వినాయక చవితిపై రచ్చ ఎందుకు? ఓ పార్టీ టార్గెట్ గా రాజకీయ కుట్రా?
posted on Sep 7, 2021 @ 12:05PM
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండుగపై రచ్చ జరుగుతోంది. వినాయక చవితి వేడుకలను ఇండ్లలోనే నిర్వహించుకోవాలన్న జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతల ప్రకటనలు, ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న వినాయక చవితి వివాదంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే వేడుకలపై ఆంక్షలెందుకు పెట్టారన్న చర్చ జరుగుతోంది. ఓట్ల రాజకీయంలో భాగంగానే వినాయక చవిత వేడుకలపై రచ్చ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపిలో గతంలో జరిగిన పరిణామాలను కొందరు గుర్తు చేస్తున్నారు.
నిజానికి వినాయక చవితి వేడుకలు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకతో పోలీస్తే ఆంధ్రప్రదేశ్ లో తక్కువగానే జరుగుతాయి. ముంబై తర్వాత గణేష్ వేడుకలకు హైదరాబాదే టాప్. తెలంగాణతో పాటు భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్ లో వేలాది విగ్రహాలను ప్రతిష్టిస్తారు. నవరాత్రోత్సవాల తర్వాత నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. వినాయక చవితి అనగానే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్ మహా గణపతిని చూసేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తారు. గణేష్ నిమజ్జనోత్సవం రోజు లక్షలాది మంది శోభాయాత్రలో పాల్గొంటారు. ఏపీలో ఇంతగా ఉండదు. కాని వేడుకల సందర్భంగా వేలాది మంది గుమిగూడే తెలంగాణలో... అక్కడి సర్కార్ ఎలాంటి అంక్షలు పెట్టకపోగా.. ఏపీ సర్కార్ ఆంక్షలు విధించడం ప్రశ్నగా మారింది. వినాయక చవితి వేడుకలపై జగన్ రెడ్డి సర్కార్ ఎందుకు మొండిగా వెళుతుందన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
వినాయక చవితి వేడుకలపై జగన్ సర్కార్ ఆంక్షలు పెట్టడంపై జనాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ వెంటనే రంగంలోకి దిగింది. ఏపీ సర్కార్ పై యుద్ధం ప్రకటించింది. ఏపీలో నిమజ్జోనత్సవం వైభవంగా జరిగే కర్నూల్ లో వెళ్లారు ఏపీ బీజేపీ నేతలు. జగన్ సర్కార్ కు వార్నింగులు ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పండుగను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోవాలని సవాల్ చేశారు. కమలనాధులకు కౌంటర్ గా వైసీపీ నేతలు నోటికి పని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేయవద్దంటూ ఎదురు దాడికి దిగారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రులు మండిపడుతున్నారు. ఇక హిందూ సంస్ధలు కూడా గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన శోభా యాత్రలను ఈసారి ఏపీలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాయు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో వినాయక చవితి వేడుకలు కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయాయి.
ఇదే ఇప్పుడు ఏపీ జనాల్లో పలు అనుమానాలకు కారణమవుతోంది. గత ఏడాది ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరిగాయి. అంతర్వేది రథచక్రం దగ్ధం మొదలుకుని... వరుసగా ఆలయాల ధ్వంసం కొనసాగింది. విగ్రహాలు ధ్వంసం చేయడాలు, హుండీలు ఎత్తుకెళ్లడాలు సహా ఆలయాల్లో రోజు ఏదో ఒక విధ్వంసం జరిగింది. దాదాపు 140 ఆలయాలపై దాడులు జరిగాయని హిందూ సంస్థలు ప్రకటించాయి. మరో భద్రాద్రిగా చెప్పుకునే సుదీర్ఘ చరిత్ర కలిగిన రామతీర్థంలో జరిగిన విధ్వంసకాండ రాష్ట్రాన్ని షేక్ చేసింది. రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆలయాలపై దాడులకు నిరసనగా అప్పుడు కూడా బీజేపీ తీవ్ర నిరసనలు చేపట్టింది. బీజేపీ నేతలు ఆలయాలను సందర్శించి హడావుడి చేశారు. అయినా ఆలయాలపై దాడులు కొనసాగాయి. దీంతో దాడులను ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోతుందనే ప్రశ్నలు జనాల నుంచి వచ్చాయి. దాడుల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఓ వర్గం ఓటు బ్యాంక్ ఓ పార్టీ వైపు మళ్లే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. వైసీపీ పార్టీకి ముస్లింలు, క్రిస్టియన్లు పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటున్నారు. మెజార్టీ హిందువులు టీడీపీకి సపోర్టుగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం.. దానిపై బీజేపీ ఆందోళనలు చేయడంతో.. ఆ పార్టీకి మైలెజ్ వచ్చినట్లు కనిపించింది. ఈ విషయంలో బీజేపీకి ప్లస్ అయినా వైసీపీకి పెద్దగా నష్టం ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీకి మద్దతుగా ఉంటున్న ఓ వర్గం ఓట్లలో చీలక తెచ్చేలా అదంతా జరిగిందనే వాదన బలంగా వినిపించింది.
ఆలయాలపై దాడుల సందర్బంగా రాజకీయ కుట్రలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను బలం చేకూరేలా అప్పటి ఘటనలు జరిగాయి. ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు రోడ్డెక్కడంతో పరిస్థితి మారిపోయింది. రామతీర్థాన్ని సందర్శించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపించారు. ముఖ్యంగా సీఎం జగన్, ఆయన మంత్రులు, అధికారులు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్న తీరుపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. పాస్టర్లకు నెలకు ఐదువేల సాయం ఇవ్వడం, పోలీసు స్టేషన్లలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడం, తిరుమల కొండపై జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వంటి పరిణామాలను గుర్తి చేస్తూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు వ్యాఖ్యలను జాతీయ మీడియా హైలెట్ చేసింది. చంద్రబాబు రామతీర్థం పర్యటన తర్వాత ఒక్కసారిగా ఏపీలో ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. ఇతర పార్టీలు సైలెంట్ అయ్యాయి.
ఇప్పుడు కూడా గతంలో జరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయక చవితి వేడుకలపై ఏపీ సర్కార్ ఆంక్షలు పెట్టిందని, అందుకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తోందని చెబుతున్నారు. దీని ద్వారా ఓ వర్గం ఓట్లు ఓ పార్టీకి పోలరైజ్ అయ్యేలా కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్డడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయ లబ్ది కోసం అత్యంత సున్నితమైన అంశాలను వివాదం చేయడం సరికాదని అంటున్నారు. ఏపీకి ఇది మంచిది కాదని కూడా సూచిస్తున్నారు. వినాయక చవిత వేడుకల సాక్షిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జనాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.