వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా?
posted on Sep 15, 2021 @ 3:51PM
దేశంలో ప్రస్తుతం అన్ని అతి పెద్ద సమస్యల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకటి. గత కొన్ని రోజులుగా పెరిగిపోతున్న ధరలతో పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు గుది బండగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందులు కల్గిస్తోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్విహించిన సర్వేల్లో గతంలో కంటే ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలేనని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం వైఖరిలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. పెట్రోల్, డీజల్ ధరలు తగ్గేలా కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం.. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండబోతోంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ గ్రాఫ్ పెరిగింది. గతంలో మోడీ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న వారు.. బలంగా వాదనలు వినిపించిన వారు సైతం పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం తీరును తప్ప పట్టే పరిస్థితి. ఈ సెగ కేంద్రానికి తాకినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు గండంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలుస్తోంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలో మోడీ సర్కార్ ఉందని సమాచారం. ఈనెల 17న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీలోకి మద్యం.. పెట్రోల్.. డీజిల్.. విమాన ఇంధనం లాంటి కొన్నింటిని జాబితాలో చేర్చలేదు. అయితే.. పన్ను ఎక్కువగా ఉండే లిక్కర్.. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అయితే.. దీనిపై ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. జీఎస్టీలోకి చేరిస్తే.. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటమే దీనికి కారణం. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్ను విధించే వీలుంది. ఒకవేళ.. దీన్ని తీసుకొస్తే.. రాష్ట్రాలతో పాటు.. కేంద్రం కూడా భారీగా పన్ను ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల్ని నడిపిస్తోంది లిక్కర్.. పెట్రోల్.. డీజిల్ మీద పన్ను ఆదాయమే.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.80 డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్ను వసూళ్లను చేపడుతున్నాయి. ఒకవేళ.. వీటిని జీఎస్టీలోకి తీసుకెళితే.. పన్ను 28 శాతానికి మించి వేసే అవకాశం ఉండదు. రాష్ట్రాలు కూడా అదనంగా పన్ను విధింపులకు అవకాశం ఉండదు. అదే జరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గటం ఖాయం. మరి.. కీలకమైన పన్ను ఆదాయాన్ని కోల్పోయి మరీ ధరలు తగ్గేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది.. చూడాలి మరీ.. పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపునకు కేంద్రం ఏం చేయబోతుందో...