ఒకడేవొక్కడు మొనగాడు.. తాడిపత్రి మెచ్చిన తోపు..
posted on Mar 18, 2021 @ 12:35PM
12 కార్పొరేషన్లు. 75 మున్సిపాలిటీలు. అన్నిచోట్లా వైసీపీ స్వీప్. ఆ ఒక్కటి మినహా. అదే తాడిపత్రి. తామే తాడిపత్రి తోపులమంటూ.. తమనెవరూ టచ్ చేయలేరంటూ.. జేసీ బ్రదర్స్ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. అనుకున్నట్టే అధికారపార్టీకి ఎదురొడ్డి మరీ తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేశారు. ఏపీ అంతటా ఒక లెక్క.. తాడిపత్రిలో మరోలెక్క అంటూ.. మీసం మెలేశారు జేసీ బ్రదర్స్.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఫలితాల తర్వాత తీవ్ర ఉత్కంఠను రేపిన తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తాడిపత్రిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదు. టీడీపీ అభ్యర్థులకు గాలం వేయడం, వారిని బెదిరింపులకు గురి చేయడం లాంటి కుతంత్రాలు జేసీ రాజకీయ చాణక్యం ముందు పని చేయలేదు. తాడిపత్రిలో టీడీపీ తరఫున 18మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఒక సీపీఐ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆ ఇద్దరూ టీడీపీనే మద్దతు ప్రకటించారు. మొత్తం 20మంది కౌన్సిలర్లతో టీడీపీ రహస్య శిబిరం కొనసాగించింది. వైసీపీ సైతం పోటీ శిబిరం ఏర్పాటు చేసి నువ్వా నేనా అంటూ రాజకీయం నెరిపారు.
మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి ఎక్స్‌అఫీషియో ఓటింగ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడం.. వైసీపీకి రెండు ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో ఉత్కంఠ పెరిగింది. టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ ఎంతగా ఒత్తిడి తెచ్చినా.. వారెవరూ జేసీని వీడలేదు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా సొంతం చేసుకొని సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. వరుస కేసులతో తనను వేధిస్తున్న అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని పంతం పట్టారు. అందుకే, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఈసారి కౌన్సిలర్‌గా బరిలో దిగారు. తనతో పాటు తన వారినీ గెలిపించుకొని.. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓడిన చోటే మళ్లీ అందలం ఎక్కి.. తాడిపత్రిలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు జేసీ బ్రదర్స్. జేసీనా మజాకా...