లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్‌లో రష్యాకు బాలినేని.. జల్సాలపై మండిపడుతున్న జనాలు?
posted on Sep 7, 2021 @ 10:02AM
వృత్తి రాజకీయం. ప్రవృత్తి వ్యవసాయం. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే. ఏపీకి మంత్రి. సీఎం జగన్‌రెడ్డికి దగ్గరి బంధువు. పాలించే వాడే తమ బంధువైతే.. ఇక బలాదూర్లకు కొదవేముంటుంది? అందుకే కాబోలు.. రాష్ట్రం ఆగమాగం అవుతున్నా.. కరోనాతో కల్లోలం చెలరేగుతున్నా.. ఖజానా ఖాళీ అయి ఉద్యోగులకు సమయానికి జీతం రాకున్నా.. ఉపాధి లేక, పెట్టుబడులు లేక, ఉద్యోగాలు లేక.. ప్రజలు పస్తులుంటున్నా.. ఇవేమీ తనకు పట్టవన్నట్టు.. ఎంచక్కా చార్టెడ్ ఫ్లైట్ ఎక్కి.. విలాసాల్లో మునిగి తేలుతున్నారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్ ఫ్లైట్‌లో వైసీపీ నేత రాజభోగాలు అనుభవిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయమాల్యాలా ఫోజులు కొడుతూ చార్టెడ్ ఫ్లైట్‌లో విదేశీ యాత్రలకు వెళ్లే ఇమేజ్ చూసి మండిపడుతున్నారు. ఎవడి సొమ్ము ఎవడు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి బాలినేని ఫోటో చూస్తే ఎవరికైనా ఒళ్లు మండాల్సిందే. ఓ రేంజ్‌లో ఉంది యవ్వారం. చాలా ఖరీదైన చార్టెడ్ ఫ్లైట్ అని చూడగానే తెలిసిపోతోంది. అలాంటి రిచ్ ఫ్లైట్‌లో ఇండియా నుంచి రష్యాకు వెళ్లడమంటే మాటలా? ఎంత లేదన్నా.. అలాంటి ట్రిప్‌కు 55వేల డాలర్ల నుంచి 85 వేల డాలర్ల వరకు చార్జ్ చేస్తారు. అంటే, ఇండియన్ కరెన్సీలో 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ లెక్కన.. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్‌లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యాకు వెళ్లడానికి అయిన ఖర్చు.. దాదాపు సగం కోటి. ఒక వైపు జర్నీకే సుమారు 50 లక్షలు ఖర్చు చేస్తే.. ఇక మంత్రి గారి రష్యా ట్రిప్ మొత్తం లెక్కేస్తే.. ఏ 5 కోట్లో.. 10 కోట్లో అవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.
ఇక ఈ ఫోటో మంత్రి బాలినేని సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ అయింది. ఫుల్ పోష్‌గా ఉందా విమానం. సోఫాల్లాంటి ఛైర్‌లో మంత్రి గారొక్కరే కూర్చొని ఉన్నారు. సీటు ముందు టేబుల్‌పై.. తినడానికి ఏదో వెరైటీ స్నాక్స్ రెడీగా ఉన్నాయి. ఫోటోకు ఓ క్యాప్సన్ కూడా ఇచ్చారు. లివ్ లైఫ్ విత్ నో ఎక్స్యూజెస్.. ట్రావెల్ విత్ నో రిగ్రెట్. ఇదీ ట్యాగ్ లైన్. అవును మరి, ప్రజల సొమ్ముతో జల్సా చేస్తే రిగ్రెట్ ఎందుకు ఉంటది? అంటూ ఆ ట్యాగ్ లైన్‌కు ఖతర్నాక్ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.
మరి, అంత ఖరీదైన విమానంలో.. అంత ఖర్చుతో బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యాకు ఎందుకు వెళ్లినట్టు? అక్కడ ఆయనకు అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమున్నట్టు? జస్ట్.. జల్సా చేయడానికే వెళ్లారా? తానే సొంతంగా ఇలా ఫారిన్ ట్రిప్ వేశారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి, అంత లగ్జరీ జర్నీ చేయడానికి మంత్రి గారేమైనా అంబానీ, అదానీ, టాటా, బిర్లాల ఫ్యామిలీనా అంటే కానే కాదు. పోనీ, విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలాంటోడా అంటే అంత సీన్ కూడా లేదాయే? పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు, పవర్‌ప్లాంట్లు, మైనింగ్, కాంట్రాక్టులు, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ లాంటి బిజినెస్‌లు ఏమైనా ఉన్నాయా అంటే లేవాయే. జస్ట్, ఆయనో ధనిక రైతు మాత్రమే. ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన డీటైల్స్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ కేవలం ఐదున్నర కోట్లు మాత్రమే. అదే నిజమైతే.. లేటెస్ట్‌గా మంత్రి గారు చేస్తున్న రష్యా పర్యటనకే సుమారు 5 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. అలాగైతే, బాలినేని తనకున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని రష్యా టూర్‌కు వెళ్లారా? అలా కాకపోవచ్చు. మరి, 5 కోట్ల ఆసామి.. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని రష్యాకు వెళ్లేంత సీన్ ఎక్కడిది? ఇలా సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు.
కొన్ని కామెంట్లు, మీమ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. జగన్‌రెడ్డికి మంత్రి బాలినేని బంధువు కాబట్టి.. ఆయన పని మీద ఈయన వెళ్లి ఉంటారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇవేవీ కావు.. ఫోటోకు యాడ్ చేసిన క్యాప్షన్‌లో ఉన్నట్టు.. లివ్ లైఫ్ విత్ నో ఎక్స్యూజెస్.. ట్రావెల్ విత్ నో రిగ్రెట్.. కాన్సెప్ట్‌తో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డినే సొంతంగా.. టైమ్ పాస్‌కు.. సొంత డబ్బులతోనే.. ఇలా ఖరీదైన లగ్జరీ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్‌లో రష్యా ట్రిప్‌కు వెళ్లారంటే మాత్రం.. కచ్చితంగా సీబీఐ, ఈడీ విచారణ జరగాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ కేవలం 5.75 కోట్లు మాత్రమే కాబట్టి.