సీఐడీ నోటీసులపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
posted on Mar 18, 2021 @ 2:54PM
అమరావతి అసెంబ్లీ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులివ్వగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41A కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట, న్యాయ విరుద్ధమని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు. శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీలోని సెక్షన్ 41 (ఏ)(1) ప్రకారం నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్), (జీ), ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది సీఐడీ.
ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన తన దగ్గరున్న వివరాలు అందించారు.