నల్గొండలో పల్లా మెజార్టీ 49, 362
posted on Mar 21, 2021 @ 10:16AM
తెలంగాణలో రాజకీయ కాక రేపిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో.. నిభందనల ప్రకారం రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నను అధికారులు ఎలిమినెట్ చేశారు. మల్లన్నకు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. పల్లాకు 36,556 ఓట్లు పోలయ్యాయి. దీంతో 71వ రౌండ్‌లో గెలుపు కోటాను దాటారు.
ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేషన్‌తో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓట్లు 1,61,811కు చేరాయి. మల్లన్న ఎలిమినేషన్‌తో ఆ సంఖ్య 1,98,367కు చేరింది. దీంతో కోదండరామ్ ఎలిమినేషన్ అప్పుడు 12,806గా ఉన్న పల్లా మెజారిటీ 49,362కు పెరిగింది. మొత్తంగా పల్లాకు 1,10,840ల మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, 87,527 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. .
తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేస్తూ వారి బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తే వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 70 మంది ఎలిమినేట్ అయ్యారు. బరిలో నిలిచిన 62 మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మిగిలిన 9 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు 3,60,377 ఓట్లు వచ్చాయి.