లీడ్ ఉన్నా టీఆర్ఎస్ గెలుపు కష్టమే!
posted on Mar 18, 2021 8:03AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది.నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల 871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కంటే వెయ్యి 44 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు లీడ్ వచ్చినా... వాళ్ల అభ్యర్థులు విజయం సాధించడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే గెలిచినట్లు. లేదంటే రెండో ప్రాధాన్యత.. అందులోనూ తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో వెనకబడిన అభ్యర్థులు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన సందర్భాలున్నాయి.
నల్గొండ స్థానంలో రెండు రౌండ్లలో కలిపి ఇప్పటివరకు లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31 987 , తీన్మార్ మల్లన్నకు 24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారనుంది.
ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో లీడ్ లో ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 31శాతమే. అంటే ఇప్పుడొస్తున్న ట్రెండ్స్ ప్రకారమే మిగితా రౌండ్లలో పల్లాకు లీడ్ వచ్చినా... రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు మరో 20 శాతం ఓట్లు రావాల్సి ఉంది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి 33 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమెకు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లలో భారీగా ఓట్లు రావాల్సి ఉంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ను కలవరపరుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. అందుకే తొలి ప్రాధాన్యత ఓట్లపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలోనూ టీఆర్ఎస్ నేతలు తొలి ప్రాధాన్యత గురించే ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో వాళ్లకు తొలి ప్రాధాన్యత ఓటు కేవలం 30 శాతంగానే ఉండటంతో... గెలుపుపై నమ్మకం కోల్పోతున్నారని తెలుస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 40 శాతం ఓట్లు సాధిస్తే తప్ప.. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు.