తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ నిజాలు! ఇద్దరు నిందితుల గుర్తింపు?
posted on Jun 22, 2021 @ 11:31AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోనే అత్యాచార ఘటన జరిగితే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మహిళకు రక్షణే లేకుండా పోయింది, జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న దిశ చట్టం ఎటు పోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసుల నిఘా, పని తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేసింది. దీంతో నిందుతులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. తాడేపల్లి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారని తెలుస్తోంది. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులు సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్ గా పోలీసులు భావిస్తున్నారు.
నిందితులిద్దరు కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిపై దాడులు చేసి సొమ్ములు దోచుకోవడం, ఆ సొమ్ముతో గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న ఫోన్లను దాస్ అనే వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన జరిగిన తర్వాత నిందితులు విజయవాడ వైపు పారిపోయినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో గాలించడంతో పాటు సీతానరగంలో అనుమానితులను విచారించడంతో నిందితుల వివరాలు తెలిశాయని చెబుతున్నారు. వీళ్లిద్దరూ నాలుగు రోజుల నిందితుల్లో ఒకరికి హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడకు చెందిన బాధిత యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి విధులు ముగించుకొని అతడితో కలిసి సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు... వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితులు స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.