మీ అయ్య జాగీరా?.. గులాబీ సభకు పొలాలు ఇవ్వం.. రైతుల గొడవ..
posted on Nov 3, 2021 @ 3:29PM
తెలంగాణలో సైలెంట్ విప్లవం వస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్నివర్గాల ప్రజలు ఏకమవుతున్నారు. రైతులైతే ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వరి వేస్తే ఉరేనంటూ కేసీఆర్ హెచ్చరించడాన్ని అన్నదాతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే, కేసీఆర్ ప్రభుత్వానికే ఉరి వేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో గులాబీ బాస్‌కు కర్రుకాల్చి వాతపెట్టారు. పోయిన పరువు నిలబెట్టుకోవడానికి.. గులాబీ ప్రభ ఇంకా తగ్గలేదని భ్రమ పెట్టడానికి.. వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన పేరుతో సభ పెడుతున్నారు. మొదట నవంబర్ 15న మీటింగ్ అనుకున్నా.. హుజురాబాద్ దెబ్బకు ఆ సభ వెనక్కి మళ్లింది. నవంబర్ 29న దీక్షా దివస్ నాడు.. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ సభా ప్రాంగణానికీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం కలకలం రేపుతోంది.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు, రైతుల మధ్య తోపులాట జరిగింది.
‘విజయ గర్జన’ సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి తదితరులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం వెళ్లారు. గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ప్రజాప్రతినిధుల దగ్గరకు.. బీజేపీ నేతృత్వంలో స్థానిక రైతులు నిరసన తెలపడానికి వచ్చారు. పంట పండే తమ పొలాలను సభ కోసం ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు.
అక్కడే ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు.. రైతులు, బీజేపీ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. కొంతమంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులపై జరిగిన దాడిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలు.