యడ్డీ ఆయన లెక్కే వేరప్పా
posted on Jun 21, 2021 @ 3:42PM
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, నక్కను తొక్కిన నాయకుడు. ఆయన కుర్చికి ముప్పు ఎప్పుడూ పోంచే ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో అసమ్మతి రాజుకుంటుంది. ఆయన పాలనలో ప్రతిపక్షాల కంటే ముందు నుంచే సొంత పార్టీ నేతలకు లోపాలు కనిపిస్తాయి. అవినీతి దర్శనమిస్తుంది. ఆయన రాజీనామాకు డిమాండ్ కూడా ముందు సొంత పార్టీ అసమ్మతి నేతల నుంచే ఇనిపిస్తుంది.
సుమారు రెండు మూడు నెలలుగా బీజేపీ అసమ్మతి నాయకులు ఆయనను గద్దేదింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక దశలో అయిపొయింది, యడ్డీ ఇక ఇంటికే, అనే వరకు ఊహాగానాలు పరుగులు తీశాయి. యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ ఢిల్లీ చేరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు, సంజాయిషీలు సమర్పించుకున్నాయి. రాష్ట్రంలో అయితే, ముఖ్యమంత్రి మార్పు తధ్యమన్న సీన్ క్రియేట్ అయింది. అసమ్మతి రాగానికి విపక్షాలు స్వరం కలిపాయి. మీడియా అయితే యడ్డీ ఉద్వాసనకు ముహూర్తాలు కూడా నిర్ణయించింది.
అయితే, చివరాఖరుకు, “గజం మిథ్య, పలాయనం మిథ్య" అన్నట్లుగా అంతా తేలిపోయింది. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు అధిష్టానం దూతగా బెంగుళూరు చేరుకున్న, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహరాల ఇంచార్జి అరుణ్ సింగ్, మూడు రోజుల పాటు పరిస్థితిని మదింపు వేసి, ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ యడ్డీకి జై కొట్టారని తేల్చారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్, హుబ్బాలి- ధార్వాడ్ పశ్చిన ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్,ఎమ్మెల్సీ విశ్వనాథన్ మినహా మిగిలిమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ ముఖ్యమంత్రిని మార్చాలని కోరడం లేదని ఆయన నివేదికలో స్పష్టం చేశారు. అయితే అదే సముంలో ఆయన వివిధ విషయాలకు సంబంధించి బహిరంగంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం వలన అనవసర ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, కాబట్టి అలాంటి నాయకులపై క్రమశిక్షణ చర్యలు తెసుకోవడం తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
అరుణ సింగ్ ఇచ్చిన నివేదికతో, యడ్డీ ఉద్వాసన వట్టిదే అని తేలిపోయింది. అయితే, యడియూరప్ప ఇలా సేవ్’ అయిపోవడం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడమే పార్టీ పెద్దలు ఇద్దరికీ ఇష్టం లేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే, గతంలో, ఆయనపై తీవ్ర అవినీతి, భూ కుంభకోణం ఆరోపణలు వచ్చి, లోకా యుక్త విచారణలో ఆయన దోషిగా తేలడంతో, అధిష్టానం ఆయన్ని తప్పించింది. ఆ నేపధ్యంలో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. సొంత పార్టీ పెట్టి బీజేపీ ఓటమికి కారణమయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయన మళ్ళీ పార్టీలో చేరడంతో మళ్ళీ పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగలు కూడా అయన చేతికే వచ్చాయి. ఈ నేపధ్యంలో పార్టీ అధినాయకత్వం ఇష్టం ఉన్న లేకున్నా యడ్డీకి తలోగ్గుతోంది. ఇప్పుడ మళ్ళీ ఆ మంత్రమే పనిచేసిందని, మరో సంవత్సరంన్నరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన్నే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే, విశ్లేషకులు యడ్డీ లెక్కే వేరప్పా .. అంటున్నారు.