సజ్జలకు కేబినెట్ బెర్త్? తెలుగు పన్నీర్ సెల్వం అవుతారా?
posted on Sep 15, 2021 @ 3:34PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతీసి అడుగేయాలంటే, అయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అయినా, ఆయన ఓకే చేస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది. ముందు అయన దర్శనం చేసుకుంటేనే, ముఖ్యమంత్రి దర్శనం లభిస్తుంది. అలాగని ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో కాదు, చివరకు జైల్మేట్ కూడా కాదు. ఎంపీ, ఎమ్మెల్యే అసలే కాదు. నిజానికి ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన పాత్ర ఇంచుమించుగా జీరో. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, ఫ్యామిలీ పాలిటిక్స్ విషయంలోనూ ఆయనే మాటే. ‘బైబిల్’ వాక్కు.
వైసీపీలో ఆయన కీలక బాధ్యతలే నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీగానూ పనిచేశారు. అయినా, నెంబర్ 2 షాడో తొలిగే వరకు ఆయన చాలావరకు తెర చాటునే ఉండి పోయారు. నెంబర్ 2 ను మేఘాలు కప్పేయడంతో, అయన వెలుగులోకి వచ్చారు. ఆయన ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును,ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అయిన వారిని, కానీ వారిని అనేక మందిని సలహాదారులుగా నియమించారు. అలా నియమించిన ‘మంద’ లో ఆయన కూడా ఒకరు. అయితే, కలిసొచ్చె కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నట్లు, ఆయనకు కాలం కలిసొచ్చింది. కారణాలు ఏవైనా ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితునిగా ముద్ర పడింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు రాజకీయ వివివాదాలు, పరిష్కారాల వరకు అన్నిటికీ ఆయనే కేంద్ర బిందువు. ఇన్ని మాటలెందుకు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అంటారు.
అదే సమయంలో అయన సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ వ్యవహారాల్లో ఎలా వేలు పెడతారనే విమర్శలు వినవచ్చాయి. విమర్శలు మాత్రమె కాదు, ఏకంగా ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రపై న్యాయస్థానంలో పిటీషన్ కూడా దాఖలైంది. అయితే ‘మరకా మంచిదే’ అన్నట్లుగా, ఈ మరక కూడా ఆయనకు మరో అదృష్ట రేఖగా మారింది. ఈ గొడవంతా ఎందుకని అనుకున్నారో ఏమో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే తంతే వెళ్లి గారెల బుట్టలో పడినట్లు సజ్జల అదృష్టమే అదృష్టం. అలాగే రేపు ఏదైనా జరగరానిది జరిగి మళ్ళీ జైలుకు వెళితే, తెలుగు పన్నీర్ సెల్వం అయ్యే అదృష్తం కూడా దక్కవచ్చని అంచున్నారు.
ఎటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ కూర్పు సమయంలోనే మంత్రి పదవి అంటే ఐదేళ్ళు అనుకునేరు, రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పూర్తిగా మారిపోతుంది, మీరంతా మాజీలు అయిపోతారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఆ ఆగడువు ముగింపు దశకు చేరుకుంది. కాబట్టి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం రానే వచ్చింది ఈ నేపధ్యంలో కొత్త మంత్రివర్గం కూర్పు పై జరుగతున్న చర్చల్లో సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సజ్జలకు కాబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే, ఆయన శాసన సభ సభ్యుడు కాదు.. కాబట్టి ఆరు నెలలలో అయన ఎమ్మెల్యే,/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. అదెంత పని రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..