90 గంటల రికార్డ్ కౌంటింగ్
posted on Mar 20, 2021 @ 9:20PM
తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా సాగింది. మారథాన్ లా నాలుగు రోజుల పాటు నానా స్టాప్ గా కౌంటింగ్ జరిగింది. రోజులు గడుస్తున్నా ఫలితం తేలకపోవడంతో.. ఫలితాల కోసం ఎదురుచూసిన జనాలు కూడా ఏం జరుగుంతుందోనని ఆందోళన పడాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడు లేనంతగా లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ.. శనివారం సాయంత్రం ముగిసింది. దాదాపు తొంభై గంటలపాటు నిర్విరామంగా సాగిన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఓ రికార్డుగా చెప్పవచ్చు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన ఓట్ల లెక్కింపు నల్గొండలో జరిగింది, ఇక్కడ హైదరాబాద్ కంటే ఐదారు గంటలు ఎక్కవే అయింది ప్రక్రియ ముగిసేందుకు. నల్గొండ ఫలితం శనివారం అర్ధరాత్రికి వచ్చింది.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారితో ప్రియాంకతో పాటు, 50 మంది సీనియర్ అధికారులు నిరంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం అబ్జర్వర్ హరి ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రోజు 3 షిఫ్టులుగా, ప్రతి షిఫ్ట్‌కు ఎనిమిది వందల మంది కౌoటింగ్ సిబ్బంది ఎనిమిది హాళ్ళలో రోజుకు 2400 మంది చొప్పున నాలుగు రోజులపాటు 9600 మంది నేరుగా పాల్గొన్నారు. వీరితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ, రెవిన్యూ, సీనియర్ అధికారులు నిర్విరామంగా తమ సేవలను అందించారు. నల్గొండకు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. నల్గొండలో కూడా మూడు షిప్టుల్లో సిబ్బంది పని చేశారు.
జంభో బ్యాలెట్ బాక్స్‌లను స్థాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హల్ కు తరలించడం, తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడంలో ఉద్యోగులు కష్టపడ్డారు.దాదాపు పదివేల మందికి కనీస సౌకర్యాలను, టీ, టిఫిన్, భోజనంతో పాటు లెక్కింపు కేంద్రం పరిశుభ్రంగా ఉంచడంలో లోకల్ మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలoదించారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, నల్గొండలో ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. మొత్తానికి సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏ విధమైన వివాదాలు లేకుండా ముగించిన సిబ్బందిని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు.