సీనియర్ ఐపీఎస్ బదిలీకి అసలు కారణం ఇదా? ఇలాంటి రాజకీయాలు ఉంటాయా?
posted on Sep 6, 2021 @ 5:11PM
తెలంగాణ రాష్ట్రంలో ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి.. జనాల్లోనూ ఆయన క్రేజీ ఉన్న ఆఫీసర్.. కీలక కేసుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలకు జనం జేజేలు కొట్టారు. అంతటి ఫేమస్ ఐపీఎస్ ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. పోలీస్ శాఖతో సంబంధం లేని ఓ విభాగానికి అధికారిగా నియమించింది. సూపర్ కాప్ గా పేరున్న ఆ అధికారి ట్రాన్స్ ఫర్ అంశం జనాలకు షాకింగ్ గా మారింది. ఆయన బదిలీ ఎందుకు జరిగింది? సాధారణ బదిలీల్లో భాగంగానే జరిగిందా? లేక ఏమైనా బలమైన కారణాలున్నాయా? అన్న చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది.
అయితే ఆ సీనియర్ ఐపీఎస్ బదిలీ వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఓ కేంద్ర మంత్రి ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో ఓ సంస్థ అక్రమ బాగోతం బయటపడింది. రూ.780 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసులు ఆ సంస్థ ఎండీని అదుపులోకి తీసుకున్నారు. తన సంస్థ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద అతడు రుణాలు స్వీకరించారని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థపై గతంలో సెబీ నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను సంస్థ ఎండీ బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన ఆ సంస్థ ఎండీ విషయానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి బదిలీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలో ఓ కేంద్ర మంత్రికి వాటా ఉందని సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారికి.. ఆ సంస్థలో కేంద్రమంత్రికి ఉన్న వాటాలకు సంబంధించిన ఆధారాలు దొరికాయట. అంతేకాదు ఆ సంస్థ ఎలా అక్రమాలకు పాల్పడింది.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న వివరాలతో ఆయన సమగ్ర నివేదిక రూపొందించారట. ఆ సంస్థ చేసిన అక్రమాలతో పాటు కేంద్ర మంత్రి వాటాకు సంబంధించిన వివరాలను కేంద్ర పెద్దల దృస్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేశారట ఆ సీనియర్ ఐపీఎస్.
పోలీసులు కేసు బుక్ చేసిన సంస్థలో తనకు సంబంధించిన వివరాలు సేకరించారే విషయాన్ని గ్రహించిన సదరుకేంద్ర మంత్రి.. మరో దారిలో చక్రం తిప్పారని అంటున్నారు. నేరుగా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను కలిస్తే అనుమానం వస్తుందనే భయంతో మరో ప్లాన్ చేశారట. పక్క రాష్ట్రంలోని ముఖ్య నేత ద్వారా పావులు కదిపారట. తనకు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న కేంద్ర మంత్రి కోసం పక్క రాష్ట్ర కీలక నేత... కేసును దర్యాప్తు జరుగుతున్న ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడారట. మొదటి నుంచి వాళ్లిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో అతను కూడా ఓకే అన్నాడట. సీన్ కట్ చేస్తే ఆ సీనియర్ అధికారిని బదిలీ చేస్తు ఉత్తర్వులు వచ్చేశాయి. ఇటీవలే దేశ ప్రధానిని కలిసి రాష్ట్ర పెద్ద.. ఈ విషయంపైనా, కేంద్రమంత్రికి సంబంధించిన విషయాలపైనా చర్చించారని తెలుస్తోంది.
తమకు నమ్మకస్తుడిగా ఉన్న కేంద్ర మంత్రి కోసం రెండు రాష్ట్రాల కీలక నేతలు.. అలా సాయం చేశారనే చర్చ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ వర్గాల్లోనూ సాగుతోంది. ఇక్కడే మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి బదిలీకి కారణమని భావిస్తున్న కేంద్రమంత్రికి.. దేశ రాజధానిలో ఖరీదైన భవంతిని ఓ పారిశ్రామిక వేత్త నిర్మించి ఇస్తున్నారట. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంస్థ ఎండీకి.. ఆ పారిశ్రామిక వేత్తకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.