ఈటలకే జై హుజూర్.. కేసీఆర్ పై ఆత్మగౌరవ విజయం!
posted on Nov 2, 2021 @ 6:11PM
సంక్షేమ పథకాలు సాయం కాలేదు.. దళిత బంధు దారి చూప లేదు.. ఓటర్లకు కుమ్మరించిన నోట్ల కట్టలు కనికరించలేదు.. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి ఓటర్లు చుక్కలు చూపించారు. చిత్తుచిత్తుగా ఓడించారు. సీఎం కేసీఆర్ పై ఆత్మ గౌరవ నినాదం ఎత్తిన ఈటల రాజేందర్ కు జై కొట్టారు. బంపర్ మెజార్టీతో గెలిచించి జై హుజూర్ అనిపించారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే మంచి మెజార్టీతో గెలిచారు ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కమలం చతికిలపడినా.. హుజురాబాద్ లో గెలిపించడం ద్వారా హూజురాబాద్ ఓటర్లు తమది చైతన్యగడ్డని మరోసారి నిరూపించారు.
హుజురాబాద్ కౌంటింగ్ లో మొదటి నుంచి ఈటల రాజేందర్ లీడ్ కనబరిచారు. పోస్టల్ బ్యాలెట్ లో కారు కొంత లీడ్ వచ్చినా ఈవీఎమ్ కౌంటింగ్ లో మాత్రం ఫస్ట్ రౌండ్ లో లీడ్ సాధించారు. మొదటి రౌండ్ లో 160 ఓట్లతో మొదలైన ఆధిక్యం రౌండ్ రౌండ్ కు పెరుగుతూ వచ్చింది. మొదటగా లెక్కించిన హుజురాబాద్ మండలంలో రెండు పార్టీల మధ్య కొంత టఫ్ పైట్ నడిచింది. అయినా ఐదు రౌండ్లు ముగిసేసరికి 3 వేల లీడ్ లోకి వచ్చారు రాజేందర్. తర్వాత జరిగిన వీణవంక మండలంలోనూ జైత్రయాత్ర కొనసాగించారు. వీణవంక మండలం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం కావడంతో.. ఇక్కడ కారుకు లీడ్ వస్తుందని అంతా భావించారు. కాని గెల్లు సొంతూరులోనూ 191 ఓట్లు ఎక్కువ సాధించిన ఈటల.. వీణవంక మండలంలో తిరుగులేని మెజార్టీ సాధించారు. వీణవంకకు సంబంధించి ఒక్క 8 రౌండ్ లో మాత్రమే గెల్లుకు స్వల్ప మెజార్టీ వచ్చింది.
జమ్మికుంట మండలంలో వార్ వన్ సైడ్ గా సాగింది. 11 రౌండ్ తప్పించి మిగితా అన్ని రౌండ్లలో కమలం హవా కనిపించింది. మొదటి రౌండ్లలో వందల్లో వచ్చి న మెజార్టీ జమ్మికుంట మండలంలో మాత్రం వేలల్లోకి వెళ్లింది. దీంతో ఈటల లీడ్ అంతకంతుకు పెరుగుతూ వెళ్లింది. టీఆర్ఎస్ తమకు మెజార్టీ వస్తుందని లెక్కులు వేసుకున్న ఇల్లంతకుంట మండలంలోనూ ఈటల రాజేందర్ తిరుగులేని ఓట్లు సాధించారు. ఇల్లంతుకుంట మండలానికి సంబంధించిన నాలుగు రౌండ్లలోనూ ఈటలకు మంచి మెజార్టీ వచ్చింది. ఇక ఈటల సొంత మండలం కమలాపూర్ లో కమలం జెట్ స్పీడులో దూసుకుపోయింది. కమలాపూర్ కు సంబంధించి చివరి నాలుగు రౌండ్లలో ఈటలకు దాదాపు 8 వేల మెజార్టీ వచ్చింది.
మొదట కౌంటింగ్ జరిగిన హుజురాబాద్ మండలం నుంచి కమలాపూర్ మండలం వరకు అన్నిమండలాల్లోనూ ఈటల రాజేందర్ లీడ్ సాధించారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. 8, 11 రౌండ్లలో మాత్రం గెల్లుకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్ తో పాటు కౌశిక్ రెడ్డి సొంతూరులో ఈటలే లీడ్ సాధించారు. టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరులో కమలానికి 3 వందలకు పైగా మెజార్టీ వచ్చింది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్నిప్రారంభించిన హుజురాబాద్ మండలం శాలపల్లిలోనూ ఈటలకే జైకొట్టారు ఓటర్లు.