యేసుకు లేని కరోనా వినాయకుడికేనా? జగన్‌పై ముప్పేట దాడి..
posted on Sep 6, 2021 @ 4:30PM
వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్థాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని మండిపడ్డారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.
అటు, ఎంపీ రఘురామ సైతం రంగంలోకి దిగాపోయారు. ఏపీలో వినాయక చవితి పండగపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై తనదైన స్లైల్‌లో సెటైర్లు వేశారు. ఆయన అడిగే ప్రశ్నలన్నీ పక్కా లాజికల్‌గా ఉంటాయి. అందుకే, రఘురామ నోటి నుంచి వచ్చే తూటాల్లాంటి మాటలు.. జగన్ను తూట్లు పొడుస్తుంటాయి. ఇక వినాయక చవితి ఆంక్షలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నలు సంధించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.
యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఎందుకని నిలదీశారు రఘురామ. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని ప్రశ్నించారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఎందుకని సీఎం జగన్‌పై మండిపడ్డారు. వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారని.. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేశారని.. మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామని.. ఇలా ఏ విషయంలోనూ లేని ఆంక్షలు.. వినాయకుడి పండగ వేడుకలకే ఎందుకని నిలదీశారు ఎంపీ రఘురామ.
విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయిన వారు.. విగ్రహాలు అమ్మనీయకుండ చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రఘురామ అన్నారు. మొహర్రం అప్పుడు లేని కరోనా.. ఇప్పుడు వినాయక చవితికి ఎలా వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి బెట్టు వీడి.. అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని సూచించారు. నిబంధనలు పెట్టి పండుగలు చేసుకునేందుకు అనుమతించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
మరోవైపు, హిందువుల మనోభావాలను ఏపీ సీఎం జగన్ కించపరుస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. వినాయక చవితి ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న నిబంధన సరికాదని తప్పుబట్టారు. కొవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఇలా జగన్ సర్కారు తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.