మోడీ పైసలవి.. వెనక్కి ఇచ్చేది లేదు! రైతు ఆన్సర్ తో బ్యాంకర్లకు షాక్..
posted on Sep 15, 2021 @ 4:11PM
ఆ రైతు బ్యాంక్ ఖాతాలో ఐదున్నర లక్షల రూపాయలు జమ అయ్యాయి.. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని విత్ డ్రా చేసుకుని ఖర్చు పెట్టేశాడు ఆ రైతు. అయితే ఆ డబ్బులు రైతుకు సంబంధించినవి కావు.. బ్యాంకు ఉద్యోగి పొరపాటున ఆయన ఖాతాలోకి వచ్చినవి. తనవి కావని తెలిసినా ఆ రైతు వాటిని ఖర్చు పెట్టేశాడు. తర్వాత తప్పును గ్రహించిన బ్యాంకర్లు... రైతు దగ్గరకు వచ్చి డబ్బులు గురించి ఆరా తీయగా వాళ్లకు షాకిచ్చాడు రైతు.
బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైతు రంజిత్ దాస్‌కు స్థానిక గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈ ఏడాది మార్చిలో దాస్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే అది బ్యాంకు తప్పిదం వల్ల జరిగింది. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని తన అవసరాలకు ఖర్చు పెట్టుకున్నాడు రైతు రంజిత్ దాస్. కొన్ని రోజుల తర్వాత తప్పును గ్రహించారు బ్యాంకు ఉద్యోగులు. రైతు దగ్గరకు వెళ్లి.. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా కోరారు. కానీ దీనికి దాస్ తిరస్కరించాడు.
ఆ డబ్బులు తనకు ప్రధాని మోడీ పంపారని, తిరిగి ఇవ్వనని మొండికేశాడు. ‘ఈ ఏడాది మార్చిలో నా బ్యాంకు అకౌంట్‌లో లక్షల మొత్తంలో డబ్బులు జమవ్వగానే చాలా సంతోషించా. అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగానే తొలి విడతగా ఆ డబ్బులు నాకు పంపారేమోనని భావించా. అలా ఆ డబ్బును ఖర్చు చేసేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు’ అని చెప్పాడు.
రైతు చెప్పిన సమాధానంలో షాకయ్యారు బ్యాంక్ అధికారులు. అతన్ని ఏమి చేయలేక పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంజిత్ దాస్ ను అరెస్ట్ చేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని మాన్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు.