40 సెంమీ వర్షం.. ఉత్తర తెలంగాణ అతలాకుతలం!ఢిల్లీ నుంచి కేసీఆర్ రివ్యూ..
posted on Sep 7, 2021 @ 12:05PM
ఉరుము ఉరిమింది. విరుచుకుపడింది. కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఆ జిల్లాల్లో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలన్ని ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. చిన్న ,మధ్య తరగతి ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో వరదలతో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాగులన్ని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
వరంగల్ జిల్లాలోని నడుకుడలో రికార్డ్ స్థాయిలో 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మల్యాలలో 31, హుజారాబాద్ మండలం బోర్నిపల్లిలో 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 25,జమ్మికుంటలో 25, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 23 సెంటిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 14 మండలాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురవగా..60 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో వరంగల్ నగరం మహా సముద్రంలా మారిపోయింది. వందలాది కాలనీలు చెరువులుగా కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి భారీగా వరద చేరింది. రెండో ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయంటే వరద పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల పూర్తిగా నీట మునిగింది. నర్మాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోని చెరువులన్ని నిండి అలుగు పోస్తుండటంతో సిరిసిల్లలో వరద భారీగా వస్తోంది. కుండపోత వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణం నిండు చెరువును తలపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరదనీరు పలు కాలనీల్లోకి వచ్చి చేరుతోందని... సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.
భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు
మరోవైపు తెలంగాణకు రానున్న రెండు రోజులు అత్యంత భారీవర్షాల ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో మంగళవారం ఐదు జిల్లాల్లో, బుధవారం మరో నాలుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం పెద్దపల్లి, జయశకంర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనుండగా, బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర జిల్లాల్లోనూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం రాత్రి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు.