మోడీ బాటలో దీదీ.. పీఎం పీఠంపైనే గురి!
posted on Sep 15, 2021 @ 3:17PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి పదవి మీద ఆశలున్నాయి. ఇదేమీ రహస్యం కాదు, ఉండకూడని కోరిక కూడా కాదు. నిజానికి, ఉన్న మెట్టు మీద నుంచి పై మెట్టుకు చేరాలనే కోరిక మమతకు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు అందరికీ ఉంటుంది. అయితే అందరి కోరికలు తీరవు. అందుకే రాజకీయ నాయకులలో అసంత్రుప్తులే అధికంగా ఉంటారు.
మూడు నెలల స్వల్ప వ్యవధిలో గుజరాత్ సహా నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మార్పు నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.. రాజకీయ నాయకుల అసంతృప్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే ఆయన అన్నట్లుగా రాజకీయ నాయకులు ఎవరూ ఆనందంగా ఉండరు. ఎమ్మెల్యేలకు మంత్రి కావాలనే కోరిక ఉంటుంది, కాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంత్రులు అయిన వారికి మంచి శాఖ రావాలనే కోరిక ఉంటుంది. రాలేదనే అసంతృప్తి ఉంటుంది. మంచి శాఖల దక్కిన మంత్రులకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. కాలేదనే అసంతృప్తి ఉంటుంది. ముఖ్యమంత్రులకు కూడా తమ పదవి ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందో అన్న ఆందోళన ఉంటుంద. కాదంటే ఇదిగో ఒక మమతా బెనర్జీ, ఒక నితీష్ కుమార్ లేదా ఇంకొకరిలాగా ప్రధాని కావాలనే కోరిక ఉంటుంది.అసంతృప్తి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతటి ఆయనే ప్రధాని పదవి తమ తీరని కోరికగా జీవిత చరిత్రలో రాసుకున్నారు.
ఇలా రాజకీయాలలో పై మెట్టుకు చేరుకోవాలనే కోరిక ఆదరికీ ఉంటుంది. అందరి విషయం ఎలా ఉన్నా, ప్రస్తుత కాంటెస్ట్ లోమమతా బెనేర్జీకి మాత్రం పీఎం అయిపోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యమా అంటే, రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని అనుకోవచ్చును. అవసరం అనుకుంటే, మోడీ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధాని పీఠం చేరుకోలేదా అని సమాధానం కూడా చెప్పుకోవచ్చును. అయితే మమతా, మోడీ ఒకే స్థాయి నాయకులు అయితే కావచ్చును కానీ, మోడీ వెనక భావజాల (జాతీయ వాదం) బలముంది. దేశం అంతటా విస్తరించిన పార్టీ, సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు బెంగాల్ మినహా మరో రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. ఉందంటే, ఉందన్నట్లుగా, అక్కడా, ఇక్కడా ఒకటీ ఆరా సీట్లోలో గెలిచినా, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయం కాలేదు. నిజానికి, ఈరోజు జాతీయ స్థయిలో కాంగ్రెస్ సహా బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీ ఏదీ లేదు.
ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలదీ అదే పరిస్థితి కావడం వల్లనే మమతా బెనర్జీ కానీ, మరొకరు కానీ, ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సహా ఎన్డీఎ యేతర పార్టీలకు 2024 ఎన్నికల్లో మెజారిటీలభిస్తే. సంకీర్ణ కల సాకారం అయితే అప్పుడు మాత్రమే మమత కానీ మరొకరికి కానీ ప్రధాని పదవి దక్కే అవకాశం వస్తుంది. అది ఎంత వరకు సాధ్యం, అప్పుడు ఏమి జరుగుతుంది? అనేది పక్కన పెడితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మమత ముందు ఇప్పుదు మరో సవాలుంది. ఈనెల 30న జరిగే భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకుంటేనే.. ఆమె ఢిల్లీ కలలు సజీవంగా ఉంటాయి. సో, భవానీపూర్ విజయం ఆమె ఢిల్లి యాత్రకు తొలిమెట్టు అవుతుంది.
నిజానికి మమతా బెనర్జీ భవానీపూర్ లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. అసాధ్యం అసలే కాదు. అయితే నందిగ్రామ్ లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన నేపధ్యంలో కావచ్చు ‘దెబ్బతిన్న పులి’ని అని చెప్పుకొంటున్న మమత చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్తతో అడుగులు వేస్తున్నారు. ఉప ఎన్నికలలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్ బిశ్వాస్ కానీ దీదీకి ఏవిధంగా చూసినా దీటైనవారు ప్రత్యర్ధులు కాదు. బీజేపీ అభ్యర్థి ఇంతవరకు కనీసం కార్పొరేటర్ కూడా గెలవలేదు. అయితే మమత బెనర్జీలోని నిర్భయత్వం, ప్రియాంకలోనూ పుష్కలంగా ఉన్నాయని అంటారు. అదే మే ప్రధాన బలంగా పేర్కొంటారు. మమతా బెనర్జీ సుదీర్ఘ కాలం పాటు కమ్యూస్ట్ కూటమితో పోరాటం చేశారు. భౌతిక దాడులను ఎదుర్కున్నారు. అలాగే, ఇప్పుడు బీజేపీ అభ్యర్ధి ప్రియాంక మమత బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న హింస కాండను అంతే ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితుల పక్షాన ఆమె ఒక లాయరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు.అందుకు బెదిరింపులు వస్తున్నా నిర్భయంగా న్యాయపోరాటం చేస్తున్నారు.
అదలా ఉంటే హస్తం పార్టీ (కాంగ్రెస్) చేతు లెత్తేసింది. పోటీనే చేయడం లేదు. సీపీఎం అభ్యర్థి బిశ్వాస్ ఎన్నికలకు కొత్త. 34 ఏళ్లపాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్ , కాంగ్రెస్ తో కలిసి పోటీచేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.ఇక మమత విషయం చెప్పనే అక్కరలేదు. ఆమె ముఖ్యమంత్రిగా బరిలో దిగుతున్నారు. అంతే కాదు, ఆమె భవానీపుర ఆడ బిడ్డ. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ముస్లింల అండతోనే ఆమె 2011, 2016లలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సో, ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలుపు ఖరారైనట్లే అనుకోవచ్చును. అయితే అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరం అరంభంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో పోటీకి ఉత్సాహం చూపుతోంది. అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీతో పొత్తుకు మమత ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికల బరిలో కాలుపెట్టే ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే మమత ఢిల్లీ పీఠం చేరుకుంటారా ... కోల్ కత్తాకే పరిమితం అవుతారా? అనేది తెలియాలంటే, ఇంకొంత కాలం ఆగక తప్పదు.