బడుల్లో కరోనా పంజా! ప్రభుత్వానిదే పాపమా?
posted on Mar 21, 2021 @ 10:16AM
తెలుగు రాష్ట్రాల్లో కరోాన మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వేగంగా విస్తరిస్తూ అలజడి రేపుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్స్, కాలేజీలు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారాయి. వందలాది కేసులు నమోదవుతున్నాయి. తిరుమల వేద పాఠశాలలో 63 మంది విద్యార్థులకు, నలుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 15 మంది విద్యార్థులు కరోనా సోకింది. కర్నూలు జిల్లా పత్తికొండ, మద్దికెర, మహానంది, ఆదోని మండలాల్లో 20 మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ అయింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ హైస్కూల్ టీచర్‌కు పాజిటివ్ వచ్చింది.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. నిరంతరంగా మాస్కులు ధరించలేక చిన్నపిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భౌతిక దూరమూ పాటించడం లేదు. తరగతి గదుల్లో ఒక్కో బెంచ్‌కి నలుగురైదుగురిని కూర్చోబెడుతున్నారు. శానిటైజేషన్ చేయడం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కువగా అపార్ట్‌మెంట్లలో నడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో ఒక్కో బెంచీపై ఎక్కువమంది విద్యార్థులను కూర్చోబెట్టడం వల్ల ఒకరి నుంచి మరొకరికి లక్షణాలు వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం.
శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచకపోవడం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచకపోవడం వల్ల విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. వందలాది మంది విద్యార్థులకు రెండు, మూడు మరగుదొడ్లు ఉండటం.. అవి కూడా అస్తవ్యస్థంగా ఉండటం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. చాలా స్కూళ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల చేతులు కడుక్కోవడం కష్టమవుతోంది. వందలాది విద్యాసంస్థల్లో విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం.
నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్లలో వందలాది కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని జగన్ సర్కార్ చెబుతున్నా.. ఎక్కడా అది కనిపించడం లేదు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గతంలో అప్రమత్తంగా ఉన్న విద్యాశాఖ .. ఇప్పుడు కొవిడ్ నిబంధనల అమలు తీరును పర్యవేక్షించటం లేదు. విద్యాసంస్థల్లో ఎక్కడా టెస్టులు నిర్వహించడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కడా శానిటైజేషన్ చేయడం లేదు. విద్యార్థులను గాలికి వదిలేశారు. దీంతో స్కూళ్లలో కరోనా పంజా విసురుతుందని చెబుతున్నారు.