ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. జగన్ తీరుతో అధికారుల్లో ఆందోళన..
posted on Sep 15, 2021 @ 4:11PM
జగన్‌కు, అధికారులకు, జైలుకు ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. జగన్‌తో సంబంధం ఉన్న పలువురు ఐఏఎస్‌లు ఎప్పటికప్పుడు, ఏదో రకంగా ఇబ్బందులు తప్పడం లేదు. వైఎస్ హయాంలో జగన్‌తో అంటకాగినందుకు అక్రమాస్తుల కేసులో అప్పట్లో పలువురు అధికారులు జైలుకెళ్లాల్సి వచ్చింది. అనేకమంది ఐఏఎస్‌లు సీబీఐ విచారణ ఫేస్ చేశారు. ఇదంతా గతం. ఆ గతం నుంచి అధికారులు సరైన గుణపాఠం నేర్వనట్టున్నారు. మళ్లీ అన్ని విషయాల్లో జగన్‌కు వంత పాడుతున్నారు. దీంతో, కోర్టు నుంచి మొట్టికాయలతో పాటు శిక్షలూ ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఏపీ ఐఏఎస్ అధికారులను కోర్టు ధిక్కరణ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలను కోర్టు ధిక్కరణ కేసులో నిందితులుగా నిర్ధారించింది. 29వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ, సెరీకల్చర్ విభాగాలకు వీరు ఉన్నతాధికారులుగా ఉన్నారు.
పూనం మాలకొండయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హాజురు కాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించలేదు. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ప్రభుత్వం అభ్యర్థులకు న్యాయంచేయాలని ఆదేశించింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు అధికారులు. దీంతో కోర్టు ధిక్కరణ కింద.. హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యలుగా గుర్తించి శిక్ష విధించింది హైకోర్టు. 29న శిక్ష ఖరారు చేయనుందది.
హైకోర్టు చేతిలో శిక్షకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ముత్యాలరాజు తదితర ఐఏఎస్‌లపై ఇలానే కోర్టు కన్నెర్ర జేసింది. ఇప్పుడు వీరి వంతు వచ్చింది. కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం అంగీకరించకపోతే తాము ఎలా ఉత్తర్వులు ఇస్తామనేది ఐఎఎస్ అధికారులు వాదన. తమ మాటలు సర్కారు చెవికి సోకకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అవి శిక్షలకూ దారి తీస్తుండటంతో జగన్ ప్రభుత్వంలో పని చేయడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిన్సియర్ అధికారిణిగా పేరొందిన పూనం మాలకొండయ్య లాంటి ఐఏఎస్‌లు సైతం జగన్ తీరుతో ఇలా జైలు శిక్ష ముంగిట నిలబడటం అవమానకర విషయమే.