నిమ్మగడ్డ, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
posted on Mar 17, 2021 @ 9:12PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్, హైకోర్టుకు నివేదించాలి. ఇవి ఏపీ సీఎం జగన్‌రెడ్డి స్టేట్‌మెంట్స్. ఒక్క నెలలో ఎంత తేడా? ఎంత మార్పు?. మొన్నటి దాకా ఎన్నికలకు ససేమిరా అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపేదే లేదంటూ భీస్మించుకు కూర్చున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అన్నిచోట్లా చేతులు కాల్చుకున్నాక.. ఎన్నికలు జరిపారు. విజయఢంకా మోగడంతో మొనగాడిలా.. మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలంటూ పట్టుబడుతున్నారు సీఎం జగన్.
ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్ అయ్యేలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి సైతం నిమ్మగడ్డపై తమకు ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి, చీఫ్ విప్.. ఇలా నేతల వరుస ప్రకటనలు చూస్తుంటే.. నిమ్మగడ్డతో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.
కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా రెండున్నర ఏళ్ల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందని అంటారు. పాలనలో మొదటి సగ భాగం అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వంపై అసలైన అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటి రెండేళ్లు సంక్షేమ పథకాలతో జనాలను మభ్యపెడుతున్న జగన్ సర్కారుపై ఎలాగూ సదభిప్రాయమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ధి, పరిశ్రమలు, ఆదాయంలాంటి అసలైన అంశాలు చర్చకు వస్తాయి. ఏపీలో ఇప్పుడు అలాంటి అభివృద్ధి ఛాయలేవీ లేవనే నిజాన్ని ప్రజలు కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. ఆ సమయంలో కనుక ఎన్నికలు జరిగితే.. ప్రజా వ్యతిరేకత బయటపడేది. హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం అధికార పార్టీకి అనుకూలంగా మారింది.
వైసీపీకి, ఎస్ఈసీ లోపాయికార ఒప్పందం జరిగిందని.. బయటకు మాత్రం నిమ్మగడ్డ చంద్రబాబు మనిషంటూ ప్రచారం చేశారని.. ఇదంతా అధికార పార్టీ మైండ్ గేమ్‌లో భాగమని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే ఆ విషయం వాస్తవమే అనిపిస్తోంది. ఏడాదిగా కరోనా కారణంతో ప్రతిపక్షం పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేకపోయింది. అధికార పార్టీ దూకుడుగా ఉండి.. విపక్షం ఉదాసీనంగా ఉన్న సమయంలో.. ప్రభుత్వానికి హానీమూన్ పిరియడ్ నడుస్తున్న టైమ్‌లో కావాలనే హడావుడిగా స్థానిక ఎన్నికలు జరిపారని కొందరు అంటున్నారు. ఇదంతా.. సర్కారు, ఎస్ఈసీ కలిసి చేసిన కుట్ర అంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు.. నిమ్మగడ్డ, చంద్రబాబును ఒకే కులం గాటున కట్టేసి.. ఆయన ఆయన మనిషేనంటూ ముద్రేసి.. సర్కారు స్వకార్యం సైలెంట్‌గా పూర్తి చేసుకుందని అనుమానిస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలంటూ సీఎం జగన్ అభిప్రాయపడటం.. ఆ ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసి రిటైర్ కావాలంటూ మంత్రి పెద్దిరెడ్డి కోరడం.. నిమ్మగడ్డపై ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పడం.. ఇవన్నీ అంతా ఆ తాను ముక్కలే అనడానికి నిదర్శణమంటున్నాయి విపక్షాలు.