నోముల భగత్ కే సాగర్ టీఆర్ఎస్ టికెట్!
posted on Mar 21, 2021 @ 10:16AM
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంతో త్వరలో జరగనున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సాగర్ ను సవాల్ గా తీసుకంటున్నారు టీఆర్ఎస్ అధినేత. వరుస విజయాలు, పార్టీలోకి జోరందుకున్న వలసలతో బీజేపీ దూకుడు మీదుంది. సాగర్ లోనూ జెండా పాతాలని ప్రణాళికలు రచిస్తోంది. తమకు గట్టి పట్టున్న నాగార్జున సాగర్ లో గెలిచి తిరిగి ఫాంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది సాగర్ ఉప ఎన్నిక.
తమకు సవాల్ గా మారిన సాగర్ ఉప ఎన్నిక కోసం గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక కోసం ఆయన చర్చలమీద చర్చలు జరిపారు. ఈ నెల 23న సాగర్ బైపోల్ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌ను అక్కడి నుంచి పోటీ చేయించాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయించిందని సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. భగత్‌కు టికెట్ ఇచ్చే విషయంపై ఇప్పటికే నల్గొండ జిల్లా లీడర్లకు టీఆర్ఎస్ పెద్దలు సమాచారం అందించారట.
నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక జరగనుంది. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావించింది. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు జరిపారు కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ తో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అభ్యర్థి ఎంపిక కోసం సాగర్ లో కేసీఆర్ అనేక సర్వేలు చేయించారని తెలుస్తోంది. పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వివరాలు తీసుకున్నారట. సాగర్‌లో పార్టీపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయని, అభ్యర్థి ఎవరైనా గెలిచే చాన్సుందని సర్వేల్లో తేలిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో భగత్‌ను బరిలోకి దింపితే సెంటిమెంట్ కలిసి వస్తుందని భావించిందని తెలుస్తోంది
నోముల భగత్ కు టికెట్ ఇచ్చే విషయంపైనా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారని చెబుతున్నారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి భార్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది. పార్టీ ఓటమికి అభ్యర్థే కారణమనే చర్చ జరిగింది. దీంతో సాగర్ లో ఎలా ఉంటుందన్న ఆందోళన పార్టీ పెద్దల్లో వచ్చిందని చెబుతున్నారు. అందుకే భగత్ తో పాటు యాదవ కులానికి చెందిన ఇతర నేతల పేర్లనూ పరిశీలించింది. నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే దుబ్బాకలో ఓ న్యాయం, సాగర్‌లో మరో న్యాయమా అన్న విమర్శలు వస్తాయన్న చర్చ జరిగింది.
దీంతో నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత.. సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థిని పోటీలో పెట్టే ఆలోచనలో కమలం నేతలు ఉన్నారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యాంగా రెండో స్థానంలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్న.. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే.. సాగర్ సమరం మరింత రంజుగా మారనుంది.