షర్మిల ఫందా మారింది..ప్రయోజనం ఉంటుందా?
posted on Sep 7, 2021 @ 12:54PM
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో అనేక పార్టీలు పుట్టాయి. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లుగా. అలా పుట్టిన చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. చక్కటి, ఉద్యమ నేపధ్యం ఉన్న కొదండ రామ్ పెట్టిన తెలంగాణ జన సమితి మొదలు అదే పంధాలో పుట్టిన ఇతర పార్టీలు ఏవీ నిలదొక్కుకోలేక పోయాయి. ఉద్యమ నేపధ్యం ఉన్న నాయకులు, తామే పెంచి పోషించిన ముఖ్య నాయకుని ముందు నిలవలేక పోయారు. రాజకీయ ‘నీచ’ సూత్రాలలో ఒకే సారి పది పట్టాలు పుచ్చుకున్న, కుటుంబ పార్టీ నాయకుడి రాజకీయ, ఛ-తురతను తట్టుకోలేక పోయారు.
ఏపీ ఆడబిడ్డ, తెలంగాణ కోడలు వైఎస్ షర్మిల స్థాపించిన, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఇప్పుడు అదే కోవలోకి చేరిపోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజన్న రాజ్యం అజెండాతో వైఎస్సార్ జెండా పట్టుకుని, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడమే, వింతల్లో కెల్లా వింత. ఎవరి అండదండలతో ఎవరి కోసం, ఆమె పార్టీ స్థాపించారు అనేది పక్కన పెడితే, పార్టీ ప్రారంభించి నిండా రెండు నెలలు అయినా కాకముందే, పార్టీ సంక్షోభంలో చిక్కుకోవడంలో మాత్రం ఎలాంటి వింత విడ్డురం లేదనే చెప్పవచ్చును. ఈ ఊరు కరణం ఆ ఊరు వెట్టి’ అనే సామెత ఎరక్కుండా, జెండా ఎగరేసిన షర్మిల ఇప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉనికిని కాపాడుకునేందుకు కష్ట పడుతున్నారు.చివరకు తల్లి విజయమ్మ, నోరు తెరిచి షర్మిలను దీవించమని వైఎస్ సహచర, అనుచర గణాలను కోరినా, స్పందన లేకుండా పోయింది.
పార్టీలో చేరిన నాయకులు కూడా ఒకరొకరుగా పార్టీ వదిలి పోతున్నారు. నిజానికి షర్మిల పార్టీలో పేరున్న నాయకులు, పట్టుమని పదిమంది లేరు. అయినా ఇప్పటికీ, చేవెళ్ల ప్రతాప రెడ్డి, ఇందిరా శోభన్, రెండు రోజుల క్రితం మరో కీలక నేత, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్, ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా నలుగు రోజులు పోతే మిగిలిన నలుగురు కూడా ఎవరిదారి వారు చూసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. పార్టీ ప్రారంభానికి ముందు కొంత సందడి కనిపించినా, ఆ తర్వాత ప్రతి మంగళవారం పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపడుతున్న నిరుద్యోగ దీక్ష మాత్రమే పార్టీని ఉనికిని నిలబెడుతోంది. అయితే, ఆ ముచ్చట కూడా అట్టే కలం నిలవలేదు. ముందున్న జోష్ లేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పలకరించేందుకు వెళితే, అక్కడా అవమానాలే ఎదురవుతున్నాయి. మరో వంక, జనం కూడా ఆమె దీక్షలను పట్టించుకోవడం లేదన్న వార్త లొచ్చాయి. నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే షర్మిల ఇప్పుడు రూట్ మార్చారు. కొండ మన దగ్గరకు రాకపోతే మనేమే కొండ వద్దకు వెళ్ళాలనే సామెతను వంట పట్టించుకుని, రేపటి (సెప్టెంబర్ 7)నుంచి యూనివర్సిటీల ముందు దీక్షలు చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రేపు, పాలమూరు యూనివర్సిటీ ముందు నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం యూనివర్సిటీ ముందు ఆందోళనలు చేయాలని భావిస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి అక్కడే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వరుసగా 8 చోట్ల ఉద్యోగ దీక్షలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు దీక్షలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండు చోట్ల కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. మంచిర్యాల జిల్లా సిరిసేడులో ఓ నిరుద్యోగి కుటుంబం షర్మిలను రావొద్దని విజ్ఞప్తి చేసింది.
ముందుగా అనుకున్నట్లు రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న 167 కుటుంబాలను షర్మిల పరామర్శించాలని అనుకున్నారు. అయితే ఆ సంకల్పానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని షర్మిల భావించారు. దీంతో ఆమె రూటు మార్చుకున్నారు. ఇకపై యూనివర్సిటీల ముందు ఆందోళనకు సిద్దమవుతున్నారు. అయినాఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడవలసి వుందని అంటున్నారు, రాజకీయ పండితులు.