కలకలం రేపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ ..
posted on Mar 20, 2021 @ 1:36PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నేతల దీక్షలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క ఈ నెల 25 నుండి సమ్మె చేయాలని కార్మికులు నిర్ణయించారు. యాజమన్యానికి నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న శ్రీనివాసరావు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఈ ప్రైవేటీకరణపై మనస్తాపం చెందుతూ రాసిన సూసైడ్ నోట్ తాజాగా సంచలనం రేపుతోంది.
అయన రాసిన లేఖలో.. "ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో దీనిని ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటానికి ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీనివాసరావు ఇవాళ ఉదయం నుండి అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.