కరోనాకు కేసీఆర్ వాడిన మందులు ఇవే..
posted on Jun 21, 2021 @ 4:46PM
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ బీభత్సం స్పష్టించింది. కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలోనూ కొవిడ్ సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా విస్తరించింది. మొదటి వేవ్ తో పోలిస్తే రెండో దశలో కేసులు ఎక్కువగా రావడమే కాక మరణాలు భారీగా నమోదయ్యాయి. పేద, ధనిక , సామాన్య, వీఐపీ అన్న తేడా లేకుండా అందరిని కరోనా కబళించింది. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. కేసీఆర్ వయసు, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. కరోనాను ఎలా జయిస్తారో అన్న ఆందోళన వ్యక్తైమంది. టీఆర్ఎస్ నేతలైతే చాలా కంగారు పడ్డారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొందరు పూజలు కూడా చేశారు.
అయితే అందరి భయాలను అధిగమిస్తూ త్వరగానే కరోనా నుంచి కోలుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉండే మహమ్మారిని జయించారు. హాస్పిటల్ లో అడ్మిన్ కావాల్సిన పరిస్థితి కూడా రాలేదు. కేసీఆర్ త్వరగానే కరోనాను జయించడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. తాజాగా కరోనా సోకినప్పుడు తాను తీసుకున్న ట్రీట్ మెంట్ ఏంటో తెలిపారు కేసీఆర్. వరంగల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... తాను కరోనాను ఎలా జయించారో వివరించారు.
కరోనా మహమ్మారి విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. కానీ ఆందోళన కలిగించే అంశాలు ప్రసారం చేసి ప్రజల బతుకులతో ఆటలాడుకోవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకున్నాననని చెప్పారు. పారాసిటమాల్‌తో పాటు ఒక యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా.. డీ విటమిన్ వేసుకోమని చెప్పారు.. కానీ అది తాను వేసుకోలేదని కేసీఆర్ తెలిపారు. అంతలోనే కరోనా తగ్గిపోయిందన్నారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రించ వచ్చన్నారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి, అనవసరంగా లేని ఉత్పాతాన్ని సృష్టించవద్దు అని సీఎం కేసీఆర్ సూచించారు.
థర్డ్ వేవ్ వస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి. వీనికి ఫోన్ చేసి చెప్పిందా. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే... ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం. దండం పెట్టి చెబుతున్నా... పుకార్లు మానండి. మాస్కు పెట్టుకోమని చెప్పండి. అంతేకాని భయపెట్టకండి. దీనికి ఇన్ని కథలా... ఇన్ని ప్రచారాలా.. ఇన్ని భయోత్పాతాలా... దయచేసి మీడియా వాళ్లు ఇది గుర్తించాలి. ప్రజల బతుకులతో ఆడుకోవడం సరికాదు’’ అని వరంగల్ సభలో కేసీఆర్ అన్నారు.