జస్టిస్ కనగరాజ్.. మళ్లీ మూన్నాళ్ల ముచ్చటేనా?
posted on Jun 21, 2021 @ 3:52PM
జస్టిస్ కనగరాజ్. జస్టిస్ చౌదరి రేంజ్‌లో నిరుడు ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. నిమ్మగడ్డ ప్లేస్‌లో ఎస్ఈసీ సీట్లో కూర్చొన్నారు. రాజకీయంగా ఆటలో అరటిపండు అయ్యారు. చెన్నై నుంచి రాత్రికిరాత్రి ఎలాగైతే డౌన్‌లోడ్ అయ్యారో.. అలానే మళ్లీ పెట్టాబేడా సర్దేసుకొని చెన్నై తిరుగెళ్లిపోయారు. కట్‌చేస్తే.. లేటెస్ట్‌గా మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు జస్టిస్ కనగరాజ్. ఈసారి మరో పదవి.. మరో కాంట్రవర్సీ.. మళ్లీ నిబంధనలు తుంగలో తొక్కి..
ఏపీ పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారనేది విపక్షాల విమర్శ. పోలీస్ పెద్దల నుంచి కానిస్టేబుల్ వరకూ.. అనేక మందిపై ఏదో ఒక సందర్భంలో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు ఖాకీలు చేస్తున్న ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. ఇటీవల జరిగిన రఘురామ ఎపిసోడ్‌లోనైతే సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, అచ్చెంనాయుడు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర వరకూ టీడీపీ బడా నాయకులపై పోలీస్ కేసులు నమోదవడంతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వారినీ కేసులతో వేధిస్తున్నారని.. గ్రామాల్లో ఒక వర్గానికి ఖాకీలు సహకరిస్తున్నారని.. ఒక వర్గం వారిపైనే కేసులు బనాయిస్తున్నారని.. ఇలా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల పని తీరుపై ప్రజల ఉంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, రాష్ట్ర పోలీసు కంప్లయింట్ అథారిటీ (పీసీఏ) అధిపతిగా తమ వారు ఉంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని భావించినట్టుంది జగన్‌రెడ్డి సర్కారు. అందుకే కాబోలు.. గతంలో ఓసారి తమకు సహకరించి అబాసు పాలైన జస్టిస్ కనగరాజ్‌కు కృతజ్ఞతగా పీసీఏ ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
అయితే, గతంలో ఎస్ఈసీ ఎపిసోడ్ మాదిరే ఈ సారి కూడా నిబంధనలకు విరుద్ధంగా పీసీఏ ఛైర్మన్ ఎంపిక జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసు కంప్లయింట్ అథారిటీ రూల్స్- 2020లోని సెక్షన్ 4(ఏ) ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జిని చైర్మన్‌గా నియమించాలి. అయితే, ఆయన 65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. 65 ఏళ్లు దాటిన వారు ఈ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. కనగరాజ్ వయస్సు దాదాపు 75 ఏళ్లు. రూల్స్ ప్రకారం ఆయన ఆ పోస్టుకు అనర్హులు అవుతారని చెబుతున్నారు. ఎవరైనా హైకోర్టులో కేసు వేస్తే.. మళ్లీ ఈయన పోస్ట్ ఊస్ట్ అవడం గ్యారంటీ అంటున్నారు.
తమకు ఇబ్బందిగా మారిన, మారుతాయని అనుకున్న పోస్టుల్లో ప్రతీసారి కనగరాజ్‌తోనే తొండాట అడుతుండటం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. గతంలో మాదిరే ఈసారీ ఆయన మళ్లీ ఆటలో అరటిపండు అవక తప్పదంటున్నారు. మరి, ఇలాంటి వివాదాస్పద విషయాలకు సీఎం జగన్‌రెడ్డి ఎందుకు పదే పదే కనగరాజ్‌నే ఎంచుకుంటున్నారో.. కనగరాజ్ సైతం సీఎం జగన్‌రెడ్డికి ఎందుకు పదే పదే సహకరిస్తున్నారో తెలీని పరిస్థితి.