మరో బీజేపీ ముఖ్యమంత్రికి ఉద్వాసన?
posted on Sep 14, 2021 @ 9:06PM
మూడు నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చిన బీజేపీ జాతీయ నాయకత్వం మరో ముఖ్యమంత్రి ఉద్వాసనకు ముహూర్తం ఖరారు చేసిందా అంటే, అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమంత్రి మార్పు గెలుపు మంత్రంగా బీజేపీ భావిస్తోందా, అంటే అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. కొద్ది నెలల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ కు పదవిని చేపట్టి నాలుగు నెలలు అయినా కాకముందే బీజేపీ అధిష్ఠానం ఉద్వాసన పలికింది. ఆవెంటనే (జూలైలో) కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని ఇంటికి సాగనంపింది. ఇక నిన్న మొన్న ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపనీని తొలిగించి భూపేంద్ర ‘పటేల్’కు పట్టం కట్టింది. ఈనేపధ్యంలో నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే అందుకు పెద్దగా తలలు బద్దలు కొట్టుకో వలసిన అవసరం లేకుండా, బీజేపీ అధిష్ఠానం అవసరమైన సంకేతాలను ఇచ్చేసింది. హిమాచల్ ముఖ్యమంత్రికి జైరాం ఠాకూర్..కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయన హడావుడిగా ఢిల్ల్లీ వెళ్లారు. ఇలా అధిష్ఠానం నుంచి పిలుపు అందుకుని ఆయన ఢిల్లీకి పరుగులు తీయడం వారం రోజుల్లో ఇది రెండో సారి.. ఈ నెల 8న దేశ రాజధానికి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. మళ్ళీ ఇంతలోనే ఢిల్లీ పిలిచిందంటే జైరాం.. కు రామ్ రామ్ .. ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఉత్తరాఖండ్, కర్ణాటక విషయంలోనూ బీజేపీ అధిష్ఠానం ఇలాగే, ముందు ఒకటికి రెండుసార్లు ముఖ్య మంత్రులను చర్చలకు పిలిచి, ఆ తర్వాత, ఇదీ సంగతి ... అంటూ అసలు సంగతి బయట పెట్టిందని ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు హిమాచల్ ముఖ్యమంత్రికి వారం రోజల్లో ఢిల్లీ నుంచి సెకండ్ కాల్ వచ్చింది. అంతే కాదు, బీజేపీ అధిష్ఠానం ఒక్క ముఖ్యమంత్రిని మాత్రమే కాదు, ముఖ్యమంత్రి ఠాకూర్ సహా హిమాచల్ప్రదేశ్ బీజేపీ కీలక నేతలు అందరినీ ఢిల్లీకి పిలిపించింది. ఈ పర్యటనలో.. ఠాకూర్ బీజేపీ హైకమాండ్తో మారోమారు చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ హిమాచల్ప్రదేశ్ ఇంఛార్జ్ అవినాశ్ రాయ్ ఖన్నా, సహ ఇన్ఛార్జ్ సంజయ్ టాండన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి పవన్ రాణా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఉపఎన్నికలపై సుదీర్ఘ మంతనాలు జరగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాత్రం ముఖ్యమంత్రి మార్పు తప్పక పోవచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ, ఇదే అదనుగా విమర్శలకు దిగింది. ఠాకూర్ను తొలగించేందుకే ఢిల్లీకి పిలిపించారని ఎద్దేవా చేసింది. ఈ విషయాన్ని బీజేపీ చేపట్టిన 'జన్ ఆశీర్వాద్ యాత్ర'లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ముఖ్యమంత్రులను మారిస్తే విజయం వరిస్తుంది అనేందుకు పెద్దగా ఆధారాలు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదీ గాక తరచూ ముఖ్యమంత్రులను మార్చడం వలన గతంలో కాంగ్రెస్ పార్టీ గట్టి ముల్యాన్నే చెల్లించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారక రామా రావు సారధ్యంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, కాంగ్రెస్ ఓటమికి ఇతర కారణాలతో పాటుగా ముఖ్యమంత్రుల మార్పు కూడాఒక ఒక మూల కారణం అనేది ఒక చారిత్రిక సత్యంగా చరిత్రలో నిలిచి పోయింది.
ఇంచుమించుగా పాతికేళ్ళ క్రితం ఢిల్లీలో బీజేపీ వరసగా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి, చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు సుష్మా స్వరాజ్ కు బాధ్యతలు అప్పగించింది. అయినా, ఆ ఎన్నికలలో బీజేపీ ఓడి పోయింది. ఇక అప్పటి నుంచి వరసగా మూడు మార్లు కాంగ్రెస్, (షీలా దీక్షిత్), ఆ తర్వాత ఇప్పుడు వరుసగా రెండవ సారి ఆప్ (అరవింద్ కేజ్రివాల్) విజయం సాధించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీనిలోని ఏడూ లోక్ సభ స్థానాలను బీజేపీ స్వీప్ చేసినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘చీపురు’ (ఆప్ సింబల్) బీజీపీని స్వీప్ చేసింది. సో.. ముఖ్య మంత్రులను మార్చినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం అయితే రాజకీయ అజ్ఞానం అవుతుంది, కాదంటే రాజకీయ అమాయకత్వం అనిపించుకుంటుంది.