కేబినెట్ లోకి కడియం! ఆ మంత్రికి చెక్ పడినట్టేనా?
posted on Jun 22, 2021 @ 12:42PM
రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను దిట్ట అంటారు. ఆయన ఎప్పుడో ఏం చేస్తారో , ఎవరిని దూరం పెడతారో, ఎవరిని దగ్గరికి తీస్తారో ఎవరూ ఊహించలేరని చెబుతారు. అయితే గులాబీ బాస్ ఏం చేసినా దానికో లెక్క , పొలిటికల్ లింకు ఉంటుందన్నది రాజకీయ నిపుణుల మాట. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన సమయంలోనూ కేసీఆర్ తనదైన వ్యూహాలతో గట్టెక్కారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని కూడా ఉన్నఫళంగా పక్కన పెట్టేస్తారు కేసీఆర్. ఇందుకు ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందరే ఉదాహరణ. తనకు అవసరం లేదనుకున్న వారిని దూరం పెడుతూ.. సడెన్ గా మళ్లీ అక్కున చేర్చుకుంటారు. ఇలాంటి ఘటనలు టీఆర్ఎస్ లో ఎన్నో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా కేసీఆర్ వరంగల్ పర్యటనలు పలు ఈక్వేషన్స్ ను తెరపైకి తెచ్చింది. ఈటల రాజీనామాతో మంత్రివర్గంలో ఒక ఖాళీ అయింది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలగిస్తారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే తాజాగా కొత్త సమీకరణలు బయటికి వచ్చాయి. కేబినెట్ లో మార్పులు చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్.. ఎవరిని తొలగించాలి, ఎవరిని తీసుకోవాలన్న దానిపై క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ఆ దిశగా తొలగించబోయే మంత్రులకు, కొత్తగా ప్రమోషన్ ఇవ్వబోయే నేతలకు గులాబీ బాస్ సిగ్నల్స్ ఇచ్చారని చెబుతున్నారు. జిల్లాల పర్యటనలోనూ తమ మనోగతాన్ని ఆయన చెప్పకనే చెబుతున్నారని సమాచారం.
సోమవారం వరంగల్ లో పర్యటించిన కేసీఆర్... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో లంచ్ చేయడం ఆసక్తిగా మారింది. గతంలో వరంగల్ ఎప్పుడు వచ్చినా రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు ఇంట్లో లంచ్ చేసేవారు. విడిది కూడా అక్కడే చేసేవారు. కాని ఈసారి మాత్రం కడియం ఇంటికి వెళ్లారు కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర వ్యవస్థికరణలో కడియంకు చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడియం అంతా యాక్టివ్ గా ఉండటం లేదు. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని రోజులుగా మాత్రం కడియం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగానే స్పందించారు కడియం శ్రీహరి.
కొన్ని రోజులగా కడియంలో వచ్చిన మార్పులు, కేసీఆర్ అతని ఇంట్లో లంచ్ చేయడంతో... ఆయనకు కేబినెట్ లో చోటు ఖాయమనే ప్రచారం వరంగల్ లో జోరుగా సాగుతోంది. దీనిపై కడియంకు కూడా ఇప్పటికే సంకేతాలు వచ్చాయంటున్నారు. టీఆర్‌ఎస్ తొలి పాలనలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవితో ఓ వెలుగు వెలిగారు. అవినీతి, అక్రమాలు లేని నేతగా కేసీఆర్ వద్ద కడియంకు మంచిపేరు ఉంది. అప్పగించిన శాఖను సమర్థవంతంగా నిర్వహించగల సమర్థుడని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారంట. కడియం లాంటి సీనియర్ నేత సేవలను వినియోగించుకుంటే పార్టీకి మరింత బలం వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇందుకోసం ఆయన ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేయడంతో పాటు మంత్రి వర్గంలోకి తీసుకుని ఓ కీలక శాఖను అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలంగాణ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే కడియంను తీసుకుంటే ఎవరికి చెక్ పెడతారనే చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా ఉన్నారు. వీళ్లలో ఒకరిని తప్పించి.. కడియంను తీసుకుంటారా లేక ఈటల స్థానాన్ని ఆయనతో భర్తీ చేస్తారా అన్నది చర్చగా మారింది. ఈటల స్థానాన్ని మరో బీసీ నేతతోనే భర్తీ చేస్తారని, కడియంను తీసుకుంటే జిల్లాకు చెందిన ఒకరిపై వేటు పడుతుందనే వాదన వస్తోంది. అదే జరిగితే ఎర్రబెల్లికి చెక్ పడవచ్చని చెబుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేలుమంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి వ్యవహారశైలితో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని, అధిష్ఠానం వద్ద ఒకటి చెబుతూ.. వాస్తవంలో మాత్రం ఆయన అనుచరులకు, రాజకీయ లబ్ధికి పావులు కదుపుతున్నారంటూ ఫిర్యాదు చేశారట. ఇదే విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో కడియంతో ఎర్రబెల్లికి చెక్ పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ గీసేసి ఉంటారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు మంత్రి ఎర్రబెల్లికి జిల్లాలోని సహచర ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నా.. ఆయన పనితీరు మాత్రం బాగా ఉందనే టాక్ వస్తోంది. దీంతో ఎర్రబెల్లిని కొనసాగిస్తూనే.. కడియంను కేబినెట్ లోకి తీసుకుని ఆయన దూకుడుకు కొంత చెక్ పెట్టవచ్చనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన సత్యవతి రాథోడ్ ను తొలగించి.. ఆమె స్థానంలో కడియంకు చోటు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. సత్యవతి రాథోడ్ ప్లేస్ లో మరో గిరిజన ఎమ్మెల్యేను కేబినెట్ లోకి తీసుకోనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. మొత్తానికి కడియం శ్రీహరికి మాత్రం ప్రమోషన్ దక్కడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.