఆఫ్ లైన్ క్లాసులకు సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే అయితే ప్రాథమిక తరగతుల విద్యార్థుల క్లాసులకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో స్కూళ్లు, గురుకులాలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా బడి బాట పట్టారు.
అయితే కొద్దిరోజులుగా పలు విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడంతో.. . ఈ ప్రత్యక్ష తరగతులను నిలిపేయాలని తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడింది. మరీ ముఖ్యంగా బడులలో కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల్లో పలు విద్యాసంస్థల్లో 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోపక్క పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కూడా దీనిపై హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రాలు పూర్తీ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ బుధవారం జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలను కోరారు. దీంతో 6 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలను మూసివేసి మళ్ళీ ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్లు గా సమాచారం.
దీంతో కేవలం 9 , 10వ తరగతి విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి అనుమతివ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని కోవిడ్ జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది