కోదండ రాం..రాం..
posted on Mar 20, 2021 @ 5:12PM
ప్రొఫెసర్ కోదండరాం సార్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఫుల్ క్రేజ్. కేసీఆర్‌కు సమస్థాయి, సమఉజ్జీ. ఆ రోజుల్లో.. ఆయన జోరు అదో తీరు. ఉద్యమం ముగిసింది. కేసీఆర్‌తో చెడింది. ఇక అంతే. అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన ప్రొఫెసర్.. అప్పటి నుంచి ఆయన ప్రభ మసక బారిపోయింది. పాపం.. పెద్ద సారు. పెద్దల ఆటలో అరటిపండు అయ్యారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. ఖమ్మం- నల్లగొండ- వరంగల్ పట్టభద్రుల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రధాన పోటీ దారుగా భావించారు అంతా. కానీ, మల్లన్నను సైతం చేరుకోలేక మూడో స్థానినికి పడిపోయారు. అయితే, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను అధిగమించడం చిన్న విషయమేమీ కాదు.
ఎన్నికలు ఎదుర్కోవడం కోదండరాంకు కొత్తే. రాజకీయ ఎత్తులు, ప్రచార జిత్తులు, పోల్ మేనేజ్‌మెంట్‌లాంటి విషయాల్లో ఆయన పెద్దగా ఆరి తేరలేకపోయారు. కొంతకాలం క్రితం తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించినా ఆ పార్టీ ఇప్పటి వరకూ ఉనికే చాటుకోలేకపోయింది. 2018లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కూటమితో కలిసి పోటీ చేసినా.. ఏ ఒక్క చోటా బోణీ కొట్టలేదు. టీజేఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన కోదండరాంకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. పట్టాభద్రుల నియోజక వర్గం కావడం.. ఉన్నత విద్యావంతుల్లో ప్రొఫెసర్ కోదండరాంకు ఆదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం.. ఉద్యమ ఖిల్లాలైన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో పోటీ చేస్తుండటంతో.. కోదండరాంకు విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఓ మోస్తారు ఓట్లు సంపాదించి.. మూడో స్థానం దగ్గరే ఆగిపోయారు. మధ్యలో మల్లన్న కనుక లేకపోయి ఉంటే.. కోదండరాం సార్‌దే విజయం అంటున్నారు అంతా.
తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్‌తో నిత్యం ప్రభుత్వంపై పోరాడుతుండటం, కేసీఆర్‌ను ఎప్పటికప్పుడు నిప్పులతో కడిగేస్తుండటంతో జనాల్లో మల్లన్నకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కోదండరాం విషయంలో అలా జరగడం లేదు. మల్లన్న మాస్ లీడర్ అయితే.. కోదండరాం క్లాస్ పొలిటిషియన్. మల్లన్న మాటల్లో వాడీ వేడీ సూటి పోట్లు ఉంటే.. కోదండరాం స్పీచ్ మేథావి మాటల్లా.. నీట్‌గా క్లాస్‌గా ఉంటాయి. అంత మంచి, మర్యాదకరమైన విమర్శలు ఇప్పటి జనాలను అంత ఈజీగా ఆకట్టుకోవు. మరోవైపు, గతంలో కోదండరాం కాంగ్రెస్‌తో జతకట్టడం.. టీడీపీతో చేతులు కలపడం కూడా ప్రజలకు నచ్చలేదంటున్నారు. కోదండరాం సార్ అంటే తెలంగాణ ఉద్యమ సమయంలోని సంఘటనలే గుర్తుకొస్తుంటాయి కానీ.. తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్‌పై, ప్రజా సమస్యలపై ఆ స్థాయిలో పోరాడిన సందర్భాలు తక్కువనే అంటున్నారు. అందుకే, కోదండరాం రాజకీయం ఓటర్లను అంతలా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఆయన నిబద్దతను, చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ తప్పుబట్టక పోవచ్చు. సార్ అంటే ఇప్పటికీ చాలా మందికి గౌరవమే. అందుకే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకంటే కోదండరాంకే ఎక్కువ ఓట్లు వేసి మూడో స్థానంలో నిలబెట్టారు. మధ్యలో మల్లన్న లేకపోతే.. కోదండరామే ఎమ్మెల్సీ అయ్యే వారేమో...