స్కూల్ బుక్స్‌లోనూ మత ప్రచారం!.. జగన్ సర్కారు నిర్వాకం..
posted on Sep 15, 2021 @ 12:03PM
స్లో పాయిజన్ అంటే తెలుసుగా. కొద్ది కొద్ది మోతాదులో.. ఎవరికీ అనుమానం రాకుండా.. క్రమ క్రమంగా విషాన్ని ఎక్కించడం. కొంత కాలం తర్వాత అది తన ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తవుతుంది. మత మార్పిడిలు, మత ప్రచారమూ ఇలానే సాగుతుందని అంటారు. ప్రత్యేకించి ఓ మతం గురించే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. చిన్న పిల్లలను పోగేసి.. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు ఆశ చూపించి.. ఆదివారం ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. బాల్యం నుంచే వారికి ఓ మతం గురించి బోధిస్తూ.. వారిని తమ మతంలో కలిపేసుకుంటారనే ఆరోపణ ఉంది. అదంతా ప్రైవేటు వ్యవహారం. అది వేరే విషయం అనుకోండి. కానీ, అలాంటి భావజాలమున్న కార్యక్రమాన్నే ఏకంగా ప్రభుత్వమే చేపడితే..? నేరుగా చిన్నపిల్లల పాఠ్యపుస్తకాల్లోనే మత పోకడలు చొప్పిస్తే..? ఏమనాలి? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే ఏపీ విద్యాశాఖ తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.. అది మత ప్రచారమే అంటూ మండిపడుతున్నారు.
ఐదో తరగతికి చెందిన తెలుగు వాచకంలోని ఓ అంశం ఇప్పుడు వివాదాలకు కేంద్రమైంది. ఒక మతానికి చెందిన అంశాన్ని కావాలనే చేర్చాలనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంపొందించేందుకు.. ఉద్దేశించిన అభ్యాసంలో.. ఒక మతానికి సంబంధించిన అంశం చేర్చారు. ఓ పేరాగ్రాఫ్ ఇచ్చి.. దానిలోని అంశాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేయాలనేది ఆ అభ్యాసం. అయితే, ఆ పేరాగ్రాఫే ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే....
‘‘గుణదల మేరీమాత చర్చికి వెళ్లాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులంతా కొండపైకి నడిచివెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచివెళ్లాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం’’ అంటూ సాగింది. ఇదంతా ఓ మతానికి సంబంధించిన అంశం కావడంతో.. ఆ మత ప్రచారం కోసమే ఇలాంటి పేరాగ్రాఫ్ ఇచ్చారనేది విమర్శ. అందుకు మరింత బలం చేకూర్చేలా.. గతంలో ఓ జూ గురించి పేరాగ్రాఫ్ ఉండగా.. ఇటీవల ఆ జంతు ప్రదర్శనశాల గురించి తీసేసి.. ఇలా గుణదల మేరీమాత చర్చిని చొప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చర్చిని.. మేరీమాతను, ప్రార్థనలను పరిచయం చేయడానికే ఇలాంటి పేరాగ్రాఫ్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఆ పేరాగ్రాఫ్‌కు చర్చి ఫోటోను కూడా చేర్చడం.. పిల్లలను అటువైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నమని తప్పుబడుతున్నారు.
మామూలుగానైతే ఇలాంటి అభ్యాసాల కోసం.. ఏదైనా ప్రసిద్ధ ప్రదేశం గురించి కానీ, ప్రముఖ వ్యక్తుల గురించి కానీ, పర్యాటక కేంద్రాల గురించి కానీ పేరాగ్రాఫ్ ఇస్తుంటారు. కానీ, కావాలనే ఒక మతానికి సంబంధించిన ప్రదేశం గురించి చెప్పడం వెనుక దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తున్నారు. ఐదో తరగతి స్థాయి పిల్లలకు ఇలాంటి అభ్యాసాలు పెట్టడం వల్ల అది వారి మనసుల్లో మతపరమైన బలమైన ముద్ర వేసేందుకు ఛాన్స్ ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. ఏపీ విద్యాశాఖ ఇలాంటి అభ్యాసాన్ని పాఠ్యపుస్తకంలో ముద్రించడం సమర్ధనీయం కాదంటున్నారు. వెంటనే ఆ టాపిక్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.